యోగముద్రలో అమ్మవారు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కంచి ఒకటి. కాంచీపురం, కాంజీవరం పేర్లతోనూ పిలుచుకుంటాం.

Published : 24 Nov 2022 00:29 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కంచి ఒకటి. కాంచీపురం, కాంజీవరం పేర్లతోనూ పిలుచుకుంటాం. మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచిరాపల్లి సమీపంలోని తిరువనైకవిల్‌ అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం, కంచి కామాక్షమ్మ దేవాలయం తమిళనాట పేరు పొందిన అమ్మవారి ఆలయాలు. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కంచిలో అమ్మవారు పద్మాసనంలో యోగముద్రలో ఉండటం ప్రత్యేకత. ఈ ఆలయం ఐదెకరాల స్థలంలో ఉంది. ఆవరణలో పెద్ద తటాకం కూడా ఉంది. ఈ ఆలయ సమీపంలో వరాహ దేవాలయం (తిరు కాల్వనూర్‌ దివ్యదేశ) ఉండేది. గుడి శిథిలమవటంతో మూల విగ్రహాన్ని అమ్మవారి ఆలయంలో పునఃప్రతిష్టించారు. గర్భగుడి ఎదుట గాయత్రీ మండపం, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలున్నాయి. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతపరచటానికి, ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది. కామాక్షి అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. చేతుల్లో చెరకుగడ, చిలుక, పాశ, అంకుశాలను ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారు ఇసుకతో చేసిన శివలింగంతో మామిడిచెట్టు కింద తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. కంచిలో ఏటా రథోత్సవం, తెప్పోత్సవం, శంకర జయంతి, వసంత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

- ఎల్‌.ప్రఫుల్ల చంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని