సన్మార్గ దర్శిని హంసగీత

మహాభారతం శాంతిపర్వంలో హంసగీత ప్రస్తావన ఉంది. హంసరూపంలో బ్రహ్మదేవుడు సత్యభాషణం ప్రాముఖ్యతను, వాక్కుకున్న విశిష్టతను, పరమాత్మను చేరే మార్గాన్ని బోధించాడు.

Published : 13 Oct 2022 00:32 IST

మహాభారతం శాంతిపర్వంలో హంసగీత ప్రస్తావన ఉంది. హంసరూపంలో బ్రహ్మదేవుడు సత్యభాషణం ప్రాముఖ్యతను, వాక్కుకున్న విశిష్టతను, పరమాత్మను చేరే మార్గాన్ని బోధించాడు. మాట్లాడే శక్తి మనిషికి మాత్రమే దక్కిన అమూల్య వరం. అందులో నిజాలుంటే అత్యుత్తమం. అదే సత్యభాషణం. వేదాధ్యయనసారం. అది ఇంద్రియ నిగ్రహం తోనే సాధ్యమౌతుంది. దాంతో మోక్షం లభిస్తుంది. మనిషి పంచ వేగాలతో మానసికంగా పయనిస్తుంటాడు. వాటిలో మొదటిది వాక్కు వేగం, రెండోది మనసు వేగం, మూడోది క్రోధ వేగం. నాలుగోది తృష్ణ వేగం. ఐదోది ఉదర, జననేంద్రియాల వేగం. వీటిని అరికట్టగలగాలి. అలా చేయగలిగితే బ్రహ్మజ్ఞాని అంటారు. ఈ ప్రచండ వేగాలను అడ్డుకొనగలిగిన ఒకే ఒక్క గుణముంది. దాని పేరే క్షమ.

ఎవరైనా పరుషంగా మాట్లాడినా తొందరపడి ప్రతిస్పందించకపోవడమే క్షమ. తిట్టినవారిని గనుక తిరిగి తిట్టకపోతే వారి కోపం వారినే దహిస్తుంది. అదే మంత్రమౌతుంది. తిట్టిన వారి పుణ్యం తిట్లు తిన్నవారికి లభిస్తుంది. అందుకే క్షమ అత్యుత్తమ లక్షణం. ఇలా అరిషడ్వర్గాలు, స్నేహ ప్రభావాల గురించి బ్రహ్మదేవుడు సాధ్యులకు చెప్పిన విషయాలను భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు.

భాగవతం పదకొండో స్కంద లోనూ హంసగీత ఉంది. అయితే అక్కడ శ్రీమహావిష్ణువు హంస రూపాన్ని ధరించి సనక సనందాది మహర్షులకు బోధించిన విషయాలున్నాయి. శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన ఉద్ధవుడికి బోధించిన ఉద్ధవగీతలో అంతర్భాగం హంస గీత. గుణత్రయము, యోగ మార్గము, భక్తిమార్గాల గురించి కృష్ణుడు వివరించాడు. ఇలా భారత భాగవతాల్లోని హంసగీత మానవాళికి సన్మార్గదర్శిని.

-మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని