బ్రహ్మ పలికిన తొలి శబ్దం

కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్పిన శ్లోకమిది. వేదాలన్నీ ఏ పదాన్ని కీర్తిస్తాయో, సాధనలన్నీ ఏ పదాన్ని తెలియజేస్తాయో, ఏ ఆశతో బ్రహ్మచర్యం పాటిస్తారో ఆ పదమే ‘ఓం’ అని భావం.

Published : 08 Jun 2023 00:04 IST

సర్వవేదా యత్పదమామనంతి తపాంసి
సర్వాణి చ యద్వదంతి యదిచ్చంతో
బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం
సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్‌

కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి చెప్పిన శ్లోకమిది. వేదాలన్నీ ఏ పదాన్ని కీర్తిస్తాయో, సాధనలన్నీ ఏ పదాన్ని తెలియజేస్తాయో, ఏ ఆశతో బ్రహ్మచర్యం పాటిస్తారో ఆ పదమే ‘ఓం’ అని భావం. పరమశివుడు బ్రహ్మతత్వం గురించి అడిగి నప్పుడు సనత్కుమారుడు ‘ఒక్క ఓంకారం తోనే బ్రహ్మతత్వాన్ని వివరించవచ్చు. ఎలాంటి మాలిన్యమూ లేనిది, ద్వంద్వాలకు అతీతమైంది, సర్వానికీ శుభం కలిగించేది, అందరి దాహాలనూ తీర్చేది ఓంకారమే’ అని వివరించినట్టు భారతం చెబుతోంది.
ప్రణవం అని పిలుచుకునే ఓంకారం పరబ్రహ్మాన్ని తెలియజేసే శబ్దం. అకార, ఉకార, మకారాల కలయికే ఓంకారం. ఇది బీజాక్షరాల్లో ప్రధానమెంది. బ్రహ్మ ముఖం నుంచి వెలువడిన తొలి శబ్దం. వేదమంత్రాలు కూడా ఓంకార శబ్దంతోనే మొదలౌతాయి. ‘ఓంకారం త్రిమూర్తులకు ప్రతీక. ఓంకార ఉపాసనతో సర్వ ఆశలూ, ఆశయాలూ నెరవేరతాయి. లయాన్ని కలిగిస్తుంది. జగత్తు యథార్థ స్థితి తెలుస్తుంది. ఓంకారోపాసన చేసేవారు నమస్కరించదగిన వారవుతారు’ ఇదీ ధర్మశాస్త్ర సారాంశం. శాంతం, శివం, అద్వైతాల కలయిక అయిన ఓంకారాన్ని స్మరించేవారికి పరమాత్మ తత్వమేమిటో బోధపడుతుంది.

శరత్‌ చంద్రిక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని