తిరుమలేశునికి గరుడవాహన సేవ

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి జరిగే నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాల్లో అత్యంత విశిష్టమైంది బ్రహ్మోత్సవం. తొమ్మిది రోజుల ఈ ఉత్సవాల్లో ఐదో రోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

Published : 21 Sep 2023 00:22 IST

సెప్టెంబరు 22 తిరుమల శ్రీవారి గరుడోత్సవం

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి జరిగే నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాల్లో అత్యంత విశిష్టమైంది బ్రహ్మోత్సవం. తొమ్మిది రోజుల ఈ ఉత్సవాల్లో ఐదో రోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారి వాహనమైన గరుడుడి చిత్రాన్ని వస్త్రంపై చిత్రీకరిస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవీ భూదేవీ సమేతుడైన శ్రీమలయప్ప స్వామి సమక్షంలో మీన లగ్నంలో కొడితాడుకు కట్టి నూతన కేతనాన్ని బంగారు ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ఆకాశానికెగసిన గరుడుడు బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ ముక్కోటి దేవతలను ఆహ్వానించడమే ఇందులోని పరమార్థం.

వాహనాల విశిష్టత

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఒక్కో వాహనానికి ఒక్కో విశిష్టత ఉంది. ధ్వజారోహణం జరిగిన రాత్రి శ్రీదేవీ భూదేవీ సమేతంగా శ్రీమలయప్ప స్వామి ఏడు పడగల శేష వాహనంపై శ్రీపద్మనాభస్వామి వారి అలంకరణలో భక్తులు దర్శించుకుంటారు. రెండో రోజు ఉదయం శ్రీవారు మాత్రమే ఐదు పడగల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లన గ్రోవితో మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షిస్తాడు. అదేరోజు రాత్రి స్వామివారు సరస్వతీ రూపంలో హంస వాహనంపై, మూడో రోజు ఉదయం యోగనృసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తుంటే చూసి భక్తులు తరిస్తారు. ఆ రోజు రాత్రి శ్రీదేవీ భూదేవీ సమేతుడై శ్రీమలయప్పస్వామి ముత్యపు పందిరిపై కాళీయమర్దన చిన్నికృష్ణుడిగా, నాలుగో రోజు ఉదయం కల్పవృక్షంపై గోవుల గోపన్న అలంకారంలో దర్శనమిస్తాడు. రాత్రి సమయంలో సర్వభూపాల వాహనంపై విహారం. ఐదో రోజు ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిస్తాడు. ఇందులో స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామిని అలంకరిస్తారు. ఆరో రోజు ఉదయం శ్రీమలయప్పస్వామి వేంకటాద్రిరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులను కటాక్షిస్తాడు. మధ్యాహ్నం శ్రీదేవీ భూదేవీ సమేతుడైన శ్రీమలయప్పస్వామికి వసంతోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం బంగారు రథాన్ని, రాత్రి గజ వాహనాన్ని అధిరోహించి- స్వామి భక్తులను కటాక్షిస్తాడు. ఏడో రోజు ఉదయం సప్త అశ్వాలున్న సూర్యుని రథంపై ఎర్రటి పూలమాలలు ధరించి మాడవీధుల్లో విహరిస్తాడు. రాత్రి చల్లని వాతావరణంలో చంద్రప్రభ వాహనంపై కృష్ణుడి అలంకారంలో దర్శనమిస్తాడు. ఎనిమిదో రోజు రథంపై ఊరేగుతుంటే.. భక్తులు ఆ వాహనాన్ని లాగడం రథోత్సవ ప్రత్యేకత. ఆ రాత్రి అశ్వవాహనంపై కల్కి అవతారంలో కనిపిస్తాడు. తొమ్మిదో రోజు ఉదయం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ చేస్తారు. తర్వాత పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. రాత్రి ఆలయంలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీమలయప్పస్వామి సమక్షంలో బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలకులకు వీడ్కోలు పలుకుతూ గరుడ కేతనాన్ని ధ్వజస్తంభం నుంచి కిందికి దించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

గరుడ వాహనం మహా విశిష్టం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం ఎంతో విశిష్టమైంది. శ్రీవారికి గరుడుడు దాసుడిగా, మిత్రుడిగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా సేవిస్తుంటాడు. గరుడ సేవ ఉత్సవంలో శ్రీమలయప్పస్వామిని మూల విరాట్టుకు నిత్యం అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం తదితర విశిష్ట ఆభరణాలతో అలంకరిస్తారు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం నుంచి అక్కడి గోదాదేవికి అలంకరించిన పూలమాలలను తిరుమలకు తెప్పించి స్వామికి అలంకరిస్తారు.

మూడేళ్లకు ఒకసారి..

అధికమాసం ప్రతి మూడేళ్లకు ఒకసారి వస్తుంది. కన్యాశ్రవణం అధికమాసం లేని ఏడాదిలో ఆశ్వయుజ మాసంలో, అధికమాసం ఉన్నప్పుడు భాద్రపద మాసంలో వస్తుంది. భాద్రపద ఉత్సవాలను సాలకట్ల(వార్షిక), ఆశ్వయుజ ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. ఈ ఉత్సవాల్లో అంకురార్పణ, ధ్వజారోహణ, ధ్వజావరోహణ ఉండవు. ఇందులో కొయ్య తేరుకు బదులు బంగారు రథాన్ని వినియోగిస్తారు. 

మహంకాళి కిరణ్‌, తిరుపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని