మానవ కృషి మాధవ కృప ఏరువాక!

దేశానికి అన్నం పెట్టటానికి అంకురారోపణగా నిలిచే పండగ ఏరువాక. దృఢ సంకల్పంతో కొత్త ఆశల తీరాలకు హాలికుడి పయనం ఈ పర్వదినం. అయితే, జీవన పోరాట భూమికగా ఏరువాకని ఎలా అర్థం చేసుకోవాలి? సుఖదుఃఖాలు, కష్టనష్టాల కోణంలో ఈ వెన్నెల వెలుగుల దినాన్ని ఎలా చూడాలి? మానవ జీవన గమనంలో ఏరువాక అందించే విస్తృత సందేశం ఏంటి?...

Published : 24 Jun 2021 01:38 IST

నేడు ఏరువాక పూర్ణిమ

దేశానికి అన్నం పెట్టటానికి అంకురారోపణగా నిలిచే పండగ ఏరువాక. దృఢ సంకల్పంతో కొత్త ఆశల తీరాలకు హాలికుడి పయనం ఈ పర్వదినం. అయితే, జీవన పోరాట భూమికగా ఏరువాకని ఎలా అర్థం చేసుకోవాలి? సుఖదుఃఖాలు, కష్టనష్టాల కోణంలో ఈ వెన్నెల వెలుగుల దినాన్ని ఎలా చూడాలి? మానవ జీవన గమనంలో ఏరువాక అందించే విస్తృత సందేశం ఏంటి?


వేసవిని అర్థం చేసుకుని వర్షానికి స్వాగతం పలకటం, ఆ వర్షం సాయంతో జీవన క్షేత్రాన్ని సస్యశ్యామలం చేసుకునేలా నాగలి, వృషభాలు లాంటి వాటిని వాడుకోవటం... కష్ట స్వభావాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎదుర్కోవటం, ఆనందానికి ఆహ్వానం పలకటం... భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటం... ఇదే ఏరువాక.

ఉన్నతుడిగా ఎదగాలని...

ఎండాకాలం తర్వాత జ్యేష్ఠ పూర్ణిమ నాడు వస్తుంది ఏరువాక. ఎండాకాలం అంటేనే, వడగాల్పులు, ఉక్కపోతలు. అంటే, మనిషి కష్టాలకు చిహ్నం వేసవి.

చినుకులు మొదలయ్యాక నూతనోత్సాహం, కొత్త ఊపిరి, ఆశలతో జరుపుకునే పండగ ఏరువాక. దీనికి కారణం వేసవే! ఎండాకాలం లేకుంటే వర్షపు చినుకే ఉండదు.

ఏరు అంటే నాగలి. వాక అంటే సాగటం, నది. నాగలితో పొలాన్ని దున్నుతాం. అలాగే జీవన క్షేత్రాన్ని దున్నాలంటే ఒక సాధనం కావాలి. అదే శ్రమ, పట్టుదల, కాంక్ష.

ధైర్యానికి, కష్టపడే మనస్తత్వానికి ప్రతీక నాగలి. ఎద్దులు, కాడి, ఇతర వ్యవసాయ పనిముట్లు రైతు ప్రతిభ, శక్తి సామర్థ్యాలు, నైపుణ్యానికి చిహ్నాలు.

నాగలి పట్టటం అంటే చినుకుల రూపంలో భగవంతుడు కల్పించిన పరిస్థితుల్ని వాడుకోవటానికి సంసిద్ధంగా ఉన్నట్టు. బీడు వారిన క్షేత్రాన్ని దున్నటానికి సిద్ధమయినట్టు. ఆ శక్తి రైతులోనే ఉంది. ఇలాగే కష్టనష్టాలకు ఎదురు నిలిచి అందివచ్చిన అవకాశాల ఆలంబనగా శక్తివంచన లేకుండా కృషి చేసి మనిషి ఉన్నతుడిగా ఎదగాలని చెబుతుంది ఏరువాక.

సమష్టి కృషి

నాగలిని సరిగా వాడుకోగలిగితే సారవంతం కాని క్షేత్రం ఉండదు. నాగలి, ఎద్దులు, కాడి, భగవంతుడు ఇచ్చే వర్షం... ఇదో సమష్టి కృషి. సరైన వర్షాలు లేకపోవటం, ఎక్కువ కావటం.. ఇవన్నీ ద్వంద్వ భూయిష్ఠ ప్రపంచంలో సహజం. కష్టాలుంటాయి. పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతుండాలి. అసలు మనం సహించలేని కష్టాల్ని ప్రకృతి ఇస్తుందా? ఏరువాక ద్వారా ఇవన్నీ తెలియాలి. దీన్నే ఎరుక అంటారు. అంటే జ్ఞానం. ఏరువాక అంటేనే కష్టాలను ఎదుర్కొంటూ, పోగొట్టుకుంటూ సాగటం.

వాటి సమ్మేళనమే జీవితం

జీవితంలో ప్రతిదీ రెండింటి వల్ల సాధ్యమవుతుంది. ఒకటి మానవ కృషి. రెండు మాధవ కృప. వృషభాలు, నాగలి, కాడి ఇవన్నీ మనిషి కృషికి చిహ్నాలు. అయితే, వర్షం మనిషి చేతుల్లో లేదు. దానికి మాధవ కృప కావాలి.

‘నల్లని మేఘమాల గగనమ్మున గ్రమ్మినవేళ గుండియల్‌/ ఝల్లని నెమ్మెయిన్‌ పరవశత్వము మేకొను, భూతధాత్రిపై/ చల్లని సత్కృపారసము చల్లగ నెల్లరు సంతసిల్లగా/ మెల్లగ సాగివచ్చె పరమేశ్వరుడంచనిపించు నెందుకో’ అని కారుమేఘాన్ని సాక్షాత్తూ దేవదేవుడితో పోలుస్తారు ప్రఖ్యాత కవి కరుణశ్రీ. భగవంతుడు నేరుగా రాలేడు కాబట్టి, మేఘం రూపంలో వచ్చినట్టు.

మానవ కృషి అందరికీ కనిపిస్తుంది. కానీ, మాధవ కృప తెలియదు. రైతు పంట పండిస్తాడు. దానికి కావాల్సిన బొగ్గు పులుసు వాయువు మనది కాదు. నేల, కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన కాంతి మానవుడి సృష్టి కాదు. పంట పండించటంలో రైతు నైపుణ్యం కనిపిస్తుంది. కానీ, ఆ పంటను మనం తయారు చెయ్యలేదు. మట్టిని, నీటిని ఒక ఫలంలా, కాయగూరలా మార్చాలంటే ప్రకృతికే సాధ్యం. అందుకే, ప్రతిదీ మానవ కృషి, మాధవ కృపల సమ్మేళనం. దానికి నిదర్శనం ఏరువాక.
అక్కడ మొదలు

జీవితంలో కష్టాలు వచ్చాయని దుఃఖిస్తారు. వాటి స్వభావాన్ని మాత్రం అర్థం చేసుకోరు! అసలు భగవంతుడు కష్టాల్ని ఎందుకిస్తాడు? ప్రకృతి వేసవిని ఎందుకిస్తుంది? ఎప్పుడూ వానాకాలం ఉంటే బాగుంటుంది కదా! కానీ, వేసవి లేకుంటే వర్ష రుతువే లేదు. ఆ వేడిలోనే సముద్రపు నీరు ఆవిరై వర్షం రూపంలో కురుస్తుంది. వేసవి ప్రసవించిన శిశువు వర్ష రుతువు. దీన్ని గ్రహించటమే జీవితం.

వాన కావాలంటే వేసవి వేడిని మనం భరించాల్సిందే. అలాగే, ఆనందం అందుకోవాలంటే దానికి సోపానమైన కష్టాల్ని కూడా సహించాల్సిందే.

వేసవిని ద్వేషించకుండా అది అవసరం, సహజం అని తెలుసుకుంటే భరించటం తేలికవుతుంది. దాన్ని సహిస్తూ రాబోయే వర్షాన్ని ఎంత బాగా ఉపయోగించుకోగలం అని ఆలోచించాలి. మానవ కృషి అక్కడ మొదలవుతుంది.

వేసవిని సరిగా ఎదుర్కోవటమే కాదు, వర్షాన్ని సరైన పద్ధతిలో వాడుకోవటం కూడా ముఖ్యం. లేకుంటే మాధవ కృప వృథా అయినట్టే.

ఆ తోడ్పాటు...
మనిషిలో ఒక ఆశావహ దృక్పథం సృష్టించి, అదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ముందుకు సాగిపోవటాన్ని సూచించే పండగ ఏరువాక. నాగలిని భుజాన వేసుకోవటమంటే కృషికి అవకాశం. చిగురించే ఆశల్ని నిజం చేసుకోవటానికి మొత్తం శక్తి సామర్థ్యాల్ని వాడుకుంటూ సాగటం. ఆ కోణంలో ఏరువాక అన్ని రకాలుగా జీవితాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తూ, జీవన వ్యవసాయంలో మనిషిని సమర్థుడైన రైతుగా నిలిపేందుకు తోడ్పడుతుంది.

ద్వంద్వ భూయిష్ఠం

ద్వంద్వాలు అనే ఇటుకలతో నిర్మించిన సౌధం మన జీవితం. ఇవి రెండూ ఎప్పుడూ ఘర్షణపడుతుంటాయి. దాన్ని మాన్పించగలమా? వాటి స్వభావం తెలిసినప్పుడు అది సాధ్యమే!

వేసవి వల్లనే వర్ష రుతువు వస్తుంది అని తెలిసినప్పుడు ఆ రెండు రుతువుల మధ్య యుగళగీతం వీలవుతుంది. అలాగే కష్టం ఉన్నప్పుడు సుఖం కూడా ఉంటుందని అర్థం చేసుకోగలిగితే ఆవేదనకు తావుండదు.

జ్ఞాని అయినవాడు ఏరువాకకు వేసవి చేసిన మేలు మరవడు. అవి రెండూ భగవంతుడి సృష్టే.

మన ప్రతిభతో ఎదుర్కోలేని సమస్యల్ని భగవంతుడు ఇవ్వడు. కష్టంలోంచి సుఖం వస్తుంది. రావణుడు, తాటకి లేకుంటే రాముడు ఒక మామూలు రాజుగా మిగిలిపోయేవాడు. రాముణ్ని అంత గొప్పగా నిలిపింది రాక్షసులు కాదా?  

కష్టాలు భౌతికంగా, మానసికంగా వచ్చినా, ఈ ద్వంద్వ భూయిష్ఠ జీవితంలో అవి సహజమని అర్థం చేసుకోవాలి. అప్పుడే వాటిని సమర్థంగా ఎదుర్కోగలం. ఎప్పుడో ఒకసారి వచ్చే కరోనా వైరస్‌ కూడా అలాంటిదే.  
ఎరుక ఉండాలి

ఏరువాక జ్యేష్ఠంలోనే వస్తుంది. ఎంత ఎరువు వేసినా మామిడి పళ్లు ఏప్రిల్‌, మే, జూన్‌లోనే తీయదనం పంచుతాయి. వాటి కాలం అది. అలాగే కష్టాలు తొలగే కాలం కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి. ఒక్కోసారి కష్టాలు ఎంత ప్రయత్నించినా పోవు. అయినా వాటిని భరిస్తూ, వరిస్తూ పోయేదాకా ఎదురుచూడాలి. అయితే, మానవ ప్రయత్నం మాత్రం ఆపకూడదు.

ధైర్యం, పట్టుదల, సరైన సమయం దాకా ఎదురుచూడటం ఇలాంటివన్నీ ఎరుకకు సంబంధించినవి. ఎరుక ఉంటే, ఏరువాక సులభం అవుతుంది.

జీవన క్షేత్రాన్ని దున్నుతూ ఆనంద మకరందం పండించటమే మనిషి లక్ష్యం. అది చెయ్యాలంటే కష్టనష్టాల పట్ల ఎరుక ఉండాలి. ఎరుక, ఏరువాకల సమ్మేళనమే మన జీవితం. ఏరువాక వల్ల భౌతిక సుఖాలు... అంటే, అన్నం లాంటివన్నీ దొరుకుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలంటే ఎరుక అవసరం. ఇవి రెండూ వేరు కాదు. ఈ విషయం తెలియక చాలా మంది కష్టాల గురించి బాధపడుతూ ఉంటారు.

సందేశం అదే

‘కాలమే కరిగినా గగనమే విరిగినా వదలిపోదీ ఘోష’ అంటారు ప్రసిద్ధ కవి బాలగంగాధర్‌ తిలక్‌. ప్రస్తుత కరోనా పరిస్థితులు ఇలాగే అనిపిస్తాయి. కానీ, సృష్టిలో ఇలాంటివి సహజం. ఓర్పుగా దాటుకుంటూ వెళ్లాల్సిందే.

వేసవి అర్థం కావాలంటే ఏడాది మొత్తం చూడాలి. అన్ని రుతువుల్ని చూస్తే తప్ప వేసవి పాత్ర తెలియదు. కష్టాలు కూడా అంతే. కొబ్బరి టెంకె పైకి గట్టిగా ఉంటుంది. దాని లోపల తీయని నీరుంటుంది.

సుఖానికి సోపానాలు కాబట్టి కష్టాల్ని ప్రేమించి దూరం చేసుకోవాలి. ప్రేమించి అర్థం చేసుకున్నవాళ్లే కష్టాల నుంచి త్వరగా బయటపడతారు. సుఖదుఃఖాల ద్వంద్వ యుద్ధ జీవితంలో వాటిని సరిగా అర్థంచేసుకుని వాటితో యుగళ గీతం పాడించగలవాడే జ్ఞాని. ఏరువాక సందేశం అదే.

- డా।। శ్రీరామ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని