Updated : 11 Aug 2022 01:11 IST

ఏది స్వేచ్ఛ.. ఏది స్వాతంత్య్రం..

స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు రెండూ ఒకటిగానే అనిపిస్తాయి. కానీ స్వాతంత్య్రం ఆలోచన, మనసులకు సంబంధించింది. స్వేచ్ఛ ఆ రెంటినీ వ్యక్తంచేసేది. స్వాతంత్య్ర బాహ్యరూపం స్వేచ్ఛ అనొచ్చు. అంటే స్వతంత్రంగా ఆలోచిస్తాం, స్వేచ్ఛగా ప్రవర్తిస్తాం. ఆలోచన, వ్యక్తంచేసే తీరు వ్యక్తి స్థానాన్ని నిర్ణయిస్తుంది. స్వేచ్ఛకు, విచ్చలవిడితనానికి మధ్యనున్న రేఖ చెదిరిపోకుండా కాపాడేది బుద్ధి. అది తన కర్తవ్యాన్ని మర్చిపోతే జరిగే పరిణామాన్ని ‘బుద్ధి నాశాత్‌ ప్రణశ్యతి’ అంటోంది భగవద్గీత.

ఇంద్రియాల ప్రభావానికి లోబడకుండా లోకహితమే ప్రధానంగా ప్రవర్తించడం స్వేచ్ఛ. దీనికి భిన్నమైంది విచ్చలవిడితనం. అదెప్పుడూ కంటకమే. ఆలోచనల్ని తమలోనే నిలిపేవారు కొందరైతే, ఆచరణగా మార్చేవారు కొందరు. అష్టవసువులు వశిష్టుడి కామ ధేనువును దొంగిలించాలనుకున్నారు. అష్టవసువుల్లో ఒకరైన ప్రభాసుడు దానికి కార్య రూపం ఇవ్వడంతో తన దైవత్వాన్ని కోల్పోవాల్సివచ్చింది. సీతాపహరణ, రాముడితో యుద్ధం.. సందర్భాల్లో రావణాసురుడి మంత్రులు అతడు చెప్పింది విన్నారే తప్ప కిమ్మనలేదు. భావస్వేచ్ఛను వ్యక్తంచేసి, కాదంటే తందానా అనేవారు మరో వర్గం. సీత విషయమై మారీచుడు, యుద్ధం గురించి కుంభకర్ణుడు రావణుడికి తమ అభిప్రాయం చెప్పి.. వినలేదని సర్లెమ్మనేశారు. అలానే భారతంలో శకుని. సినిమా ప్రభావంవల్ల వంకర మెడ, వంచన చూపుతో కనిపిస్తున్నాడు కానీ, నిజానికతడు అంత దుర్మార్గుడు కాడు. మయసభ, మాయాజూదం, ఉత్తర గోగ్రహణ సందర్భాల్లో దుర్యోధనుడికి మంచే చెప్పాలని చూశాడు. వినకపోయేసరికి వంతపాడాడు. ఎదుటి వ్యక్తి విన్నా వినకపోయినా, సత్కరించినా ఛీత్కరించినా స్వ, పరహితాల కోసం నిలబడ్డవారున్నారు. ధృతరాష్ట్రుడు తనను రాజ్యబహిష్కరణ చేసినా, ధర్మం పక్షాన్నే నిలిచాడు విదురుడు. అలాగే ‘నువ్వీ రాయబారానికి రావడం నాకిష్టం లేదు కృష్ణా’ అంటూ తాను ఆరాధించే కృష్ణుడితోనే స్వేచ్ఛగా చెప్పాడు.

‘అనయము పుట్టె జూదమున’ అంటూ ప్రారంభించి చక్రవర్తితో ‘ప్రజలంతా నీ ప్రవర్తనను చీదరించు కుంటున్నారు’ అన్నాడు సంజయుడు నిర్భయంగా, నిక్కచ్చిగా. స్వేచ్ఛను ప్రకటించడమేకాక, ధర్మమార్గంలోకి మళ్లించడానికి ఎదిరించినవాళ్లు రామాయణంలో విభీషణుడు, భారతంలో సహదేవుడు. సీతాపహరణ విషయంలో, రాముడితో యుద్ధానికి తలపడినప్పుడు తన ఆలోచనను, అభిప్రాయాన్ని ఆమోదించని అన్నను ఎదిరించి స్వేచ్ఛగా ధర్మమార్గం వైపు పయనించాడు విభీషణుడు. భీమార్జును లైనా మెత్తబడ్డారేమో కానీ ధర్మం విషయంలో ధర్మరాజును కూడా లక్ష్యపెట్టని స్వేచ్ఛ సహదేవునిది. రాయబార సమయంలో ఐదు ఊళ్లైనా ఇమ్మని అర్థిస్తున్న అన్నగారిని నిరసిస్తూ ‘రాజ్యం మాది, మర్యాదగా మాకు అప్పజెప్పండి! లేదంటే యుద్ధరంగంలో సహదేవుని ఎదుర్కోవాలి’ అన్న సహదేవుడు ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అంటూ బాలగంగాధర తిలక్‌ నినదించచడానికి స్ఫూర్తిప్రదాత, మార్గదర్శకుడు అయ్యాడు.

పుత్రధర్మాన్ని పాటిస్తూ అరణ్యవాసానికి సిద్ధమైన రాముడు, భర్తృధర్మాన్ని విస్మరిస్తున్నవేళ లోకహితం కోసం ‘రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం’ అని తన భావాన్ని కటువుగా వ్యక్తం చేయగలిగిన స్వేచ్ఛ సీతమ్మది. కీచకుడు తనను అవమానించిన నాటి రాత్రి ఆదమరచి నిద్రిస్తున్న భీముని ‘నిద్రపోతున్నావా? చచ్చిపోయావా?’ అని నిలదీసిన స్వేచ్ఛ ద్రౌపదిది. ఈ నిర్భయత్వ స్వేచ్ఛావారసత్వమే స్వాతంత్య్రోద్యమ నాయకులది.

ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో బాధ్యత ఉండీ నోరు విప్పనివారు కురు, గురు వృద్ధులైన భీష్మ ద్రోణులు, అధికారం ఉన్నా, ఆదుకోని అంధరాజు ధృతరాష్ట్రుడు, సమర్థుడయ్యుండీ తన స్వేచ్ఛను దుర్మార్గులకు వినియోగించినవాడు కర్ణుడు. పెద్దలమాట వినకపోవడాన్నే తన స్వేచ్ఛగా భావించినవాడు దుర్యోధనుడు. తనకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాల్ని ఉపయోగించక దుర్మార్గాన్ని ఆచరణలో పెట్టినవాడు దుశ్శాసనుడు, తనకు సామర్థ్యంలేదని తెలిసినా కనీసం నిలువరించే ప్రయత్నం చేసినవాడు వికర్ణుడు. తన ప్రయత్నం విఫలమైనా స్వేచ్ఛగా నిరసన వ్యక్తంచేస్తూ సభను బహిష్కరించినవాడు విదురుడు. చివరికి ఎవరి గతి ఏమైందో అందరికీ తెలిసిందే!

నాయకులు, అధికారులు, సలహాదారులు, సన్నిహితులు, బంధువులు, సేవకులు ఎప్పుడు, ఎవరు, ఎలా, ఎంతవరకు స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని వినియోగించు కోవాలన్న దానికి నిలువెత్తు ఉదాహరణలివి.

కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః  
సుకృతే దుష్కృతేవాపి చత్వారఃసమభాగినః

వ్యక్తి ధర్మం విషయంలో స్వేచ్ఛ లేకపోతే, దుర్మార్గులను ప్రేరేపిస్తే, సమర్థిస్తే, అనుసరిస్తే, ఆమోదిస్తే పతనమౌతారని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం దుర్యోధన, కర్ణ, దుశ్శాసన, ధృతరాష్ట్రుల జీవితాలు. భావస్వేచ్ఛకు ఆధారం, ఆమోదంగా ఉండాలి రాజకీయ స్వేచ్ఛ. అది ఉండి భావస్వేచ్ఛ లేకున్నా లేదా భావస్వేచ్ఛ పేరుతో సంఘ వ్యతిరేక శక్తులు ప్రజ్జ్వరిల్లినా అది లోపభూయిష్ట మనీ, తిరోగమనం వైపు మళ్లిస్తాయనీ అర్థం. అలాంటి స్వేచ్ఛాస్వాతంత్య్రాల్ని పరిహరించి జాతిని పురోగమనం వైపు పయనింప చేయడానికి స్ఫూర్తిగా ఈ స్వాతంత్య్ర దినోత్సవం నిలవాలి. అప్పుడే అది స్వాతంత్య్ర అమృత మహోత్సవం. దానికి అనుగుణమైన నైతిక విలువల్ని పురాణేతిహాసాల ఆలంబనతో పెంపొందించుకోవాలి.

- డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts