కాలానికి కొలమానాలు తిథులు

వివాహం, గృహప్రవేశం, విద్యాభ్యాసం.. దేనికైనా తిథి వార నక్షత్రాలు చూస్తాం. పుట్టిన నక్షత్రానికి ప్రస్తుత తిథి అనుకూలమో కాదో తెలుసుకుంటాం. మరింత నమ్మితే.. మొక్క నాటడం నుంచి దూర ప్రయాణం వరకూ- దేనికైనా తిథులు పాటిస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది వాటికి.

Updated : 07 Sep 2023 10:03 IST

వివాహం, గృహప్రవేశం, విద్యాభ్యాసం.. దేనికైనా తిథి వార నక్షత్రాలు చూస్తాం. పుట్టిన నక్షత్రానికి ప్రస్తుత తిథి అనుకూలమో కాదో తెలుసుకుంటాం. మరింత నమ్మితే.. మొక్క నాటడం నుంచి దూర ప్రయాణం వరకూ- దేనికైనా తిథులు పాటిస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది వాటికి.

చాంద్రమానం ప్రకారం తిథి వార నక్షత్ర కరణ యోగాలు కాలానికీ, కాలగమనానికీ సహకరించే పంచాంగాలు. రోజులో 16 నుంచి 19 గంటల పాటు సాగే సమయాన్ని తిథి అంటారు. ఈ పదహారు తిథులూ- పదహారు కళలకు నిలయాలు. ఒక్కో తిథికి ఒక్కో విశేషం ఉంది. దేని ప్రత్యేకత దానిదే. ఒక్కో తిథికి ఒక్కో దేవత అధిదేవతగా నిలిచి, సంచార ఫలాలను అందజేస్తూ లోకాన్ని సర్వదా రక్షిస్తోంది.

పాడ్యమి

ఇది మొట్టమొదటి తిథి. దీనికి ప్రతిపత్తు అనే మరో పేరుంది. పాడ్యమి నాటి పూజ ఇహపర సౌఖ్యాలను అందిస్తుంది. పాడ్యమికి అధిదేవత అయిన అగ్నిదేవుని ఈ తిథి రోజున పూజించాలి. ముఖ్యంగా మార్గశిర పాడ్యమి నాడు విధిగా అగ్నిదేవుని ఆరాధించాలి. చైత్రశుద్ధ పాడ్యమి కూడా విశిష్టమే. ఆరోజే ఉగాది పర్వదినం. పాడ్యమి బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టం. అందుకే ఈ తిథినాడు బ్రహ్మ దేవుని పూజించాలి. దేవీ నవరాత్రులు ఆరంభమయ్యే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున ఆదిపరాశక్తిని ఆరాధిస్తాం.

విదియ

ఇది లక్ష్మీనారాయణులను, అశ్వినీ దేవతలను పూజించే తిథి. దీనికి అశ్వినీ దేవతలు అధిదేవతలు. కార్తిక శుద్ధ విదియ భగినీ హస్త భోజన పర్వదినం. సోదరుడైన యమధర్మరాజును యమునాదేవి ఇంటికి పిలిచి వండిపెట్టి, వరాలు పొందింది. అన్నదమ్ములకు ప్రేమగా తినిపించి, వారి ఆత్మీయతను పొందుతున్న రాఖీ సంప్రదాయం అలా వచ్చిందే. విదియ నాడు మృత్యుభయ నివారణకు యమదేవుని పూజిస్తారు. ఈరోజు చేసే పూజ ఆయురారోగ్యాలనిస్తుంది.

తదియ

దీనికి అధిదేవత గౌరీదేవి. చైత్ర శుక్ల తదియ పరమశివుడు- పార్వతీదేవిని వివాహమాడిన రోజు. ఆ రోజు అర్ధనారీశ్వర రూపాన్ని ఆరాధిస్తారు. అట్ల తదియ, ఉండ్రాళ్ల తదియ, అక్షయ తృతీయలు విశిష్ట దినాలు. తదియ నాటి పూజ సౌభాగ్యాన్నిస్తుంది.

చవితి

ఇది గణేశునికి ప్రీతికరమైన తిథి. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. ఆరోజు చేసే పూజ సిద్ధిని, బుద్ధిని ఇస్తుంది. ప్రతి మాసంలో బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు. ఇది కష్టాలను తొలగిస్తుందని నమ్ముతారు. కార్తిక చవితి నాగుల చవితి పర్వదినం. ఈ తిథికి అధిదేవత విఘ్నాలను తొలగించే వినాయకుడు.

పంచమి

ఈ తిథిని శ్రీ తిథి అని కూడా అంటారు. సకల దేవతలకూ ఇష్టమైంది. ఈరోజు ఏ దేవతను పూజించినా విద్య, ఆయుష్షు అందుతాయి. నాగ పంచమి, రుషి పంచమి పర్వదినాలు. పంచమి తిథికి అధిదేవత నాగదేవత.. అంటే ఆదిశేషుడు.

షష్ఠి

షణ్ముఖుడికి చాలా ఇష్టమైంది. కుమార షష్ఠి మహాపర్వదినం. షష్ఠి రోజు చేసే పూజ ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ తిథికి అధిదేవత కుమారస్వామి.

సప్తమి

సప్త అశ్వాల రథాన్ని అధిరోహించిన సూర్యదేవుడు ఈ తిథికి అధిదేవత. సప్తమి నాడు చేసే పూజ సకల పాపాలూ పోగొడుతుంది. ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించడం శ్రేష్ఠం. అలాగే సరస్వతీదేవిని పూజిస్తే కోరిన విద్య లభిస్తుంది.

అష్టమి

శ్రావణ బహుళాష్టమి శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినం. ఆదిపరాశక్తి- యోగమాయాదేవి రూపంలో యశోదమ్మకు జన్మించిన రోజు. శ్రీకృష్ణాష్టమి, దుర్గాష్టమి పర్వదినాలు. అష్టమి రోజున ఏ దేవతను పూజించినా మోక్షం తథ్యం. ఈ తిథికి అష్టమాతృకలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి- అధిదేవతలు.

నవమి

చైత్రశుద్ధ నవమి శ్రీరామచంద్రుని జన్మదినం. మహర్నవమి, శ్రీరామ నవమి పర్వదినాలు. నవమి రోజు చేసే పూజ మోక్షాన్నిస్తుంది. ఈ తిథికి అధిదేవత దుర్గాదేవి.

దశమి

సర్వ జగానికీ, సకల విజయాలనూ ప్రసాదించే మహాతిథి ఇది. సాక్షాత్తు జగన్మాతకే విజయాన్ని కలుగజేసిన రోజు విజయదశమి. అందుకే అపరాజిత అయిన ఆదిపరాశక్తిని ఈ రోజున పూజించాలి. దశమినాటి పూజ శక్తిని ప్రసాదిస్తుంది. ఈ తిథికి ఇంద్రాది దశదిక్పాలకులు అధిదేవతలు.

ఏకాదశి

ఏకాదశి విష్ణువు నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహా విష్ణువు ఉత్తర ద్వార దర్శనంతో వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి మహాపర్వదినం. ఏకాదశి తిథికి అధిదేవత కుబేరుడు. ఈ రోజు విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైంది.

ద్వాదశి

ఇది వామన, త్రివిక్రమ మూర్తులకు, లక్ష్మికి ప్రతిరూపమైన తులసిమాతకు ఇష్టమైన తిథి. కార్తిక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఆ రోజు తులసీనారాయణులకు (తులసి కొమ్మకి, ఉసిరిక కొమ్మకి) కల్యాణం చేసి పూజిస్తారు. ద్వాదశి రోజున చేసే పూజతో ఇహలోకంలో భుక్తి, పరలోకంలో ముక్తి ప్రాప్తిస్తాయి. ఈ తిథికి అధిదేవత విష్ణువు.

త్రయోదశి

ఈ తిథి శివకేశవులకూ, శనిదేవుడికీ ప్రీతికర మైంది. శనివారం నాడు త్రయోదశి తిథి కలిస్తే అది విశిష్ట దినం. ఆ రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేసి, అనుగ్రహం పొందుతారు. త్రయోదశి రోజు చేసే పూజ ఇహలోక సౌఖ్యాన్నిస్తుంది. ఈ తిథికి అధిదేవత ధర్ముడు.

చతుర్దశి

శివకేశవులకు ఇష్టమైన తిథి ఇది. లోక కంటకుడైన నరకాసురుణ్ణి సంహరించి విశ్వ శ్రేయస్సు చేకూర్చింది ఈ రోజే. చతుర్దశి నాడు చేసే పూజ ఆనందాన్ని అందిస్తుంది. ఈ తిథికి అధిదేవత రుద్రుడు.

అమావాస్య

శివుడికి ఇష్టమైన తిథి ఇది. నరకాసురుణ్ణి వధించిన ఆనందంతో వేడుక చేసుకునే దీపావళి పర్వదినం ఆశ్వయుజ అమావాస్య నాడే. శుభ, అశుభ కర్మలకు అమావాస్య పెట్టింది పేరు. పితృదేవతలకు ప్రీతిని కలిగించేది మహాలయ అమావాస్య. ఈరోజు చేసే పూజ కైలాస ప్రాప్తిని కలిగిస్తుంది. ఈ తిథికి అధిదేవతలు పితృదేవతలు.

పూర్ణిమ

వరాహమూర్తి, భూదేవి, సావిత్రీ మాతలకు ప్రియమైన తిథి ఇది. వైశాఖ పూర్ణిమ, గురుపూర్ణిమ, శ్రావణ పూర్ణిమ (రాఖీ), కార్తిక పూర్ణిమలు పర్వదినాలు. పూర్ణిమరోజు చేసే పూజ విద్య, వినయ, శక్తి, ధైర్య సౌభాగ్యాలను ఇస్తుంది. ఈ తిథికి అధిదేవత చల్లదనాల చంద్రుడు.

ఆయా తిథులకు ప్రత్యేకత, విశిష్టత ఉన్నప్పటికీ.. నిజానికి ప్రతి రోజూ పర్వదినమే. తిథి పేరు ఏదైనా.. పూజా విధానం వేరైనా- ఆరాధించేది కాలస్వరూపుణ్ణే. తిథి కాలానుగుణం. కాలం భగవదనుసరణం. కాలమే భగవంతుడు.

డా.పి.లలితవాణి  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని