పుండరీకాక్షుడి పవిత్రోత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వరుడి వైభవోత్సవాల్లో స్వామికి ఏటా జరిగే పవిత్రోత్సవం ప్రత్యేకమైంది. ఈ ఉత్సవాన్ని ప్రాయశ్చిత్త ఉత్సవమని కూడా పిలుస్తారు.

Updated : 24 Aug 2023 05:40 IST

ఆగస్టు 27-29 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వరుడి వైభవోత్సవాల్లో స్వామికి ఏటా జరిగే పవిత్రోత్సవం ప్రత్యేకమైంది. ఈ ఉత్సవాన్ని ప్రాయశ్చిత్త ఉత్సవమని కూడా పిలుస్తారు. శ్రీనివాసుడు కొలువైన ఈ ఆనందనిలయ పరిసర పవిత్ర వాతావరణం, పునఃస్థాపితం కావటానికి ఈ వేడుకను ఏటా నిర్వహించటం ఆనవాయతీ. దేవాలయాల్లో సంవత్సరమంతా నిర్వహించే ఆరాధనల్లో తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. దోషాలు సంభవిస్తాయి. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాల్లో జరిగే మంత్ర, తంత్ర, క్రియాకలాప దోష నివారణ కోసం తిరుమలలో నిర్వహించే వేడుకే ఈ పవిత్రోత్సవం. యజ్ఞయాగాదుల్లో జరిగే లోపాలను పూర్ణాహుతితో తొలగించినట్లుగా, సంవత్సర దోషనివృత్తి కోసం పవిత్రోత్సవాన్ని విధిగా ఆచరించటం తిరుమలలో సంప్రదాయం. ఏడాదంతా ఏడుకొండలవాడికి జరిపే పూజలు ఈ పవిత్రోత్సవంతో పరిపూర్ణ మవుతాయని అనాదిగా అర్చకుల, భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణమాసంలోని శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి.. ఈ మూడు రోజుల్లో వైదిక ఆచారాలతో ఉత్సవం నిర్వహిస్తారు.

హోమాలు.. అభిషేకాలు..

ఉత్సవాలు ప్రారంభమైన తొలిరోజు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కూడిన స్వామి వారి ఉత్సవమూర్తులను పవిత్రోత్సవ మండపానికి తీసుకుని వస్తారు. రంగురంగుల అద్దాలతో తయారు చేసిన పట్టు పవిత్రా లను (పట్టు దారంతో చేసిన దండలు) యాగ శాలలో ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. వీటి మధ్య ఒక వేదికపై నవ కలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించి హోమాలు చేస్తారు. ఉత్సవమూర్తికి అభిషేకం, పూజాదికాలు నిర్వహిస్తారు. అలంకృతుడైన స్వామివారిని సాయంత్రం మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఇక రెండో రోజు పట్టుపవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తికి, వక్షస్థలంలోని దేవేరులకు, ఆనందనిలయంలో కొలువైన ఇతర దేవతామూర్తులకు, పుష్కరిణి గట్టుపై వెలసిన ఆంజనేయస్వామికి, సమీపంలోని బేడి ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. ఈ పవిత్రాలు సమర్పించటం వల్ల అశేష భక్తజనావళికి శుభం కలుగు తుందని విశ్వాసం. ఇక మూడోరోజు తొలిరోజు తరహాలోనే హోమాలు, అభిషేకాలు, పూజా కైంకర్యాలు పూర్తిచేసి పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఈ ఉత్సవాలు తిరుమల శ్రీవేంకటేశ్వరుడికే కాకుండా తిరుపతి గోవిందరాజస్వామికి, తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి, తిరుపతి సమీపంలోని నారాయణవనం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి వారికి, అప్పలాయిగుంట శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారికి కూడా నిర్వహించటం విశేషం. ఈ పవిత్రోత్సవాన్ని తొలుత 1463లో సాళువ మల్లయ్య దేవరాజ అనే రాజు తిరుమలస్వామికి చేయించారని చెప్పే కథలు ఉన్నాయి. శతాబ్దం పాటు జరిగిన ఈ ఉత్సవం తర్వాత ఎందుకో నిలిచిపోయింది. 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఉత్సవాన్ని పునరుద్ధరించి, నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. దేవస్థాన అనుబంధ ఆలయాల్లోనూ నిర్వహించేలా నిర్ణయించారు. 

బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని