అష్టలక్ష్ముల కంటే గొప్పది..

కాలం కలసిరాని సమయంలో నలుడు తనవల్ల అర్ధాంగి దమయంతికి కష్టాలు కలగకూడదనుకున్నాడు. ఆమెని విడిచి దూరంగా వెళ్లాడు.

Published : 27 Jul 2023 00:06 IST

కాలం కలసిరాని సమయంలో నలుడు తనవల్ల అర్ధాంగి దమయంతికి కష్టాలు కలగకూడదనుకున్నాడు. ఆమెని విడిచి దూరంగా వెళ్లాడు. అడవిలో దుఃఖిస్తూ చెట్టు కింద కూర్చోగా అతని శరీరంలోంచి ఒక ఆకారం వచ్చి, తాను ఆదిలక్ష్మినంది. నలుడు మౌనం వహించడంతో ఆ రూపం మాయమైంది. అతన్నుంచి మరో రూపం వచ్చి ధైర్యలక్ష్మినంది. నలుడు మాట్లాడలేదు. అదీ గాల్లో కలిసి పోయింది. ఈసారి మరో రూపం బయటికొచ్చి విజయలక్ష్మినంది. నలుడు ఏమీ బదులివ్వలేదు. అది కూడా మాయమైంది. ఈసారి విద్యాలక్ష్మి వచ్చింది. నలుడు కిమ్మనలేదు. తర్వాత గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి- ఇలా అష్టలక్ష్ములు తననుంచే వచ్చి.. అదృశ్యమైనా నలుడు బాధపడలేదు. ఈసారి అతని నుంచి గాలి పొరలాంటి రూపం వెలువడి ‘నీలో ఉండే సత్యరూపాన్ని మాయమవు తున్నాను’ అంది. ఈసారి నలుడు కన్నీరుపెడుతూ ‘అష్టలక్ష్ములు లేకున్నా బాధపడను. కానీ నాలోని సత్య స్వరూపం వెళ్లిపోతే ఇక నేను బతికీ ప్రయోజనం లేదు. జీవచ్ఛవంతో సమానం. ఓ సత్యమా! నాలోనే జీవిస్తూ నాతోనే అంతమవ్వు. అంతకుమించి మరేం కోరను’ అని వేడుకున్నాడు. అప్పుడు సత్యస్వరూపం అతనిలో చేరింది. వెంటనే అష్టలక్ష్ములు ప్రత్యక్షమై సత్యం ఉన్నచోటే తాము ఉంటామన్నాయి. సత్య స్వరూపం అంత గొప్పది.

బెహరా ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని