ముళ్లు కాదు.. రేగిపళ్లు చూడు

రామకృష్ణ పరమహంసకు కేశవచంద్రసేన్‌ అనే గృహస్థభక్తుడు ఉండేవాడు. పరమహంసకూ అతడంటే అభిమానం. అతడు ఆంగ్లవిద్యను అభ్యసించాడు, బ్రహ్మసమాజ నాయకుడు.

Published : 20 Jul 2023 01:11 IST

రామకృష్ణ పరమహంసకు కేశవచంద్రసేన్‌ అనే గృహస్థభక్తుడు ఉండేవాడు. పరమహంసకూ అతడంటే అభిమానం. అతడు ఆంగ్లవిద్యను అభ్యసించాడు, బ్రహ్మసమాజ నాయకుడు. రామకృష్ణులపై భక్తితత్పరత చూపుతూ సత్సంగాల్లో పాల్గొనేవాడు. ఆయన గురించి ప్రప్రథమంగా పత్రికల్లో రాసి బయటి ప్రపంచానికి తెలియజెప్పింది అతడే. పరమహంసకు విశ్వనాథ ఉపాధ్యాయ అనే మరో భక్తుడున్నాడు. గురుదేవులు అతణ్ణి కెప్టెన్‌ అని పిలిచేవాడు. ఆయన ఆచారాలు, నిష్ఠల విషయంలో పట్టుదల ఉన్న వ్యక్తి. ఆ కారణంతో కేశవ్‌సేన్‌ స్వభావం ఆయనకు అంతగా నచ్చకపోయేది. ఆ భావనతోనే ఒకసారి రామకృష్ణ పరమహంసతో ‘కేశవ్‌ ఆచారాలను బొత్తిగా పాటించడు’ అంటూ ఏవేవో ఉదాహరణలు చెబుతూ అతన్ని చులకన చేసి మాట్లాడాడు. అవన్నీ శాంతంగా విన్న రామకృష్ణ పరమహంస ‘ఆ విషయాలు నేనెందుకు పట్టించుకోవాలి? కేశవ్‌ హరినామం జపిస్తాడు. దానధర్మాలు చేస్తాడు. అందుకే నేను అతణ్ణి చూడటానికి వెళ్తాను. ఆయన భగవత్ప్రసంగాలు వినటానికి ఇష్టపడతాను. నేను రేగిపళ్లను మాత్రమే తింటాను. ఆ చెట్టుముళ్లతో నాకు నిమిత్తం లేదు’ అన్నారు. వ్యక్తుల్లోని సుగుణాలనే చూడాలని, వాటినే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తరచూ భక్తులకు హితబోధ చేసేవారు. ఏకపక్షంగా ఆలోచిస్తే ఆధ్యాత్మిక అన్వేషకులు కాలేరని, దోషదర్శనం పారమార్థిక పురోగతికి అడ్డంకిగా మారుతుందని తరచూ హెచ్చరించేవారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని