కరుణ చూపండి!

క్రీస్తు తన శిష్యులకు తప్పిపోయిన కుమారుడి కథ చెప్పారు. ఆయన దృష్టిలో తప్పిపోవడం అంటే ధర్మం దారితప్పడం. గమ్యం తెలీని ప్రయాణం. ఒక వ్యక్తి దూరదేశం వెళ్తోంటే దోపిడీదొంగలు...

Updated : 29 Jul 2021 00:59 IST

క్రీస్తువాణి

క్రీస్తు తన శిష్యులకు తప్పిపోయిన కుమారుడి కథ చెప్పారు. ఆయన దృష్టిలో తప్పిపోవడం అంటే ధర్మం దారితప్పడం. గమ్యం తెలీని ప్రయాణం. ఒక వ్యక్తి దూరదేశం వెళ్తోంటే దోపిడీదొంగలు అతణ్ని కొట్టి సంపదంతా దోచుకున్నారు. ఆ దారిన చాలామంది వెళ్తున్నా రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వారిలో అతడి స్నేహితులు, బంధువులు కూడా ఉన్నారు. అయినా అతణ్ని రక్షించింది ఒక అపరిచితుడు. పైగా ఆ బాధితునికి అతనంటే ఇష్టంలేదు.

ప్రభువు దృష్టిలో పొరుగువారంటే స్నేహితుడో, బంధువో కాదు. రక్షణనిచ్చేవారు, శ్రేయస్సు కోరేవారు. అలాగే నువ్వు ఎవరి క్షేమం కోరుకుంటావో వారికి నువ్వే పొరుగువాడివి. ఇతరులు నీకేం చేయాలని కోరుకుంటున్నావో నువ్వు కూడా వాళ్లకు అదే చేయమన్నదే ప్రభువు ధర్మప్రబోధం. పొరుగు వ్యక్తి నీ స్థానంలో, నువ్వు అతని స్థానంలో ఉంటే అతడు నీకు హాని చేయాలని కోరుకోవుగా! అలాగే అతను కూడా నీనుంచి ప్రేమనీ, సాయాన్నే కోరుకుంటాడు. మనని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఇతరులను అంతగా ప్రేమించటమే ధర్మం. ధర్మం దారి తప్పితే విరోధాలు, యుద్ధాలు తప్పవు. అది కుటుంబాలు, వర్గాలు, దేశాలు.. ఎక్కడైనా ఫలితం మాత్రం అశాంతి, ఆందోళన. మనిషి ఒంటరిగా మనలేడు. తనను తాను హత్తుకోలేడు. కష్టం వచ్చినప్పుడు ఒక ఓదార్పు, ఓ సహానుభూతి అవసరం. ఆ క్రమంలో ఇతరుల పట్ల కరుణ చూపమని ప్రవచించిన ధర్మసూత్రం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఆచరించడానికి షరతులు లేవు. ఇది పెట్టుబడి, రాబడుల వ్యాపార బంధం కాదు. ఇందులో కలిగే ఆనందం అమూల్యం.

- ఎం.శ్రీవంశీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని