యముడి తీర్మానం

ఒక రాజ్యంలో మహారాజు బీదసాదలకు నిత్యం అన్నదానం చేయించేవాడు. ఓ రోజు భోజన వితరణ చేయిస్తుండగా, ఓ గద్ద పామును నోట కరచుకొని పోతోంది.

Published : 17 Aug 2023 00:06 IST

క రాజ్యంలో మహారాజు బీదసాదలకు నిత్యం అన్నదానం చేయించేవాడు. ఓ రోజు భోజన వితరణ చేయిస్తుండగా, ఓ గద్ద పామును నోట కరచుకొని పోతోంది. పాము- గద్ద పట్టు నుంచి తప్పించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయాసలో దాని కోరల నుంచి జారిన విషం భోజన పదార్థాల్లో పడిôది. అదెవరూ గమనించలేదు. కొంతసేపటికి ఆ ఆహారం తిన్న పేదలు చనిపోగా రాజు దిగ్భ్రాంతి చెందాడు. ఈ పాపానికి కారణమెవరన్నది యమ లోకంలో చర్చనీయాంశమైంది. గద్ద ఆహార సేకరణలో పామును పట్టుకుంది. సర్పం ప్రాణభయంతో విషం చిమ్మింది. ఈ పొరపాటు రాజుకు తెలియదు. ఆ పాపం ఎవరి ఖాతాలో వేయాలని చిత్రగుప్తుడు అడిగితే- ముందు భూలోకానికి పదమన్నాడు. దారిలో కొందరిని కదిలించాడు. ‘మహారాజు అన్నదానం పేరుతో విషం పెట్టి చంపుతున్నాడు’ అని కొందరు, ‘జనాభాను తగ్గించేందుకు విష ప్రయోగం చేయిస్తున్నాడు’ అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ‘నిజం తెలుసుకోకుండా, తమ కాలాన్ని వృథా చేసుకుంటూ గాలివార్తలు, వదంతులను వ్యాపింప చేస్తున్న వీళ్లందరి ఖాతాలో వేయండి ఆ పాపమంతా’ అంటూ చిత్రగుప్తుడికి ఆజ్ఞ జారీచేశాడు యమధర్మరాజు. ప్రచారంలో ఉన్న ఈ కథలో వాస్తవం ఎంతో కానీ.. అసత్యాలను ప్రచారం చేయడం మాత్రం మహా పాపమని అర్థంచేసుకోవాలి.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని