సాఫ్ట్‌వేర్‌ వినాయకుడు

విఘ్నాలను తొలగించే వక్రతుండుడు విఘ్నేశ్వరుడు. కనుకనే ప్రతి ఆలయంలో ఆయన ప్రతిమ విధిగా ఉంటుంది. బెంగళూరు మహానగర శివార్లలోని కోరమంగళ ప్రాంతంలో....

Published : 09 Sep 2021 00:20 IST

దర్శనీయం

విఘ్నాలను తొలగించే వక్రతుండుడు విఘ్నేశ్వరుడు. కనుకనే ప్రతి ఆలయంలో ఆయన ప్రతిమ విధిగా ఉంటుంది. బెంగళూరు మహానగర శివార్లలోని కోరమంగళ ప్రాంతంలో అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీల నడుమ గణపతికి ఆలయం నిర్మించారు. ఇక్కడికొచ్చే భక్తుల్లో ఎక్కువమంది ఐటీ ఉద్యోగులే ఉండటంతో దీనికి  టెక్కీ గణపతి ఆలయంగా పేరొచ్చింది. తమకెదురయ్యే సవాళ్లు, విఘ్నాలు తొలగించమంటూ ఆరాధిస్తున్నారు ఇక్కడి ఉద్యోగులు. పేరుకు తగ్గట్టే ఈ ఆలయం ఆధునిక, సంప్రదాయ రీతిలో ఉంది. సాధారణంగా గణపతి విగ్రహాలలో తొండం ఎడమవైపునకి తిరిగి ఉంటుంది. అది వరసిద్ధి వినాయకుని రూపం. అందుకు భిన్నంగా టెక్కీ గణపతి గర్భాలయంలో కుడివైపునకి తిరిగిన తొండంతో మూలవిరాట్టు ఏర్పాటైంది. ఈ క్షిప్రగణపతి వెంటనే కోరికలు తీరుస్తాడని ముద్గల పురాణంలో ఉంది. ముగ్ధమనోహర సౌందర్య రసోపేత మూర్తిగా కోరిన వరాలనిచ్చే దేవరగా ఈ టెక్కీ గణపతి విగ్రహం అలరిస్తుంది.

నలభై ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయ ప్రవేశద్వారం మూడు అంతరువుల రాజగోపురం బహుశిల్పాకృతులతో ఆకట్టుకుంటుంది. గోపురాలు, విమానశిఖరాలు, ప్రాకారాలు, ఆలయంలోని ప్రధాన ఉపమందిర విగ్రహాలు కళామయంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. బెంగళూరులో ఈ ఆలయం విశిష్టస్థలిగా పేరొందింది. పంచలోహ యుక్తమైన ధ్వజస్తంభం, దానికి నలువైపుల గణేశ ఆకృతులు, ప్రాకారాలపై శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యస్వామి ఆకృతులు భాసిల్లుతున్నాయి. ఇదే ఆలయ ఆవరణలో బంగారు తొడుగులతో ప్రకాశించే మహాలింగస్వరూపునికి, కరుణాకటాక్షాలతో ప్రసన్నపార్వతీదేవికి ఉపాలయాలున్నాయి. అమ్మవారు పంచలోహ కవచంతో, రజిత తోరణం కింద నిలుచున్న భంగిమలో ఉంటుంది. ఆ పక్కనే శివపార్వతుల రెండో తనయుడైన కుమారస్వామికి మరో ఉపాలయముంది. బెంగళూరు మెజెస్టిక్‌ రైల్వేస్టేషన్‌ నుంచి పావుగంటలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

- టి.విష్ణుకాంతయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని