ధనికుడు యాచకుడయ్యాడు

ధనికుడైన ఒక శ్రేష్టి మహా పిసినారి. కొడుకు మాలాశ్రీది ఉదార స్వభావం కావడంతో తన తదనంతరం ఆస్తిని దానధర్మాలతో ఖర్చు చేసేస్తాడనే భయంతో బంగారాన్ని ఐదు బిందెల్లో పెట్టి రహస్యంగా దాచిపెట్టాడు. కొన్నాళ్లకు చనిపోయాడు.

Published : 14 Apr 2022 01:40 IST

బుద్ధభూమి 

ధనికుడైన ఒక శ్రేష్టి మహా పిసినారి. కొడుకు మాలాశ్రీది ఉదార స్వభావం కావడంతో తన తదనంతరం ఆస్తిని దానధర్మాలతో ఖర్చు చేసేస్తాడనే భయంతో బంగారాన్ని ఐదు బిందెల్లో పెట్టి రహస్యంగా దాచిపెట్టాడు. కొన్నాళ్లకు చనిపోయాడు. తన లోభత్వం కారణంగా ఒక యాచకురాలి గర్భంలో పడ్డాడు. అప్పటి నుంచీ యాచకులకు భిక్ష దొరకడం తగ్గింది. తమలో ఎవరో దౌర్భాగ్యుడున్నాడు- అనుకున్న బృంద నాయకుడు ఒక్కొక్కరినీ ఒక్కో దిక్కుకు పంపి భిక్ష సేకరించమన్నాడు. అందరికీ బాగానే భిక్ష దొరికింది గానీ శ్రేష్టి పిండాన్ని మోస్తున్న గర్భిణికి మాత్రం ఏమీ దొరకలేదు. దాంతో ఆమెను బృందం నుంచి వెలివేశాడు. శ్రేష్టి జన్మించాక అతడు దౌర్భాగ్యుడని తెలుసుకున్న తల్లి బాలుణ్ణి ఒకచోట విడిచి, తాను మాత్రమే భిక్షకు వెళ్లేది. ఒకరోజు ఆమె కొడుకును మాలాశ్రీ ఇంటివద్ద విడిచి వెళ్లింది. ఆ ఇంటిని చూడగానే గతజన్మ స్మృతి కలిగింది. తక్షణం ఇంట్లోకి వెళ్లి ‘ఇది నా ఇల్లు’ అంటూ అరవసాగాడు. పనివాళ్లు అతణ్ణి బయటకు గెంటుతుండగా అటువైపుగా వచ్చిన బుద్ధుడు బాలుణ్ణి పూర్వపు శ్రేష్టిగా గుర్తించాడు. మాలాశ్రీని పిలిచి ‘ఇతడు గతజన్మలో నీ తండ్రి’ అని చెబితే అతడు నమ్మలేదు. అప్పుడు బుద్ధుడు ‘నువ్వు దాచిన ఐదు బిందెల బంగారం ఎక్కడుందో చూపించు’ అన్నాడు పిల్లాణ్ణి ఉద్దేశించి. అతడు చూపిన చోట తవ్వగా బంగారం బిందెలున్నాయి. మాలాశ్రీ విస్తుపోగా ‘ధనికుడైన నీ తండ్రి దాన గుణం అనేది లేకుండా లోభితనం ప్రదర్శించినందున ఇప్పుడు నిత్య దరిద్రం అనుభవిస్తున్నాడు. మనకున్నదాంట్లో కొంత పరులకు పెడితేనే మరుజన్మలో భాగ్యం లభిస్తుంది’ అంటూ వివరించాడు.

- జయదేవ్‌ చల్లా  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని