నారద గర్వభంగం

ఒకరోజు వైకుంఠానికి బయల్దేరిన నారద మహర్షి ముల్లోకాలూ తిరిగే తనకు అన్ని విషయాలూ తెలుసు.. ఉన్నచోటు నుంచి కదలని ఇతరులకు ఏమీ తెలియవు అనుకున్నాడు.

Published : 08 Jun 2023 00:06 IST

ఒకరోజు వైకుంఠానికి బయల్దేరిన నారద మహర్షి ముల్లోకాలూ తిరిగే తనకు అన్ని విషయాలూ తెలుసు.. ఉన్నచోటు నుంచి కదలని ఇతరులకు ఏమీ తెలియవు అనుకున్నాడు. ఆ అతిశయాన్ని గుర్తించాడు నారాయణుడు. గర్వభంగం చేయాలనుకుని ‘నారదా! చాలాకాలంగా నాకో సందేహం. అది త్రిలోక సంచారివైన నువ్వే తీర్చాలి, నువ్వే సమర్థుడివి’ అన్నాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే సందేహం కలిగి, నా అంతటివాణ్ణి అడుగుతున్నాడని లోలోన పొంగిపోయి, ఉబ్బితబ్బిబ్బవుతుండగా ‘సృష్టి సమస్తంలో నీ దృష్టిలో ఎవరు గొప్ప?’ అనడిగాడు శ్రీమహావిష్ణువు. నారదుడు తడుముకోకుండా ‘భూదేవి పరమాత్మా! ఎందుకంటే ఆ తల్లి తనమీద నివసించే సకల జీవరాశినీ, వాటివల్ల కలిగే బాధలనూ భరిస్తోంది. తల్లికి క్షమ, సహనం ఎక్కువ. కనుక ధరణి చాలా గొప్ప’ అంటూ బదులిచ్చాడు. ‘కానీ నారదా! భూమిలో ముప్పాతిక భాగం నీరే కనుక జలం గొప్పది కాదా?’ అన్నాడు నారాయణుడు. ఆశ్చర్యంగా చూసి నిజమేనన్నాడు నారదమహర్షి. ‘నీటినంతటినీ మింగేసిన అగస్త్యముని గొప్ప కాదా?’ అడిగాడు మహావిష్ణువు. ఔనన్నాడు నారదుడు. ‘సమస్త రుషి మండలం ఆకాశంలో భాగమే కదా! మరి గగనం గొప్ప కాదా?’- అంటే అవునన్నాడు మహర్షి. ‘అంతటి ఆకాశాన్ని అవలీలగా కొలిచిన నా పాదం గొప్ప కాదా?’ నవ్వాడు విష్ణువు. విస్తుపోయాడు నారదుడు. ‘కానీ నా పాదం కంటే ‘నేను’ గొప్ప కాదంటావా?’ ఓరగా చూస్తూ అడిగాడు విష్ణువు. కాస్త సిగ్గుపడిన నారదుడు తనను క్షమించమన్నాడు. నిరంతరం నారాయణ స్మరణచేసే తనకు, ఈ చిన్న విషయం స్ఫురించనందుకు పశ్చాత్తాపం చెందాడు. తన గర్వాతిశయాన్ని అణిచిన విష్ణు పాదపద్మాలకు నమస్కరించి వెనుదిరిగాడు.

ముమ్మడిదేవుని సుబ్రహ్మణ్యశర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని