శ్రీవారు... వేటకు వచ్చారు!

వేట ప్రభువుల బాధ్యత. క్రూర మృగాలను అంతమొందించి రాజ్యానికి ప్రశాంతతను చేకూర్చడం వారి కర్తవ్యం...

Updated : 14 Jan 2021 14:56 IST

రేపు పార్వేట ఉత్సవం

వేట ప్రభువుల బాధ్యత. క్రూర మృగాలను అంతమొందించి రాజ్యానికి ప్రశాంతతను చేకూర్చడం వారి కర్తవ్యం... జగదేక ప్రభువైన శ్రీనివాసుడికీ అంతే. అలా ఆయన వేటకు వచ్చే సందర్భమే పార్వేట లేదా పారువేట. ఈ ఉత్సవాన్ని ఏటా మకర సంక్రాంతి మరునాడు అంటే కనుమ రోజు నిర్వహిస్తారు. వేంకటేశ్వర స్వామి పంచాయుధాలైన శంఖు, చక్ర, గద, విల్లు, ఖడ్గం  ధరించి అడవులకు వెళ్లి క్రూర మృగాలను వేటాడి  విజయుడై తిరిగి ఆలయానికి చేరుకునే సందర్భమిది. దీన్ని ఎలా నిర్వహిస్తారంటే...

పార్వేట ఉత్సవం నాడు ఆలయంలో నిత్యం జరిగే సుప్రభాత, తోమాలసేవ, అర్చన, నివేదన వంటి సేవలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వేట దుస్తులు,  శిరస్తాణ్రం ధరించి అడవికి బయలుదేరుతారు. ఈ సమయంలో స్వామి వారు సుదర్శన చక్రాన్ని,  పాంచజన్య శంఖాన్ని, నందక ఖడ్గాన్ని,  కామోదకి అనే గదను, శార్జ్ఞమనే విల్లును ధరిస్తారు. వీటితో పాటు స్వామివారు కత్తి, ఈటె, డాలు కూడా ధరించి ఉంటారు. వెండి పీఠాన్ని అధిరోహించి ఊరేగుతూ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వేట మండపానికి మధ్యాహ్నం వేళకు చేరుకుంటారు. స్వామి వారితో పాటు శ్రీ కృష్ణస్వామి వారు కూడా మరో పీఠాన్ని అధిరోహించి మండపానికి చేరుకుంటారు. అక్కడ  స్వామివారి ముందు సంగీత సాహిత్య  సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి పూజలు, నివేదనలు, హారతులు సమర్పిస్తారు. తాళ్ళపాక అన్నమయ్య వంశస్తులకు స్వామివారి ప్రసాదాలనిచ్చి సత్కరిస్తారు. ఈ సమయంలో నిత్యం స్వామి వారి కైంకర్యంలో పాల్గొనే సన్నిధి గొల్ల అక్కడికి చేరుకుని శ్రీకృష్ణ స్వామిని తమ ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తారు. వారి కోరికను మన్నించి శ్రీకృష్ణస్వామి మండపానికి సమీపంలో ఉన్న సన్నిధి గొల్ల విడిదికి వెళ్లి పూజ, హారతులను స్వీకరించి వెన్న నివేదనను స్వీకరించి తిరిగి వస్తారు. అనంతరం స్వామివారు వేటకు బయలు దేరుతారు. స్వామి వారు పంచాయుధాలు ధరించి వేగంగా వేటకు పరిగెడుతుండగా  స్వామివారి ప్రతిరూపంగా సేవలందించే అర్చక స్వామి ఈటెను చేతపట్టుకొని ముందుకు వెళుతూ జంతువులను వేటాడుతారు. ఈ విధంగా మూడుసార్లు వేట కార్యక్రమం జరుగుతుంది. అనంతరం వేటలో విజయాన్ని సాధించిన స్వామివారికి ఘనంగా నీరాజనాలు అందిస్తారు. తర్వాత స్వామి వారు ఊరేగింపుగా తిరుమల ఆలయానికి చేరుకుంటారు.

పురాణాల ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల చేరుకొని వకుళమాత సంరక్షణలో ఉన్న సమయంలో ఒకసారి తల్లి అనుమతితో వేటకు వెళ్లి...
పెద్ద ఏనుగులను వెంబడిస్తూ  నారాయణవనం సమీపంలోని ఉద్యానవనంలో ప్రవేశించాడు.  
ఈ సమయములో అక్కడ ఉన్న శ్రీ పద్మావతి దేవిని చూసి వలచాడు. అమ్మవారు స్వామి వారిని చూసి మనసు పడింది. తర్వాత వారి వివాహం అయింది. అంటే అయ్యవారికి అమ్మవారికి అనుసంధానం ఏర్పడడానికి వేట కారణమైంది. అందుకు నిదర్శనంగా కూడా ఈ  ఉత్సవాన్ని నిర్వహిస్తారని  చెబుతారు.

-ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖర రావు  

మరిన్ని కథనాల https://epaper.eenadu.net లో..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని