శ్రీకృష్ణునికి గాంధారి శాపం

యుద్ధభూమిలో విగతజీవులై పడి ఉన్న పుత్రులను, ఇతర కౌరవ వీరులను చూసిన గాంధారి దుఃఖానికి అంతులేకపోయింది. కృష్ణుణ్ణి చూసి రోదిస్తూ ‘కౌరవ పాండవ యుద్ధాన్ని నివారించలేకపోయావు.

Published : 29 Jun 2023 00:10 IST

యుద్ధభూమిలో విగతజీవులై పడి ఉన్న పుత్రులను, ఇతర కౌరవ వీరులను చూసిన గాంధారి దుఃఖానికి అంతులేకపోయింది. కృష్ణుణ్ణి చూసి రోదిస్తూ ‘కౌరవ పాండవ యుద్ధాన్ని నివారించలేకపోయావు. న్యాయాన్యాయాలు తెలిసిన సమర్థుడివి అయ్యుండీ మృదుమధుర మాటలతో పనులు చక్కబెట్టలేదు. దుర్యోధనుణ్ణి నాశనం చేయ డానికే రాయబారం చేశావు. రాజ్యం బీడువారింది. నువ్వు చేసిన దారుణానికి నీ వైభవమంతా ఎలా నాశనమైపోతుందో చూడు! దాయాదులు వాళ్లలో వాళ్లు వైరం పెంచుకుని చనిపోయేట్టు చేశావు. నీ దాయాదులు కూడా ఇలాగే కలహించుకుని నశిస్తారు. సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత.. నీ దగ్గర ఎవరూ లేని సమయంలో దిక్కుమాలిన చావు చస్తావు. యాదవ స్త్రీలు భర్తల్ని, బంధువుల్ని పోగొట్టుకొని ఇలాగే కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇది సత్యం’ అంటూ సుదీర్ఘ కాలం పతివ్రతగా గడిపిన పుణ్యఫలం వల్ల కలిగిన తపశ్శక్తితో శపించింది గాంధారి.

శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ‘యాదవులకు మునీశ్వరులు ఇచ్చిన శాపాన్నే మళ్లీ ఇచ్చావు. ఇదేమీ కొత్తది కాదు. యాదవులకు నాశనమెలాగూ తప్పదు. వాళ్లను దేవతలు కూడా చంపలేరు. కానీ వాళ్లలో వాళ్లు కొట్టుకుని మరణిస్తారని మునులు శాపమిచ్చారు’ అంటూ శాంతవదనంతోనే వివరించాడు.

అటు మునులూ, ఇటు గాంధారీ ఇచ్చిన శాప ఫలితంగా ముసలం పుట్టుకతో యాదవ వంశం అంతమయ్యింది.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని