Updated : 25 Nov 2021 06:10 IST

సహనమే సమ్మోహనం

క్షమ ఎంత మహత్తర గుణమో కవిపండితులు మొదలు తత్వవేత్తల వరకూ అందరూ కొనియాడారు. సహనంతో ప్రశాంతత చిక్కుతుంది. కానీ కోపం, అసహనం, చికాకులతో ఎదుటివాళ్లని హింసించడమే కాదు.. ఆ అశాంతిలో రగిలి మనమూ దహించుకుపోతామని హెచ్చరించారు...

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. కౌరవుల పరాజయాన్ని తట్టుకోలేని అశ్వత్థామ, పసివాళ్లు అని కూడా చూడకుండా నిద్రిస్తున్న పాండవ పుత్రుల్ని హతమార్చాడు. దాంతో అర్జునుడికి అంతులేని ఆగ్రహం వచ్చింది. పుత్రశోకంతో పరితపిస్తోన్న పాంచాలిని ఓదారుస్తూ, అశ్వత్థామను హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అన్నమాట ప్రకారం బ్రహ్మాస్త్రంతో కాళ్లూచేతులూ కట్టేసి ద్రౌపది ముందు పడేయగా అతడి తల నరికేందుకు భీమార్జునులు సిద్ధమయ్యారు. అప్పుడు ద్రౌపది దగ్గరగా వెళ్లి ‘నా బిడ్డలు ఉద్రేకంపట్టలేక ఆయుధాలతో ఎదురు నిలవలేదే! నీకెలాంటి అపకారం చేయలేదే! అలాంటి మంచివాళ్లని, యుద్ధం చేయగల సామర్థ్యం అంతగా లేనివాళ్లని, అర్ధరాత్రి నిద్రలో ఆదమరచి ఉన్నవాళ్లని చంపడానికి నీకు చేతులెలా వచ్చాయయ్యా?’ అంది బాధగా. ఆ మాటలకు ద్రోణపుత్రుడి నవనాడులూ కుంగిపోయాయి. పశ్చాత్తాపంతో తల వాలిపోయింది. భీమార్జునులు అశ్వత్థామను చంపకుండా ద్రౌపది వారించింది. ‘ఇతణ్ణి చంపితే, ఇక్కడ నేను ఏడుస్తున్నట్లే అక్కడ ఇతడి తల్లీ పుత్రశోకంతో రోదిస్తుంది. ఇప్పటికే తన ఏకైక కుమారుడి కాళ్లూచేతులూ కట్టి ఈడ్చుకొచ్చారన్న సంగతి తెలిసి, ఆమె ఎంతగా తల్లడిల్లిపోతోందో కదా! ఆ తల్లి కూడా నాలాగా గర్భశోకం అనుభవించడం భరించలేను, వదిలేయండి!’ అంటూ క్షమాభిక్ష పెట్టింది. ప్రాణంతీసేంత పాపం చేసినా మన్నించి, మాననీయతను చాటుకుంది. ఎదుటివారు చిన్న తప్పు చేసినా కక్షగట్టి కత్తులు నూరే, ప్రతీకారంతో పొగలు గక్కే మనం అలవరచుకోవలసిన అత్యుత్తమ లక్షణం ఈ క్షమాగుణమే.

పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి...
క్షమ కలిగిన సిరి కలుగును
క్షమ కలిగిన వాణి గలుగు సౌఖ్యము లెల్లన్‌
క్షమగలుగఁ దోన కలుగును
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు దండ్రీ!

అన్నాడు. ‘క్షమాగుణం వల్ల సంపద, విద్య, సుఖాలు కలుగుతాయి. భగవంతుడు మెచ్చుతాడు’ అనేది దీని భావం.

మన్నిస్తే మానవీయత...

మొదలు నరికి తనను మోడుగా మార్చిన గొడ్డలిని సైతం మన్నించిన మొక్క మళ్లీ చిగురించి చిగురాకుల చిరునవ్వులతో పలకరిస్తుంది. తనను తొక్కేసిన పాదాలను పువ్వు మన్నించి, సుగంధాలను అద్దుతుంది. అన్నీ తెలిసినా మనం ఇతరుల పొరపాట్లను మనసు పొరల్లో దాచుకుంటూ, అవకాశం వచ్చినప్పుడల్లా కక్ష సాధిస్తూ పైశాచికానందాన్ని పొందుతుంటాం. తప్పులు క్షమించడానికి బదులు కక్ష సాధించు కోవడానికే తహతహలాడతాం. ప్రతీకారం తీర్చుకుంటే తాత్కాలికంగా మన అహం శాంతిస్తుందేమో!  కానీ అది మనసులోని మానవీయ కోణాన్ని మరగుపరచి, ఓ సాధారణ మనిషి స్థాయికే పరిమితం చేస్తుంది. అలా కాకుండా నొప్పించిన వారితోనూ మన్ననగా ఉంటే, మనకు దక్కే సంతృప్తి అనిర్వచనీయం. దెబ్బకు దెబ్బ తీయాలనుకునే గుణం మృగాలదే కానీ మనుషులది కాదని మర్చిపోకూడదు.

నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణం
గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ

అన్నారు. ‘రూపం ఆభరణం లాంటిది. ఆ రూపానికి గుణం నగ లాంటిది. గుణానికి జ్ఞానం ఆభరణం. జ్ఞానానికి క్షమ, ఓర్పు అలంకారాలు’ అనేది ఈ శ్లోకానికి భావం. అంటే రూపం కాదు, గుణం ముఖ్యం అన్నమాట. రూపం, గుణం ఉన్నా బుద్ధిహీనుడైతే ప్రయోజనం లేదు. జ్ఞానం ఉండాలి. జ్ఞానం  ఉండి, సహనం లేకున్నా వృథా. కనుక ఓరిమి ముఖ్యమని  స్పష్టం చేసింది.

సహనంతో పశ్చాత్తాపం

అవమానాలను భరిస్తే అసమర్థులమవుతామనేది పొరపాటు!  ‘క్షమ వీరస్య భూషణమ్‌’ అని గుర్తుంచుకోవాలి. ధీరులకు క్షమా గుణం ఆభరణం. అవకాశం, సామర్థ్యం ఉండి కూడా ప్రతీకారం తీర్చుకోకుండా వదిలేస్తే, ప్రత్యర్థి పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. తను చేసిన తప్పిదాన్ని తప్పక తెలుసుకుంటాడు. కానీ ఆధునిక జీవనంలో మనకు అంత ఓర్పు ఉండటం లేదు. మనతో పొసగని వ్యక్తిపై ఎప్పుడు ఎదురుదాడి చేద్దామా! అని సమయం కోసం చూస్తుంటాం. అవకాశం కల్పించుకుని ఘర్షణకు దిగుతాం. గోటితో పోవాల్సిన స్పర్ధలను  గొడ్డలి దాకా తెచ్చుకుంటాం. శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి వందసార్లు క్షమించాడు. అలా నూరు తప్పులు సహించిన తర్వాతే శిక్షించాడు.

వైషమ్యాలూ ఆవేశకావేశాలను నిగ్రహించుకోవటం ఆధ్యాత్మిక ఉన్నతికి నిదర్శనం. ప్రతీకారం తీర్చుకోగల సామర్థ్యం ఉన్నా సౌమ్యత, క్షమ చూపటం ధీరుల లక్షణం. అలాంటి సౌజన్య శీలురే భగవంతుడికి చేరువ కాగలరు. అలా అందరిలోనూ శ్రీకృష్ణపరమాత్మనే దర్శించుకుంటూ ధర్మమూర్తిగా వెలిగాడు యుధిష్ఠిరుడు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువును కూడా శత్రుపక్షపు వ్యక్తిగా భావించి దూషిస్తూ పతనమయ్యాడు దుర్యోధనుడు. ఒకరికి అందరిలోనూ భగవంతుడే కనిపించాడు. మరొకరికి భగవంతుడిలోనూ విరోధులే కనిపించారు. అందుకే భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో ‘తండ్రీ! ఈ జనులు సంసారమనే చీకటి నూతిలోంచి బయట పడలేరు. ‘మీరు వేరు... మేము వేరు...’ అనే భ్రమలో ఉండక అందరిలోనూ దేవుని దర్శించే వారు ధన్యులు’ అంటాడు.


క్షమతోనే  కక్ష కరిగేది...

ఎదుటివారిపై బదులు తీర్చుకుంటే వాళ్లకీ, మనకీ తేడా ఉండదు. చర్యకు ప్రతిచర్య అదే తీరులో ఉందంటే, అధమస్థాయివారు లాగితే మనమూ పై నుంచి దిగ జారినవాళ్లం అయ్యామన్న మాట! ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాళ్లు ఎప్పుడూ అంత అవివేకంగా ప్రవర్తించరు. అందుకే స్వామి వివేకానంద ఓ సందర్భంలో ‘ప్రతిచర్యకు పూనుకోమని ప్రకృతి ప్రేరేపిస్తుంది. దెబ్బకు దెబ్బ తీయమని ముందుకు నెడుతుంది. మోసాన్ని మోసంతో, మాటకు మాటతో బదులు తీర్చుకోమని ప్రోత్సహిస్తుంది. కానీ ఈ ప్రతీకార వాంఛను అదుపు చేసి, నిగ్రహం కోల్పోకుండా, సహనం చూపటానికి ఎంతో శక్తి కావాలి. అలాంటి క్షమాగుణంతో మీకు విజయం చేకూరడం తథ్యం’ అంటారు.

ఎదుటివాళ్లు ఆవేశం చూపారని మనం ప్రతిస్పందిస్తే అర్థమే లేదు. కానీ ఎందరో విద్యావంతులూ, ప్రముఖులూ కూడా సంయమనాన్ని కోల్పోతూ మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్లు కక్ష సాధింపు చర్యలకు కాలుదువ్వుతున్నారు. విచక్షణ లేకుండా పంతం, ప్రతీకారాలు చూపుతున్నారు. ‘చంపదగినయట్టి శత్రువు తన చేత చిక్కెనేని, కీడు సేయరాదు.. పొసగ మేలు చేసి పొమ్మనుటె చాలు!’ అని పెద్దలెప్పుడో చెప్పారు. అదే అతనికి చావు లాంటిదట. మన ప్రతీకారం పదికాలాలపాటు గుర్తు ఉండాలంటే, దానికి ఒకే ఒక్క మార్గం క్షమించేయడం!

- బి.సైదులు


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని