తిరుచెందూర్‌లో శూరసంహారం

కార్తికేయుడు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడని, గుహునిగా కొలువుదీరి ముక్తిని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

Updated : 27 Oct 2022 01:25 IST

అక్టోబర్‌ 30 శూరసంహారం

కార్తికేయుడు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడని, గుహునిగా కొలువుదీరి ముక్తిని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా ధర్మవర్తనులు దైవకృపకు పాత్రులవుతారు. కానీ రాక్షసులనూ మన్నించే కరుణాంతరంగుడు షణ్ముఖుడు.
తారకాసురుడి సోదరుడు శూరపద్ముడు సుబ్రహ్మణ్యుడితో యుద్ధానికి తలపడ్డాడు. తిరుచెందూర్‌ వద్ద కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి షష్ఠి వరకూ ఆరు రోజులు జరిగిన యుద్ధంలో కుమారస్వామి అసురగణాలను హతమార్చగా శూరపద్ముడు మామిడిచెట్టు రూపం ధరించాడు. వేలాయుధం ఆ చెట్టును రెండుగా చీల్చగా అతడి రాక్షసగుణాలు అంతరించాయి. చీలిన చెట్టు భాగాల్లో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శరవణభవుణ్ణి శరణువేడాయి. స్కందుడు కోడిపుంజును ధ్వజంగా, నెమలిని వాహనంగా స్వీకరించి తరింపచేశాడు. భక్తితో శరణువేడితే దుష్టులను సైతం మురుగన్‌ క్షమిస్తాడని నిరూపిస్తుందీ వృత్తాంతం. శూర సంహారానికి గుర్తుగా తిరుచెందూర్‌లో కార్తిక షష్ఠినాడు ఉత్సవాన్ని, దేవసేనతో స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

- గొడవర్తి శ్రీనివాసు, న్యూస్‌టుడే, ఆలమూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని