సత్సాంగత్యం ఎంత గొప్పదంటే..

నారదమహర్షి సత్సాంగత్య ఫలం గురించి చెప్పమని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అదేమిటో అనుభవపూర్వకంగానే చెప్పాలనుకున్నాడు.

Updated : 20 Jul 2023 05:59 IST

నారదమహర్షి సత్సాంగత్య ఫలం గురించి చెప్పమని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అదేమిటో అనుభవపూర్వకంగానే చెప్పాలనుకున్నాడు. ‘నారదా! మొదట తూర్పు వైపు వెళ్లి ఒక పశువులశాలలో పేడపురుగును, పశ్చిమదిశగా వెళ్లి పాడుపడిన దేవాలయంలో పావురాన్ని అడిగి నీ సందేహం తీర్చుకో’ అన్నాడు. నారదుడు వాటిని అడగ్గానే అవి ఆయన పాదాలమీద పడి ప్రాణాలు విడిచాయి. మహర్షి చింతిస్తూ శ్రీకృష్ణుడికి విషయం విన్నవించగా.. ‘అయితే ఈసారి ఉత్తరదిక్కుకు వెళ్లు. అక్కడి సంస్థానంలో రాజుకు బిడ్డ పుట్టాడు. అతడు నీ సందేహాన్ని తప్పక తీర్చగలడు’ అన్నాడు. మళ్లీ ఏమవుతుందోనని నారదుడు సంకోచించడం చూసి ‘ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. ఈసారి నిర్భయంగా వెళ్లు! అంతా శుభమే’ అన్నాడు శ్రీకృష్ణుడు. నారదుడు రాజ మందిరంలో శిశువును ప్రశ్నించిన మరుక్షణం ఆ పసికందు ఒక దేవతగా మారి నారదునికి ప్రణమిల్లి ‘దేవర్షీ! అలా ఆశ్చర్యపోతున్నారేమిటి? మీరు చూసిన పేడపురుగును నేనే. తమరి దివ్య సందర్శనంతో పావురంగా జన్మించాను. మరోసారి తమరి దర్శనభాగ్యంతో రాకుమారుడిగా జన్మించా. ఈసారి మీ దర్శనంతో దైవత్వం లభించింది. మహాత్ముల సాంగత్య మహిమ ఇంతటిది’ అంటూ దేవలోకానికి వెళ్లిపోయాడు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు కూడా..

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః

అంటూ ఉపదేశించారు.

డాక్టర్‌ టేకుమళ్ల వెంకటప్పయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని