రాజును విడిచిన గోరువంక

బ్రహ్మదత్తుడి అంతఃపురంలో పూజని అనే గోరువంక ఉండేది. దాని మాటలకు అంతా ఆనందించేవారు. అది తన బిడ్డ కోసం తెచ్చిన రుచికరమైన పండ్లను రాజ కుమారుడికీ పెట్టేది. అవి తింటూ పిల్లగోరువంకతో ఆడుకునేవాడు.

Published : 23 Mar 2023 00:08 IST

బ్రహ్మదత్తుడి అంతఃపురంలో పూజని అనే గోరువంక ఉండేది. దాని మాటలకు అంతా ఆనందించేవారు. అది తన బిడ్డ కోసం తెచ్చిన రుచికరమైన పండ్లను రాజ కుమారుడికీ పెట్టేది. అవి తింటూ పిల్లగోరువంకతో ఆడుకునేవాడు. ఒకసారి అలాగే ఆడుతూ ఎందుకో కోపమొచ్చింది. చిన్నిగోరువంకను చంపేశాడు. తీరా భయపడుతూ కూర్చున్నాడు.

పెద్ద గోరువంక జరిగిన ఘోరం చూసి మనుషులకు.. ముఖ్యంగా రాజులకు ఆత్మీయత తెలియదని బాధపడింది. రాకుమారుడి కళ్లను ముక్కుతో, గోళ్లతో పొడిచి పగ తీర్చుకుంది. రాజు దగ్గరికెళ్లి ‘రాజా! నీ పుత్రుడు క్రూరుడై పసి ప్రాణం తీశాడు. ఫలితంగా కళ్లు పోయాయి. అందువల్ల అతడి కళ్లు పోగొట్టిన పాపం నాకు అంటదు. నేనిక ఉండలేను, వెళ్లిపోతున్నాను’ అంది. ‘నీమీద నాకేమీ కోపం లేదు. కానీ నువ్వు అడవికి వెళ్లిపోతా నన్నావు. అదే బాధ కలిగిస్తోంది. నువ్వు మునుపటిలానే అంతఃపురంలో యథేచ్ఛగా విహరించు’ అన్నాడు బ్రహ్మదత్తుడు. ‘ఇంత జరిగిన తర్వాత నేను అంతఃపురంలో ఉండగలనా? అని ఎదురుప్రశ్న వేసింది పూజని. బ్రహ్మదత్తుడు చిన్నగా నవ్వి ‘నా పుత్రుడు చేసిన తప్పిదానికి వెంటనే పగ తీర్చుకున్నావు! అంతటితో నీ పగ చెల్లయిపోయిందిగా! కానీ ఇంకా జరిగినదాన్నే తలచుకుంటూ ఎదుటివారిని నిందిస్తూ స్నేహాన్ని తెగ తెంపులు చేసుకోవడం భావ్యం కాదు’ అన్నాడు.
‘మళ్లీ స్నేహంగా, తీయగా మాట్లాడినంతలో శత్రుత్వం పోతుందా?! దానివల్ల మరణమో, కీడో, వేదనో లేక అన్నీనో తప్పవు. విరోధం అన్నది ఒకసారి పుట్టిందంటే అదిక పోదు. చెట్టుతొర్రలో నిప్పు పుడితే అది లోలోపలే దహిస్తుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులైనా, కన్నవారి నైనా నమ్మకూడదన్నది పెద్దలు చెప్పిన మాట. అలాంటిది శత్రువునెలా నమ్ముతాం?’ అంటూ  ఎగిరిపోయింది.
డాక్టర్‌ అనంతలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు