...అల్లాహ్‌ చెప్పారు!

సహెల్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ తన యావదాస్తిని దానధర్మాలకు ఇచ్చేసి అడవిలో ఉండేవారు. అతని మిత్రులు ‘సహల్‌ మీరు ఇంతటి కారడవిలో రాత్రింబవళ్లు ఒంటరిగా ఎలా ఉంటారు?’ అని అన్నారు.

Published : 14 May 2020 00:25 IST

ఇస్లాం సందేశం

సహెల్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ తన యావదాస్తిని దానధర్మాలకు ఇచ్చేసి అడవిలో ఉండేవారు.

అతని మిత్రులు ‘సహల్‌ మీరు ఇంతటి కారడవిలో రాత్రింబవళ్లు ఒంటరిగా ఎలా ఉంటారు?’ అని అన్నారు.

దానికాయన ‘ఎవరన్నారు నేను ఒంటరిగా ఉంటానని.

‘ఎవరో చెప్పడమేంటి మేమే స్వయంగా చూస్తున్నాం కదా’ అన్నారు మిత్రులు

‘ఆ దైవం నా వెంట ఉన్నాడు. నా ప్రభువుతో మాట్లాడాలనుకుంటే నమాజు కోసం నిలబడతాను. ఆ అల్లాహ్‌ మాటలు వినాలనుకుంటే ఖురాన్‌ గ్రంథాన్ని తెరచి కూర్చుంటాను.’ అని జవాబిచ్చారు.

ముస్లింలు ఖురాన్‌ గ్రంథాన్ని అల్లాహ్‌ వాక్కుగా విశ్వసిస్తారు. స్వయంగా ఖురాన్‌ రెండో అధ్యాయం మొదటి వాక్యంలోనూ ఇదే విషయం కనిపిస్తుంది.

‘ఇది అల్లాహ్‌ గ్రంథం’ అని ఆ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇందులో ముఖ్యంగా దైవాజ్ఞలు, ఆయన అనుగ్రహాలు, నియమాలు, పరలోక జీవితం, జీవన్మరణాలు... ఇలా అన్నీ ఉన్నాయి.●

* ఖురాన్‌లోని పదాలు, వచనాలు అవతరించినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలానే ఉన్నాయి. ఖురాన్‌ వ్యాసరూపంలో ఉండదు. ఉపన్యాస ఒరవడిలో ఉంటుంది. అందులోని ప్రవచనాలన్నీ ఉపన్యాసాల మాదిరిగానే ఉంటాయి. సకల లోకాల ప్రభువు భూలోకవాసులను ఉద్దేశించి చేసే ప్రసంగాల సమాహారమే ఈ గ్రంథం. దీన్ని కంఠస్తం చేయమని, ఇతరులకు నేర్పమని ప్రవక్త (స) తన సహచరులను ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఖురాన్‌ చదవండి అది ప్రళయదినాన అది తనను పఠించేవారికి అనుకూలంగా సిఫారసు చేస్తుంది అని చెప్పేవారు.

ఇది మొత్తం 114 భాగాలుగా ఉంటుంది. వీటిని సూరాలు అంటారు. ప్రతి సూరాలో ఓ ప్రధానాంశం ఉంటుంది. ఇందులో ప్రత్యేక పరిమాణంలో ఉన్న వచనాలను ఆయత్‌ లు అంటారు. వీటిలో కొన్ని ఒకటి, రెండు పదాలతో ముగిస్తే మరికొన్ని ఆయతులు పది పదిహేను పదాలు ఉంటాయి. కొన్ని ఆయత్‌లు కలిస్తే ఒక వాక్యం పూర్తవుతుంది. ఇందులో వాక్యాలన్నీ అంత్యప్రాసతో పూర్తవుతాయి. ఆనాటి అరబ్బులు ప్రాసను బాగా ఇష్టపడేవారు.

* ఖురాన్‌లోని సూరాలను మక్కీ సూరాలు, మదనీ సూరాలుగా విభజించారు. హిజ్రత్‌ వలసకు పూర్వం అవతరించిన వాటిని మక్కీ సూరాలుగా, ఆ తర్వాత వచ్చిన వాటిని మదనీ సూరాలుగా పేర్కొన్నారు.


ఖురాన్‌ చెప్పింది..

అల్లాహ్‌: అద్వితీయుడు, మానవాతీత గుణాలు కలవాడు, సాక్షాత్తు దైవం అన్నది దీని అర్థం

నబీ, రసూల్‌: దైవ మార్గబోధన కోసం అల్లాహ్‌ ఎంపిక చేసుకున్న ప్రవక్త.

వహీ : అల్లాహ్‌ తరఫున అవతరించే మార్గదర్శక సూచనలు. వహీ అంటే దైవవాణి.

ఇస్లామ్‌ : ఖురాన్‌ పరిచయం చేసిన జీవన విధానమే ఇస్లాం. నిఘంటువు ప్రకారం ఇస్లాం అంటే దైవం ముందు విధేయయతో తలవంచడం అని అర్థం. శాంతి అని కూడా అర్థముంది.

మలాయిక : దివ్య ఖురాన్‌లో మలాయిక ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. దైవవాణిని ప్రవక్తలకు చేరవేసే దైవదూతలను మలాయిక అంటారు.


పది సూత్రాలు

1. భూమిపై అలజడిని రేపుతూ తిరగకండి.

2. ఇచ్చిన మాటపై నిలబడండి.

3. లంచగొండితనానికి పాల్పడకండి.

4. ఉపకారాన్ని చాటుకుని చేసిన దానాన్ని వృధా చేసుకోకండి.

5. రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ గడువివ్వండి

6. ఇతరుల మాటలు గోడచాటుగా వినకండి, చాడీలు చెప్పకండి.

7. కోపాన్ని అణచుకోండి.

8. అందరితో ఆప్యాయంగా మెలగండి.

9. తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా ఉండండి.

10. సారాయి,మత్తుపదార్థాలు, వ్యభిచారం జోలికి వెళ్ళకండి.

- ఖైరున్నీసాబేగం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని