మహదానందభరితం.. పొలతల క్షేత్ర దర్శనం

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా శేషాచల పర్వత శ్రేణుల్లో ఉంది పొలతల క్షేత్రం.

Published : 03 Nov 2022 00:08 IST

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా శేషాచల పర్వత శ్రేణుల్లో ఉంది పొలతల క్షేత్రం. సీతమ్మను అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఇక్కడి కొలనులో స్నానంచేసి శివుణ్ణి దర్శించుకున్నారని, ఇక్కడ కొలువైన స్వామిని అర్జునుడు మల్లెపూలతో పూజించడం వల్ల మల్లికార్జునుడయ్యాడని చెబుతారు.

పురాణ కథనం
ధర్మాత్ముడైన రామయ్య పశువుల్లో ఒక ఆవు అడవిలో ఓ దివ్యపురుషుడి నోట్లో తనపొదుగు నుంచి క్షీరం ఇచ్చేది. అది గమనించిన పశువుల కాపరి పిలకత్తు ఎవరో పాలు జుర్రుకుంటున్నారని యోగితలపై మోదాడు. రక్తం చిమ్మడంతో రామయ్యకు చెప్పాడు. అతడు పొరపాటు జరిగిందని బాధ పడుతుండగానే పిలకత్తుకు పూనకం వచ్చింది. ఆవహించింది సాక్షాత్తు పరమశివుడే. తప్పు మన్నించమని ప్రార్థించి అక్కడ ఆలయాన్ని నిర్మించాడు.
పూర్వం ఈ ప్రాంతంలో 101 కోనేర్లుండేవి. దగ్గర్లోని మబ్బకోన గుహలో ఓ దివ్య పురుషుడు తపస్సు చేస్తున్నాడు. అక్కడ మహిమ కలిగిన ఏడుగురు అక్కదేవతలు ఉండేవారు. వాళ్ల భాషణలు మునికి అవరోధం కావడంతో వాళ్లని కోనేర్ల వద్ద జీవించమన్నాడు. అక్కదేవతలు సమ్మతించారు. ఒకరోజు ఓంకార శబ్దంతో ఒక సుడి తాటి చెట్టంత ఎత్తు లేచి వారిని వెంబడించింది. అక్కదేవతలు ఆలయానికి పరుగుతీశారు. శివుడు ఆ శక్తినుద్దేశించి ‘నువ్వు పులిబండెన్నవై నీ శక్తియుక్తులు లోకకల్యాణానికి వెచ్చించు. ఈ అక్కదేవతలు భక్తుల మనోకామితాలను సిద్ధింపజేస్తారు’ అంటూ చెప్పి అదృశ్యమయ్యాడు.

ఆ పేరెలా వచ్చిందంటే...
ఒకరోజు శివరపార్వతులు పొలతల క్షేత్రంలో కాలుమోపగా కొంత భూమి కుంచించుకుపోయింది. ప్రస్తుతం ఆలయమున్న చోట ఓంకార శబ్దంతో గంధ శిలలు ప్రత్యక్షమయ్యాయి. అవి పులిముఖాన్ని తలపించేలా ఉండటంతో పులితల పేరు స్థిరపడింది. అదే పొలతల అయ్యింది. కార్తిక సోమవారాల్లో ఘనంగా జరిగే ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతారు. కడప నుంచి సీకేదిన్నె మీదుగా పొలతల క్షేత్రానికి చేరుకోవచ్చు.

- బోగెం శ్రీనివాసులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని