వర్ణం... దైవ చిహ్నం

వర్ణం.. అందులో ఉండే అందం, ఆకర్షణ అపురూపం, అనిర్వచనీయం. ఏ రంగయినా ఆలోచనలు రేకెత్తిస్తుంది. అవి ఆహ్లాదం కలిగించడమే కాదు, ప్రయోజనాత్మకం కూడా.

Published : 20 Jul 2023 01:12 IST

వర్ణం.. అందులో ఉండే అందం, ఆకర్షణ అపురూపం, అనిర్వచనీయం. ఏ రంగయినా ఆలోచనలు రేకెత్తిస్తుంది. అవి ఆహ్లాదం కలిగించడమే కాదు, ప్రయోజనాత్మకం కూడా. సామాజిక, ఆధ్యాత్మిక, వైద్య, జ్యోతిష, పౌరాణిక గ్రంథాల్లో రంగుల ప్రభావాలూ, ఫలితాలను వర్ణించారు, విశ్లేషించారు.

మనమంతా కోరుకునేది మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం. అందుకు నియమ పూర్వక జీవనాన్ని కల్పించే ఆధ్యాత్మికత చక్కని మార్గం. ఆ దారిలో పయనించడంలో వర్ణ ప్రాధాన్యత ఉంటుందని, రంగుల్లో ముఖ్యమైనవి ఏడని అధర్వణవేదం పేర్కొంది.

అగ్ని ఎరుపు, ధైర్యసాహసాలకు సంకేతం. పసుపు శుభానికి చిహ్నం. రాజసానికి, ఆకర్షణకు ప్రతీక నీలం. వైభవాన్ని సూచించేది బంగారు వర్ణం. ఈ నాలుగు రంగుల కలయికతో ఏర్పడేది కాషాయం. అది త్యాగం, శుభం, శూరత్వం, వైభవాలకు చిహ్నం. కాషాయవర్ణంలో ప్రకాశవంతంగా కనిపించిన అంతర్యామిని తొలుత బ్రహ్మ దర్శించాడని యజుర్వేదం తైత్తిరీయ అరణ్యకంలో నారాయణ సూక్తం చెబుతోంది.

యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్రవస్త్రాన్వితా
యావీణా వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా
సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహా

అజ్ఞానాన్ని పోగొట్టి, సదా రక్షించమని సరస్వతీమాతను వేడుకుంటాం. ఆ దేవి ధరించినవన్నీ తెల్లనివే. సప్తవర్ణాలనూ ఏకం చేసుకుని ఇముడ్చుకున్నదే శ్వేతవర్ణం. ఇది స్పష్టత, స్వచ్ఛత, సున్నితత్వాలకు ప్రతీక. నలుపు శని గ్రహానికి ప్రీతికరమైన రంగు. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మనో సంయమనాన్ని కలిగిస్తుంది. దుష్టశక్తులు, దృష్టిలోని ప్రతికూలత ప్రభావం చూపకుండా అడ్డుకుంటుంది.           ఆకుపచ్చ జీవ చైతన్యానికి సంకేతం. ఆరోగ్యపరంగా మేలు చేసే రంగిది. ఈ వర్ణం నుంచి వచ్చే కాంతి కిరణాలు కళ్లకు చల్లదనం కలిగిస్తాయి. మనసులో ఆందోళన తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తాయి. ‘అరుణాం, కరుణాం   తరంగతాక్షీం’ అని అమ్మవారిని ఎరుపుతో వర్ణించారు. ఈ ఎరుపు ఉత్సాహం, ఉత్తేజం, ఉద్వేగాలకు ప్రతిక. పరాశక్తి, స్త్రీ దేవతలు ఎరుపు, నలుపు రంగుల్లో దర్శనం ఇవ్వడానికి కారణం- అమ్మవారు రజోగుణ, తమోగుణాలకు ప్రతీక అని తెలియచెప్పడమే. దుష్టశక్తులకు భయం కలిగించే లక్షణం రజోగుణంలో, దునుమాడే లక్షణం తమోగుణంలో ఉంది. అమ్మవారు ప్రధానంగా చేసేది ఈ రెండు పనులే కాబట్టి ఆ రంగుల్లో భక్తులకు దర్శనమిస్తుంది.

‘నీలతోయద మధ్యస్తాద్విద్యుల్లేఖేవ భాస్వరా..’ అని మంత్రపుష్పంలో, ‘మేఘశ్యామం పీతకౌశేయవాసమ్‌ శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాషితాంగమ్‌’.. మేఘంలా నల్లనైనవాడు, పసుపు వస్త్రాలు ధరించినవాడు.. అని విష్ణు సహస్రనామంలో- విష్ణుమూర్తిని వర్ణించారు. నీలం అనంతం, దివ్యత్వం, రాజసం, ఆకర్షణలకు ప్రతీక. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతని, చురుకుదనాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుల శరీరఛాయ అనంత ఆకాశానికి చిహ్నమైన నీలిరంగు.

‘ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్‌’ అంటూ నల్లకలువ వంటి రూపం కలిగి, జానకీ లక్ష్మణ సమేతుడైన శ్రీరాముని ధ్యానిస్తాం. అత్యున్నత స్థాయిలో ఉన్నా.. అందరికీ అందుబాటులో ఉంటాడనే భావన కూడా ఈ రంగులో ఇమిడి ఉంది. పసుపు రంగు పవిత్రత, శుభాలకు ప్రతీక. జ్ఞానాత్మక ఆలోచనలు కలగడానికి దోహదపడుతుంది.

యోగశాస్త్రం ఏమంటోంది..

మూలాధారం ఎరుపు, స్వాధిష్టానం సింధూరవర్ణం, మణిపూరకం బంగారురంగు, అనాహత చక్రం నీలం, విశుద్ధచక్రం నలుపు, ఆజ్ఞాచక్రం తెలుపు, సహస్రారం ఊదా రంగుల్లో ఉంటాయి. ఆయా రంగులను బట్టి షట్చక్రాలు ప్రభావితం అవుతాయని యోగశాస్త్రం వివరిస్తోంది.

వారం.. గ్రహం.. వర్ణం..

రక్తశ్యామో భాస్కరో గౌర ఇందురాత్యుచ్చాం
గోరక్త గౌరశ్చ వక్రః దూర్వాశ్యామో జ్ఞోగురుర్గార
గాత్ర శ్శ్వేత శ్శుక్రో భాస్కరిః కృష్ణదేహః
రాహుస్తు ధూమ్రవర్ణశ్చ చిత్రవర్ణో ధ్వజస్మృతః

సూర్యుడిది నలుపు, ఎరుపు రంగులు కలిసిన ముదురు ఎరుపురంగు. చంద్రుడిది తెలుపు, పసుపుల కలగలుపు వర్ణం. కుజుడిది రక్తవర్ణం. బుధుడు ఆకుపచ్చ. గురుడు పసుపు, శుక్రుడు శ్వేతవర్ణం. శని కృష్ణవర్ణం. రాహువు ధూమ్ర, కేతువు చిత్రవర్ణంలో ఉంటారని భావం. ఒక్కో వారం మీద ఒక్కో గ్రహ ప్రభావం ఉంటుంది కనుక అందుకు తగిన రంగులు అనుకూలమని జ్యోతిర్వైద్యం సూచించింది. ఆదివారం-రవి-ఎరుపు. సోమవారం-చంద్రుడు-తెలుపు. మంగళవారం-కుజుడు-నారింజ. బుధవారం-బుధుడు-ఆకుపచ్చ. గురువారం-గురుడు-పసుపుపచ్చ. శుక్రవారం-శుక్రుడు-తెలుపు. శనివారం-శని-నీలం/నలుపు.

వ్యాధి నియంత్రణలో

రంగులతో చికిత్స చేసి రోగాలు నియంత్రించవచ్చని ప్రాచీన గ్రంథాలు పేర్కొన్నాయి. శరీరంలో ఒక్కో భాగం ఒక్కో రంగుకు స్పందిస్తుందని, అందుకు తగ్గట్టు చికిత్స చేయొచ్చని ఆయుర్వేదం చెబుతోంది. చరకుడు వర్ణ చికిత్స సాయంతో అనేక వ్యాధులను నయం చేసినట్టు ఆధారాలున్నాయి. రక్తహీనత, నేత్రవ్యాధులను నివారించడంలో ఎరుపు ఉపకరిస్తుంది. తెలుపు మానసిక ప్రశాంతతను అందిస్తే, ఊదారంగు ఏకాగ్రచిత్తాన్నిస్తుంది. బంగారురంగు నిరాశ వ్యతిరేక భావాలను దూరం చేస్తుంది. మానసిక రుగ్మతలను నీలం, తలనొప్పి, అజీర్ణాలను ఆకుపచ్చ, విరోచనాలు, మూత్ర సంబంధ వ్యాధులను పసుపురంగు నివారిస్తాయి.

ఇతర దేశాల్లోనూ వర్ణచికిత్సపై నమ్మకం ఉంది. ఈజిప్టు, గ్రీసు, చైనా దేశాల్లో ఇది విస్తృతం. ‘తోత్‌’ భగవానుడు   వర్ణ చికిత్సను కనుగొన్నట్లు ఈజిప్ట్‌ పురాణాల్లో లిఖితమైంది. పెషావర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రోమోపతిలో పనిచేస్తున్న శాస్త్రవేత్త హసన్‌ వర్ణ చికిత్సా విధానాన్ని మరింత వృద్ధి చేశాడు.

కె.వి.యస్‌.యస్‌.శారద


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని