భగవత్కార్యం

ఒక సన్యాసి దేశసంచారం చేస్తూ ఆ ఊళ్లో ప్రవేశించ గానే ఆయన మెడలో పూల మాల వేసిందో ఏనుగు. గ్రామస్థులు కల్పించుకుని ‘నిన్న మా మహారాజు గారు మరణించారు.

Updated : 15 Dec 2022 06:11 IST

ఒక సన్యాసి దేశసంచారం చేస్తూ ఆ ఊళ్లో ప్రవేశించ గానే ఆయన మెడలో పూల మాల వేసిందో ఏనుగు. గ్రామస్థులు కల్పించుకుని ‘నిన్న మా మహారాజు గారు మరణించారు. ఈ రోజు నగరంలో మొట్టమొదట అడుగు పెట్టిన వారిని ప్రభువుగా ఎన్నుకుని, రాజ్యాధికారాన్ని అప్పగించాలను కున్నాం. కనుక ముందుగా వచ్చిన మీరే ఇకపై మా రాజు’ అన్నారు.
సన్యాసి నవ్వి సేవకులను ఒక పెట్టె తెమ్మన్నాడు. తన కాషాయాలూ, ఇతర సన్యాస చిహ్నాలను అందులో ఉంచి, దాన్ని భద్రపరిచాడు. కోరికలు, తాపత్రయాలు లేనందున భగవత్కార్యంగా భావించి ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు. కోశాగారం సమృద్ధిగా ఉండటంతో పొరుగురాజు దండెత్తివచ్చాడు. సంగతి విన్న సన్యాసి నిశ్చింతగా ఉన్నాడు.
కొంతసేపటికి శత్రుసైన్యం రాజభవనాన్ని సమీపించిందని సైనికులు తెలియజేశారు. సన్యాసి దూతను పంపి, కారణమేంటో తెలుసుకోమన్నాడు. యుద్ధంతో రాజ్యాన్ని వశం చేసుకోవడమే లక్ష్యమన్నాడు శత్రురాజు.
అది విన్న సన్యాసి ‘అయ్యో.. ఇంతకాలం పాలించేవారు లేక నేను బాధ్యత తీసు కున్నాను. ఇప్పుడు నువ్వే సింహాసనం అధిష్టించు. ఈ మాత్రానికి యుద్ధంచేసి అమాయకుల ప్రాణాలెందుకు తీయడం? ప్రజలకు కావలసింది సుఖశాంతులను ఇచ్చే రాజు. నువ్వు ఆ పని చెయ్యి’ అని తన పెట్టెను తెప్పించుకున్నాడు. రాజ దుస్తులూ, ఆభరణాలను విడిచి, తన కాషాయవస్త్రాలు ధరించి నిర్వికారంగా వెళ్లిపోయాడు. దేని మీదా వ్యామోహం లేకుండా.. దేన్నయినా భగవత్కార్యంగా భావించాలంటూ రమణ మహర్షి చెప్పిన కథ ఇది.        

 కె.వి.యస్‌.యస్‌.శారద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని