విజయబాటకు దారిదీపం శంకరుల జ్ఞానపంచకం

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు.. మహర్షులందించిన జ్ఞానభాండాలు. తమ అనుభవసారాన్ని చొప్పించి భవసాగరాన్ని దాటగలిగే సామర్థ్యాన్ని, జీవనగమ్యాన్ని చేరే సౌలభ్యాన్ని ఉపదేశించడమే వాటి లక్షణ, లక్ష్యాలు.

Published : 13 Jul 2023 02:06 IST

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు.. మహర్షులందించిన జ్ఞానభాండాలు. తమ అనుభవసారాన్ని చొప్పించి భవసాగరాన్ని దాటగలిగే సామర్థ్యాన్ని, జీవనగమ్యాన్ని చేరే సౌలభ్యాన్ని ఉపదేశించడమే వాటి లక్షణ, లక్ష్యాలు. ఆదిశంకరాచార్యుల జ్ఞానపంచకం మన గమనానికి మార్గసూచి.

ఒకసారి మహాశివుడు ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ వేగ ఉధృతికి కాలిమువ్వల నుంచి ఒకటి విడివడి భూలోకంలో ఆదిశంకరుడి అవతారం దాల్చింది. కనుకనే ఆ మహనీయుని సాక్షాత్తూ శివస్వరూపుడంటారు. ఆదిశంకరాచార్య రాసినన్ని గ్రంథాలు రాయడానికి ఒక వ్యక్తికి కనీసం 250 ఏళ్లు పడుతుందన్నారు రష్యా పరిశోధకులు. కానీ శంకరులు 22 ఏళ్ల కాల వ్యవధిలో ఆ మహద్గ్రంథాలన్నీ రాశారు. శంకరుల రచనల్లో ‘జ్ఞానపంచకం’ విలక్షణమైంది. ఇది ‘ఉపదేశపంచకం’, ‘సాధనాపంచకం’, ‘పంచరత్నమాల’ పేర్లతోనూ ప్రసిద్ధం.
కర్మలను వదిలేసి జ్ఞానం కోసం పాకులాడకూడదు అన్నది ‘జ్ఞానపంచకం’లో ఆచార్యుల ఉపదేశం. ఎలా సంభాషించాలో, ఎలాంటి కర్మలను ఆచరించాలో ఇందులో వివరించారు. ఆలోచనలో పరిణతి, ఆచరణలో నైపుణ్యం సాధించినప్పుడు ఇక వారి జీవితం జ్ఞాన మార్గంలోకి మళ్లుతుందని, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరడానికి ఈ సాధనా పంచకం మార్గదర్శిగా ఉపయోగ పడుతుందని ఎందరో పండితులు ప్రవచించారు.

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతా
మాత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం

వేదపఠనం, పరిపాలన, వ్యాపారం.. ఇలా ఆయా వర్గాలు తమకు నిర్దేశించిన అంశాలను అనునిత్యం అధ్యయనం చేయాలి. అందులో విచక్షణ చూపాలి. కర్తవ్య నిర్వహణే దైవం. అందులో చూపే చిత్తశుద్ధే ఈశ్వర పూజ. కాలం గురించిన విజ్ఞత, వ్యవహారాల పట్ల విచక్షణ చూపుతూ క్రమశిక్షణతో ముందుకు సాగాలి. ఒకరికి హాని తలపెట్టడం పాప హేతువని గ్రహించి, ఆత్మజ్ఞానాన్ని ఆర్జించే దిశగా పయనించమన్నది సందేశం.

సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతాం
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మై కాక్షరమర్థ్యతాం శ్రుతి శిరో వాక్యం సమాకర్ణ్యతాం

సజ్జన సాంగత్య ప్రాధాన్యతను గుర్తించి మంచివారితో కలిసుండేందుకు ప్రయత్నించాలి. వారిలోనూ కొంత చెడు ఉండొచ్చు. అది వదిలి, సుగుణాలనే గ్రహించాలి. సదా శాంతంగా ఉండాలి, పనిలో హడావుడి, తొందరపాటు నిర్ణయాలు వద్దు- అనేది శంకరాచార్యుల భావన. జ్ఞానులను, కార్యనిర్వాహకులను గౌరవించాలి. పనిని మెరుగుపరచుకునే స్ఫూర్తిదాయక అంశాల పట్ల ధ్యాస పెట్టాలి. అటువంటి అమూల్య విషయాలు వేదోపనిషత్తుల్లో లభ్యం కావచ్చు. లేదా పండితుల నోటి వెంట వినిపించ వచ్చు. వాటిని గ్రహించి అనుసరించేందుకు ప్రయత్నించాలి. ఇందుకు ఓంకార సాధన ఉపకరిస్తుంది.

బ్రహ్మ మనలో ఉన్నాడు

వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరఃపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్సు విరమ్యతాం శ్రుతిమతస్తర్కోనుసంధీయతాం
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేహమ్మతిరుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం

శ్రద్ధగా పనిచేసినప్పుడు ప్రశంసలు, బహుమతులు వస్తుంటాయి. అంతమాత్రాన గర్వం వద్దు. పెద్దలు, జ్ఞానసంపన్నులతో వాదనలు కూడదు. కుతర్కం లేదా వితండవాదం వద్దు. మనలో బ్రహ్మ ఉన్నాడని మననం చేసుకుంటే వేదాంతజ్ఞానం అలవడుతుంది. అంతా బ్రహ్మమే అనే భావన ఉంటే అహంకారం తలెత్తదు.

తక్కువ మాట్లాడు.. ఎక్కువ విను..

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్‌ ప్రాప్తేన సంతుష్యతాం
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతా
మౌదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతాం

సాత్వికాహారం.. అదీ సాధ్యమైనంత తక్కువ తింటూ ఆకలిని బుజ్జగించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆహారం, జలం శరీరానికి ఔషధాల్లా పనిచేసి ఆరోగ్యాన్నిస్తాయి. రజో, తమో గుణాలున్న ఆహారానికి చలించడం, వేసవిలో చల్లదనం, చలి కాలంలో వెచ్చదనం వంటి సౌకర్యాలూ, సదుపాయాల పట్ల ఎలాంటి కాంక్ష లేక అన్నిటికీ అతీతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ విని, తక్కువ మాట్లాడాలి. అలాగని నిర్లక్ష్యాలు, ఉదాసీనత చూపకూడదు.

ఏకాంతంలో ఉండు.. ఒంటరిగా కాదు..

ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం

ఏకాంతంలో సమస్యలను పునరాలోచించి పరిష్కరించుకోవచ్చు. మౌనం, ఏకాంతం దైవస్వరూపాలు. అవి మనతో మాట్లాడతాయి. దక్షిణామూర్తి మౌనంతోనే జ్ఞానాన్ని బోధించాడు. ఏకాంతంలో చుట్టూ ఉన్న చెట్టూపుట్టతో మమేకమౌతున్నట్టు భావిస్తే సర్వం బ్రహ్మమయమని బోధపడుతుంది.

ఎదురైన కష్టం దూదిపింజను తలపిస్తుంది. ఇవి మనం అలవరచుకుని, అనుసరించాల్సిన జ్ఞానపంచక సూత్రాలు. వీటిని సాధన చేస్తే జీవితంలో స్థిరత్వం సిద్ధించి, విజయబాటలో పయనం సాగుతుంది. లౌకిక ప్రపంచంలో ఏ విధంగా నడచుకోవాలో, ఏ సూత్రాలను పాటించి లబ్ధి పొందాలో తేటతెల్లం చేస్తుంది. నిశ్చలత్వం, నిగర్వం, మితభాషణం, అమిత శ్రవణం-పఠనం, ఏకాంతవాసం- మనిషిని మనీషిని చేస్తాయన్నారు శంకరులు. విజయబాటలో పయనించాలంటే జ్ఞాన పంచక సూత్రాలను తెలుసుకుని ఆచరించాలి.

జర్మన్‌ వేదాంతి మ్యాక్స్‌ ముల్లర్‌, మహాత్మా గాంధీ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరబిందో, రమణ మహర్షి, అబ్దుల్‌ కలాం, విక్రమ్‌ సారాభాయ్‌, అనీబిసెంట్‌, జిడ్డు కృష్ణమూర్తి.. ఇలా ఎందరో మహానుభావులు జ్ఞానపంచకం చదివి ప్రభావితులయ్యారు. అంత స్ఫూర్తిదాయక పంచకమిది.

డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని