త్యాగజీవనమే అమృతయోగం

లోకంలో సంతృప్తిగా జీవించాలంటే మనం సుఖంగా, సౌఖ్యంగా ఉంటే సరిపోదు. నలుగురికీ సాయం చేయాలి. త్యాగబుద్ధితోనే అమృతసిద్ధి కలుగుతుంది.

Published : 13 Jul 2023 01:48 IST

లోకంలో సంతృప్తిగా జీవించాలంటే మనం సుఖంగా, సౌఖ్యంగా ఉంటే సరిపోదు. నలుగురికీ సాయం చేయాలి. త్యాగబుద్ధితోనే అమృతసిద్ధి కలుగుతుంది. సత్యానికి హరిశ్చంద్రుడు, ధర్మానికి ధర్మరాజు, తపోబలానికి మహర్షి విశ్వామిత్రుడు, దానానికి కర్ణుడు ప్రతీకలు. త్యాగజీవుల కోసం అమృతయోగం ఎదురు చూస్తుంటుంది. అది సిద్ధిస్తే భూలోకం స్వర్గమవుతుంది. శివుడు విషం తాను సేవించి దేవతలకు అమృతమిచ్చాడు. బలిచక్రవర్తి వామనమూర్తికి సర్వస్వం దానం చేశాడు. శిబి తన మాంసాన్ని డేగకు సమర్పించి పావురాన్ని రక్షించాడు. దేవ, దానవ, మానవ గణాలకు వాళ్లు ఆదర్శప్రాయులు, అమృతమూర్తులు.

ఇహపరాల నడుమ జీవనం సాగిస్తూ కష్టసుఖాలు చవిచూస్తూ దేని మీదా అనురక్తి, అయిష్టత లేకుండా తామరాకు మీద నీటి బిందువులా జీవించడమే జీవన్ముక్తి. అదే జీవిత పరమార్థం. నిష్కామకర్మ మార్గమే గమ్యానికి గమకం. భోగ జీవితం నుంచి యోగ జీవితం వైపు దృష్టి సారించమని రుగ్వేదంలోని ప్రథమ మండలం 164వది అయిన ‘సుపర్ణ సూక్తం’ సూచిస్తోంది. సృష్టి రహస్యాలు అందులో ఉన్నాయి. సుపర్ణుడంటే గరుత్మంతుడు. సూక్తం అంటే మంచి మాట. శబ్దం నుంచి వాక్కు, వాక్కు ద్వారా కాంతి వచ్చాయన్నారు పెద్దలు. కాంతి జ్ఞానానికి సంకేతం కదా!

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని