Medaram 2022: గట్టమ్మకే మొదటి మొక్కు

ములుగు మండలం జాకారం పంచాయతీ శివారులోని గట్టమ్మ మేడారానికి మొదటి మెట్టుగా ప్రసిద్ధి పొందింది. మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మకు మొక్కులు చెల్లించి..

Updated : 16 Feb 2022 12:23 IST

ములుగు మండలం జాకారం పంచాయతీ శివారులోని గట్టమ్మ మేడారానికి మొదటి మెట్టుగా ప్రసిద్ధి పొందింది. మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మకు మొక్కులు చెల్లించి.. తల్లి అనుమతితోనే సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు పయనమవుతారు. ఇది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆచారం.

* ఆదివాసీ నాయకపోడుల ఇలవేల్పు గట్టమ్మ తల్లికి ఘన చరిత్ర ఉంది. కాకతీయుల సైన్యంతో జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించినట్లు కులపెద్దలు చెబుతుంటారు. గట్టమ్మ తల్లి కుటుంబంలో మొత్తం ఏడుగురు ఆడపడుచులున్నారు. వీరిలో గట్టమ్మ పెద్దది. మిగిలిన ఆరుగురు చెల్లెళ్లు  సమీప ప్రాంతాల్లో నెలవయ్యారు.  సమ్మక్క, సారలమ్మకు ఎలాగైతే అండగా ఉండి పోరాడిందో... జాతరకు వచ్చే ప్రతి భక్తునికి గట్టమ్మ తల్లి రక్షణగా ఉంటుందని మొక్కులు చెల్లించి మేడారం బయలుదేరుతారు.

వసతులు.. ఏర్పాట్లు

జాతర సమయంలో ఇక్కడి ఏర్పాట్లు,  సౌకర్యాలను పాలనాధికారి, ఎస్పీ పర్యవేక్షిస్తుంటారు. గట్టమ్మ ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు వాహనాల పార్కింగ్‌ కోసం విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. జాకారం పంచాయతీ ఆధ్వర్యంలో నీటిశుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పించారు. జాతీయ రహదారులశాఖ ఆధ్వర్యంలో గట్టమ్మ ఆలయం ముందున్న జాతీయరహదారిని నాలుగు వరుసల రోడ్డుగా విస్తరించారు. మధ్యలో  డివైడర్‌తో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ సౌకర్యం కల్పించారు. ప్రత్యేక దుకాణాల సముదాయం నిర్మించారు.  అద్భుతమైన ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. గుడి వద్ద పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సుమారు  రూ.3 కోట్లతో హరితహోటల్‌ నిర్మించారు.  

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ ఈ సంప్రదాయం..

గట్టమ్మ ఆలయం వలే.. దేశంలోని పలు పుణ్యక్షేత్రాలు ముందస్తు మొక్కులకు వేదికగా నిలిచాయి. శబరిమలకు వెళ్లే క్రమంలో కేరళలోని  ఎరిమెలి సమీపంలోని వావర్‌స్వామిని  దర్శించుకొని పూజలు చేస్తారు. శ్రీశైలంలో సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతే శ్రీశైల మల్లికార్జున స్వామిని పూజిస్తారు. తిరుపతికి వెళ్లే భక్తులు వరాహస్వామిని దర్శించుకున్నాకే వేంకటేశ్వరస్వామి  సన్నిధికి పయనమవుతారు.  మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిరిడీకి వెళ్లేముందు భక్తులు శనిసింగణాపూర్‌ గ్రామంలో శనీశ్వరుడిని దర్శించుకుంటారు.  దోషాలన్నీ తొలగిపోవాలని వేడుకుంటారు.

- న్యూస్‌టుడే, ములుగు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని