సోదరి చేతివంట తింటే..

పాప ప్రక్షాళనచేసే నది యమున, కాలం తీరినవారి ప్రాణాలు హరించే యముడు సంజ్ఞాదేవి, సూర్యభగవానుల బిడ్డలు.

Updated : 27 Oct 2022 01:23 IST

అక్టోబర్‌ 27 భ్రాతృవిదియ

పాప ప్రక్షాళనచేసే నది యమున, కాలం తీరినవారి ప్రాణాలు హరించే యముడు సంజ్ఞాదేవి, సూర్యభగవానుల బిడ్డలు. పరోపకారమే లక్ష్యంగా జీవించడాన వాళ్లకి తీరిక చిక్కేది కాది. యమున ఎన్నోసార్లు ఆహ్వానించగా ఆమె ఇంటికెళ్లాడు యముడు. ఆరోజు కార్తీక శుక్ల విదియ. యముడు చెల్లెలి చేతి వంట తినడం వల్ల యమద్వితీయ అని, సోదరి స్వహస్తాలతో వడ్డించిన రోజు కనుక భ్రాతృవిదియ అని అంటారు.
చెల్లెలి ప్రేమకు సంతోషించిన యముడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. ‘నువ్వు నా వంట తిన్న ఈ రోజున ఎవరు సోదరి చేతి భోజనం చేస్తాడో అతడికి అకాల మరణం లేకుండా పూర్ణాయుర్దాయాన్ని ప్రసాదించు’ అనడిగింది. యముడు తథాస్తు అన్నాడు. అందుకే భ్రాతృవిదియ నాడు అక్కచెల్లెళ్ల చేతి వంట తిన్న సోదరులకి అకాలమరణం, అపమృత్యు భయం ఉండవు. ఆ ఆడపిల్ల కూడా సుమంగళిగా ఉంటుంది. భ్రాతృపూజ చేసిన సోదరి, భగినీ హస్తభోజనం చేసిన సోదరులకు ఏడేడు జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ భాయిదూజ్‌ అక్కచెల్లెళ్లు అన్నదమ్ములకు కానుకలు ఇస్తారు. సాధారణంగా సోదరికి ఏదైనా ఇవ్వడమే కానీ ఆమె నుంచి ఏనాడూ అన్నదమ్ములు ఏదీ తీసుకోరు. ఈ కట్టుబాటు వల్ల సోదరులకు తాను ఏదీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె ఆత్మగౌరవానికి భంగం కలుగుతోంది. ఆ స్థితినుంచి తప్పించడానికే ఈ ఏర్పాటు చేసినట్లు అర్థమవుతుంది. 

- కె.వి.యస్‌.యస్‌.శారద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని