అది అష్టమ అవతారం!

భాద్రపద శుక్ల విదియ బలరామ జయంతి. దశావతారాల్లో బలరామ అవతారం కృష్ణావతారానికి బదులుగా, అష్టమ అవతారంగా జగత్‌ ప్రసిద్ధం. జయదేవుడు ‘జయజగదీశ హరే’ అంటూ గానం చేసింది దీని గురించే.

Updated : 14 Sep 2023 06:43 IST

సెప్టెంబరు 17 బలరామ జయంతి

భాద్రపద శుక్ల విదియ బలరామ జయంతి. దశావతారాల్లో బలరామ అవతారం కృష్ణావతారానికి బదులుగా, అష్టమ అవతారంగా జగత్‌ ప్రసిద్ధం. జయదేవుడు ‘జయజగదీశ హరే’ అంటూ గానం చేసింది దీని గురించే. కృష్ణపరమాత్ముడు చెరసాలలో దేవకీ గర్భంలో ప్రవేశించడం ఒక విచిత్రం. బలరాముడి జన్మ వృత్తాంతం ఇంకో అద్భుతం. మధురానగరం యాదవరాజులకు ముఖ్యపట్టణం. కంసుడు తన ముద్దుల చెల్లెలు దేవకికి వసుదేవుడితో వివాహం చేశాడు. కొత్త దంపతులను రథంలో తీసుకు వెళ్తుండగా- దేవకి అష్టమ గర్భం నీ పాలిట మృత్యువని వెల్లడించింది ఆకాశవాణి. అది విన్న కంసుడు దేవకిని చంపబోతే- ఆ శిశువును నీకే అప్పజెప్తా నని వసుదేవుడు మాటిచ్చాడు. గండం గడిచినా, కారాగారం తప్పలేదు. హరి అనుగ్రహంతో వారికి బలరామ, కృష్ణులు జన్మించారు. అన్నదమ్ములు ధర్మానికి వెన్నుదన్నుగా నిలిచారు. చెరసాలలో దేవకికి పుట్టిన ఆరుగురు శిశువులను కంసుడు వధించాడు. ఆదిశేషుడు ఏడో శిశువుగా దేవకి గర్భంలో ప్రవేశించగా, యోగమాయ ఆ గర్భాన్ని రోహిణిలో ప్రవేశపెట్టింది. ఆ తేజం బలరాముడిగా అవతరించాడు. ఆ తర్వాత దేవకి గర్భంలో విష్ణుమూర్తి, యశోద గర్భంలో ఆదిపరాశక్తి ప్రవేశించారు. కృష్ణుడు పుట్టగానే వసుదేవుడు యశోదకు అప్పగించి, ఆదిశక్తిని దేవకికి ఇచ్చాడు. శిశువు గురించి విన్న కంసుడు, ఆడపిల్లనే కనికరం లేకుండా ఛేదించబోయాడు. ‘మృత్యువు నీ కోసం గోకులంలో ఎదురుచూస్తోంది’ అంటూ హెచ్చరించింది ఆదిశక్తి. బలరామ కృష్ణులు ఒకేచోట పెరిగి పెద్దవారయ్యారు. ఆదిశక్తి చేసిన మహోపకారానికి, భక్తిపూర్వకంగా వసుదేవుడు భద్రకాశి, విజయదుర్గ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక, ఇళ- ఇలా పద్నాలుగు విధాల సత్కరించాడు. అన్నీ అమ్మవారి కళారూపాలే. అలా జగన్మాత అప్పుడు, ఇప్పుడు కూడా నిత్యపూజలు అందుకుంటోంది.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు