మహిమాన్వితం త్రిపురాంతక క్షేత్రం

త్రిపురాసురుల సంహారంలో ధనుస్సుగా నిలిచిన పార్వతీదేవి, వారిని వధించిన ఈశ్వరుల సంగమ స్థలమే త్రిపురాంతక క్షేత్రం. ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. ఇక్కడ బాలాత్రిపురసుందరీదేవితో కలిసి త్రిపురాంతకేశ్వరుడు పూజలందుకుంటాడు.

Updated : 29 Sep 2022 04:34 IST

త్రిపురాసురుల సంహారంలో ధనుస్సుగా నిలిచిన పార్వతీదేవి, వారిని వధించిన ఈశ్వరుల సంగమ స్థలమే త్రిపురాంతక క్షేత్రం. ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. ఇక్కడ బాలాత్రిపురసుందరీదేవితో కలిసి త్రిపురాంతకేశ్వరుడు పూజలందుకుంటాడు. దేవీనవరాత్రులు, శివరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే చాలు దారులన్నీ ఈ క్షేత్రం వైపే మళ్లుతాయి. అశేష జనవాహిని ఇక్కడికి చేరుకుంటుంది.

ఆ పేరెలా వచ్చింది

శైవ శాక్తేయ క్షేత్రాల్లో త్రిపురాంతకం మహిమాన్వితమైంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం శ్రీశైల ఆలయానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది. ఈ శివాలయం శ్రీచక్రాకారంలో ఉండటం ప్రత్యేకత. త్రిపురాసురుణ్ణి సంహరించిన ప్రదేశం కావడంతో ఈ ప్రాంతాన్ని ‘త్రిపుర హంతకం’ అన్నారు. కాలక్రమేణా త్రిపురాంతకంగా మారింది.

ఆలయ విశిష్టత

ఆలయానికి కూతవేటు దూరంలో బాల త్రిపురసుందరీదేవి అమ్మవారు చెరువులోని చిదగ్ని గుండంలో కొలువైంది. రాక్షస సంహారం అనంతరం ఆగ్రహజ్వాలతో ఉన్న అమ్మరూపం భయానకంగా ఉండటంతో పర్యటనకు వచ్చిన ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం నిర్మించి ఆమె ఆగ్రహాన్ని అందులో బంధించినట్లు స్థల పురాణం వెల్లడిస్తోంది. లలితా సహస్ర నామం ఇక్కడే లిఖితమైందంటారు. ఇక్కడి నుంచి శ్రీశైలానికి బిల మార్గం ఉంది. కాకతీయుల కాలం నాటి ఈ క్షేత్రంలో ఎటు చూసినా శిల్ప సంపదే కనిపిస్తుంది. పల్నాడు జిల్లా వినుకొండ, ప్రకాశం జిల్లా మార్కాపురాలకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ఆ రెండు ప్రాంతాల నుంచి బస్సుల్లో త్రిపురాంతక క్షేత్రానికి వెళ్లొచ్చు.

- బోగెం శ్రీనివాసులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని