Updated : 02 Dec 2021 04:27 IST

బానిసత్వం.. దైవదాస్యం

గగనంలో విహరించే మబ్బులు, సాగరంలో ఎగసిపడే కెరటాలు సర్వ స్వతంత్రాలు. వాటి స్వేచ్ఛా గమనాన్ని ఏ సంకెళ్లూ ఆటంకపరచలేవు. ఈ లోకంలో ఏ ప్రాణైనా అలాంటి స్వేచ్ఛనే కోరుకుంటుంది. తొలకరి పడగానే అబ్బురపరిచే నెమలి నాట్యం, చైత్రం రాగానే మధురంగా వినిపించే కోకిల గానం ప్రకృతిలో పులకించే జీవుల స్పందన.

మ విశృంఖలతకు అడ్డు లేదనుకున్నప్పుడు ఏ జీవైనా అందంగానే స్పందిస్తుంది. ఒక చిన్న వల లేదా ఒక పంజరం స్వేచ్ఛాగమనశీలత కలిగిన పక్షుల్ని బంధించగలదు. ప్రకృతి ధర్మానికి అడ్డుతగలగలదు. పక్షికి పంజరమెలాగో మనిషికి బానిసత్వం అలాగ.
తన అభీష్టాలను కట్టడి చేసుకుని ఇతరుల ఆలోచనల ప్రకారం జీవనాన్ని సాగించడం స్వేచ్ఛాప్రియుడైన మనిషికి మృత్యు సమానమేనని చరిత్రలో అనేక సంఘటనలు రుజువు చేశాయి. నిజానికి ఒక మనిషికి మరో మనిషి పరిచితుడుగానో అపరిచితుడుగానో ఉంటాడే గానీ బానిస కాదు, కాకూడదనేది తత్వవేత్తల అభిప్రాయం.

బానిసగా జీవించడం కష్టం. అది ఆమోదయోగ్యం కాదు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొందరు మహా పురుషులు బానిస జీవితం గడిపారు. కష్టాల కొలిమిలో కాలి నిగ్గుతేలిన బంగారుహారాల్లా బయటపడ్డారు. బానిసగా బతకడం హృదయ విదారకమని వినత, కద్రువల శాప కథనం ద్వారా తేటతెల్లమవుతుంది. సర్పాలకు తల్లయిన కద్రువ గరుత్మంతుడి మాతృమూర్తి వినతను మోసగించి బానిసగా చేసుకుంది. ఆ సందర్భంలో గరుత్మంతుడు తల్లితో... ‘అమ్మా! బలిష్టమైన రెక్కలతో, ముక్కుతో కుల పర్వతాలను సైతం నుగ్గు చేయగల నేను అల్పులైన ఈ సర్పాల్ని ఎందుకు సేవించాలి?’ అన్నాడు. ఆ ఆవేదనలో పరాధీనత ఎంత సహించరానిదో అర్థమవుతుంది.

ఎదగాలంటే ఒదగాలి

పాండవులు బాల్యం నుంచి ధర్మమార్గాన్ని విడిచి పెట్టలేదు. ధర్మరాజు బలహీనత కారణంగా వారు మాయాజూదంలో ఓడిపోయారు. పన్నెండేళ్ల అరణ్య వాసంలో ఎదురైన సంఘటనలు పాండవులకు జీవిత పాఠాలు నేర్పాయి. యక్షుడి రూపంలో ధర్మదేవత వారిని పరీక్షించింది కూడా. ఇంకొక్క సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలుండగా.. సామ్రాజ్యాధినేతలయ్యుండీ పాండవులు తమ స్థాయిని తగ్గించుకున్నారు. విరాటుని దగ్గర సేవకులుగా చేరాలనుకున్నారు. దాన్నే తెనాలి రామ కృష్ణుడు ‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్‌’ అంటూ పోల్చాడు.

మొత్తానికి కంకుభట్టు పేరుతో కథలు చెప్పేవాడిగా ధర్మరాజు, వలలుడిగా వంటలు చేస్తూ భీమసేనుడు, బృహన్నలగా అర్జునుడు, పశుపాలకుడిగా నకులుడు, అశ్వశిక్షకుడిగా సహదేవుడు, బానిస జీవితాన్ని గడిపారు. బంగారు పళ్లాల్లో భోజనంచేసే పాండవులు తమ స్థాయికి తగని పనులు చేస్తూ అనేక అవమానాల్ని ఎదుర్కొన్నారు. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిపై అత్యాచారయత్నమూ జరిగింది. ఎదురైన ఆపదలన్నిట్నీ సంయమనంతో ఎదుర్కొన్నారు. కనుక లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తగ్గి ఉండటం తప్పు కాదు. దీనినే వేమన ‘కొండ అద్దమందు కొంచెమై ఉండదా’ అన్నాడు.

పల్నాటి వీరచరిత్రలో....
పరతంత్ర జనముల పాలి కష్టము
చెప్పంగ నలవియే శివునకునైన
పంజరంబునున్న పక్షుల రీతి
బంధించి పుట్టలో పాములవాడు
వదలక పెట్టిన ఫణముల చందమున
గంగిరెద్దులవాడు కావర మణచి
ముకుతాడు పొడిచిన పోతెద్దులట్లు
బోనులో నుంచిన పులుల విధంబు
స్వాతంత్ర హీనత పడి ఉండవలయు

పరుల అధీనంలో ఉండే బానిస జీవితం పంజరంలో పక్షులు, బుట్టలో బంధించిన పాములు, ముకుతాడుతో కట్టడి చేసిన ఎద్దులు, బోనులో పులుల్లా ఉంటుందంటూ బానిసత్వం ఘోరమని వర్ణించిన శ్రీనాథుడికీ ఆ కష్టాల్ని అనుభవించక తప్పలేదు. అతడు రెడ్డిరాజుల కొలువులో ఆస్థాన కవిగా ఉన్నాడు. వేమారెడ్డి కాలంలో విద్యాధికారి అయ్యాడు. ప్రౌఢ దేవరాయల చేత కనకాభిషేకం చేయించుకున్నాడు. కానీ చివరి దశలో ఆదరించే రాజులు కరువయ్యారు. శిస్తు కట్టలేక బానిస జీవితం గడిపాడు. ఆ మహాకవి సంకెళ్లతో బంధితుడై ఎండలో బండరాతిని భుజాలమీద మోశాడు. అన్ని బాధలను సహిస్తూ కూడా ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. మరణం ఆసన్నమైనప్పుడు..
దివిజ కవివర్యుల గుండియల్‌ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి
అంటూ హుందాగా జీవితాన్ని ముగించాడు.

దైవదాస్యం పుణ్యాత్మకం
దాసభూతాః స్వతస్సర్వే హ్యాత్మానః పరమాత్మనః
అతో హమపి తేదాస ఇతి మత్వానమామ్యహమ్‌

స్వాభావికంగా ప్రాణులన్నీ పరమాత్మకు దాసులై నందున నేనూ నీ దాసుణ్ణేనని గుర్తించాను. ఆ జ్ఞానంతో నమస్కరిస్తున్నాను ఈశ్వరా’ అంటూ మనిషిని దేవుడికి బానిసగా ఈశ్వర సంహిత తెలియజేసింది. భగవంతుడికి దాసుడిగా ఉండటం ఊడిగం కాదు. అది భక్తిగా కొనియాడబడుతోంది. తనకు దాసుడైన భక్తుణ్ణి దైవం అనుగ్రహిస్తాడని నారద పుండరీక సంవాదం ద్వారా తెలుస్తుంది.

అనుభవజ్ఞులు సంసారాన్ని సాగరంగా చెబుతారు. మనసు మందిరంలో దైవాన్ని ప్రతిష్టించుకున్నవారికి ఈ బంధాలన్నీ తెంచుకోవడం చాలా సులువు. దైవమే సర్వస్వం ఐనందున ఇష్టులందరినీ దేవుడిలోనే దర్శించ గలడు. అర్పణ చేసుకోగలడు. భగవంతుడు భక్తుల కోరికలను మన్నించడంలో ముందుంటాడు. ‘ఎవరు నన్నెలా భావిస్తారో వారినలాగే అనుగ్రహించగలను యద్భావం తద్భవతి’ అని కృష్ణపరమాత్ముడి వచనం కదా! మనం దేవునికి బానిసలమైనా, లేదా ఆయన్ను బానిసగా చేసుకోగలిగేంత భక్తిప్రపత్తుల్ని ప్రదర్శించినా మన జన్మ ధన్యమైనట్లే.

- శ్రీరామ్‌ కనగాల


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts