దైవాన్ని చేరాలంటే..

సాధకులు సదా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులు ఏమైనా ఇబ్బంది కలిగించినా సహనం చూపి  ఔదార్యాన్నీ, ఔన్నత్యాన్నీ  చాటుకుంటారు.

Published : 27 Jul 2023 00:10 IST

సాధకులు సదా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులు ఏమైనా ఇబ్బంది కలిగించినా సహనం చూపి  ఔదార్యాన్నీ, ఔన్నత్యాన్నీ  చాటుకుంటారు. ముఖ్యంగా ఈర్ష్య, ద్వేషాలు మనిషిని దిగజారుస్తాయి. ఉద్వేగ స్థితిలో మనసు మాట విన్నామంటే పిల్లవాడు చెప్పిన సలహా పండితుడు పాటించినట్లుంటుంది. 18 క్షణాల పాటు ఆలోచనారహిత స్థితిని సాధిస్తే ఆత్మజ్ఞానం సిద్ధించినట్లే అన్నాడో ఆధ్యాత్మికవేత్త. అదంత సులభం కాదు మరి. అందుకెంతో సాధన అవసరం. కోపతాపాలు శరీరంతోపాటు మనసునూ ప్రభావితం చేస్తాయి. కోపం, కామం విశ్వామిత్రుణ్ణి సైతం సాధనలో ఆటంకపరిచాయి. వందల సంవత్సరాల కఠోర తపస్సు నిరుపయోగమైంది. బ్రహ్మ ప్రత్యక్షమై బ్రహ్మర్షిత్వం ఇచ్చినా వశిష్టుడే చెప్పాలని పట్టు పట్టాడు. అంటే అక్కడ అహం అంగీకరించలేదు. తీవ్ర తపస్సు వల్ల లోకానికి ముప్పు వాటిల్లుతుందని వశిష్టుడు వచ్చి చెబితే అప్పుడు తపస్సు విరమించాడు. విజయగర్వితుడయ్యాడు. తర్వాత నిజానిజాలు గ్రహించి తనకన్నా అతడే గొప్పవాడని తెలుసుకున్నాడు.

ఎదుటివారి సంపద, పదవి, గౌరవాలు చూస్తే ఈర్ష్య కలుగుతుంటుంది. రాజసూయ యాగంతో పాండవులకు లభించిన సంపదలు, గౌరవాలు చూసి అసూయ చెందిన దుర్యోధనుడు వైరానికి దిగడంతో కురుక్షేత్రసంగ్రామం సంభవించింది. వినాశనానికి దారితీసే అసూయను తృప్తితో, అశాంతి కలిగించే ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. సుఖాలకు ఆనందం, దుఃఖాలకు విచారం సాధకుడికి కూడదు. అవి అంటని ద్వంద్వాతీత స్థితి వస్తేనే సాధకుడి ప్రయాణం గాడిలో పడినట్లవుతుంది. అలాగే పుట్టుకను మరణం వెంటాడుతుందనే ఆలోచన భయాన్ని కలిగిస్తుంది. అది సహజమని అర్థంచేసుకుని ఆధ్యాత్మికంగా పురోగమిస్తే ప్రేమ, సహనం, కరుణ, శాంతి లభిస్తాయి. జీవుడు, దేవుడు ఒకరేనన్న భావన ఏర్పడాలి. ఆ అద్వైతంలోంచి సర్వవ్యాపకత్వం వస్తుంది. అక్కడే ఆత్మజ్ఞాన అంకురం మొలకెత్తుతుంది. ఆదే సాధనలో మహావృక్షమై భగవంతుడి దగ్గరకు చేరుస్తుంది.

యం.వి.రామారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని