భగవంతుని బహుమతి

సృష్టి అంతా దేవుని రచనా విలాసం. ఆయన సృజన సమస్తం జీవ జాలానికి సమకూర్చిన ప్రసాదం. కొందరు కొన్నిటిని కావాలని కోరుకున్నా, కొందరు వద్దని నిరాకరించినా ఆయన

Updated : 30 Sep 2021 06:11 IST

సృష్టి అంతా దేవుని రచనా విలాసం. ఆయన సృజన సమస్తం జీవ జాలానికి సమకూర్చిన ప్రసాదం. కొందరు కొన్నిటిని కావాలని కోరుకున్నా, కొందరు వద్దని నిరాకరించినా ఆయన ఇచ్చేది ఇవ్వక మానడు. వాటిని స్వీకరించే విధంలో తేడాలు ఉండొచ్చు. విరుద్ధ రూపాలుగా పరిణమించవచ్చు. మంచిచెడులు, ఉచ్ఛనీచాలు, హెచ్చుతగ్గులు అనేవి మనం చూసే దృష్టిలోనే తప్ప దేవుని సృష్టిలో లేదు. అందుకు నిదర్శనమే ఈ కథ...

ఒక తండ్రికి ఇద్దరు కూతుళ్లున్నారు. పెద్ద కూతురికి వ్యవసాయదారుడితో, చిన్న కూతురికి ఇటుకలు తయారుచేసే వ్యక్తితో పెళ్లి చేశాడు. కొన్నాళ్లకి ఆ తండ్రి ఇద్దరు కూతుళ్లనూ చూడాలని బయల్దేరాడు. పెద్ద కూతుర్ని చూసి, అక్కడి నుంచి తిరిగి రాబోతూ ఆమెకో బహుమతి ఇవ్వదలచి ‘నీకేం కావాలో కోరుకో అమ్మా’ అన్నాడు. అప్పుడామె ‘నాన్నా! ఇప్పుడు నాకేమీ వద్దు. కానీ ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవక వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంది. వానలు బాగా కురిపించమని దేవతలను ప్రార్థించు. అదే నాకు పెద్ద బహుమతి’ అంది.

సరేనంటూ అక్కడి నుంచి చిన్న కూతురు ఇంటికి వచ్చాడు. ఆమెనూ పెద్ద కూతురును అడిగినట్లే అడిగాడు. దానికామె ‘నాన్నా ఇప్పుడు ఏ బహుమతీ వద్దు. వర్షాకాలం మొదలైపోయింది. వానలు కురిస్తే తయారైన ఇటుకలన్నీ తడిసి పనికిరాకుండా పోతాయి. వాటిని చేయడానికి మేమంతా పడిన శ్రమ వృథా అయిపోతుంది. అందువల్ల కొద్దిరోజులు వర్షాలు కురవకపోతే ఇటుకలు బాగా ఎండుతాయి. కనుక ఇప్పట్లో వానలు కురిపించవద్దని దేవతలను ప్రార్థించు. అదే నువ్వు ఇచ్చే బహుమతిగా భావిస్తాను’ అంది. పరస్పర విరుద్ధమైన ఇద్దరు కూతుళ్ల కోరికలూ విన్న తర్వాత ఆ తండ్రికి ఏం చేయాలో తోచలేదు.

భగవంతుణ్ణి ఈ రకంగా ప్రార్థించారు. ‘స్వామీ! నా ఇద్దరు కూతుళ్లే ఒకే విషయంలో విరుద్ధమైన కోరికలు కలిగి ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు ప్రసాదించే అనేకానేక కానుకల గురించి ఎందరెందరు ఎంత విభిన్నంగా, విరుద్ధంగా భావిస్తారో కదా! నేను వేడుకునేది ఒక్కటే. ఎవరికేది ప్రాప్తమో అదే ప్రసాదిస్తావని తెలుసు. దయచేసి మాలో మోహావేశాలను పోగొట్టు’ అంటూ ప్రార్థించాడు.

- శార్వరీ శతభిషం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని