ఇష్టసిద్ధి కలగాలంటే..

భీష్మపితామహుడు అంపశయ్య మీద చివరి క్షణాల కోసం నిరీక్షిస్తున్నాడు. కృష్ణపరమాత్ముడు.. పాండు పుత్రులను పిలిచి సర్వమానవ శ్రేయస్సుకు మేలుచేసే స్తోత్రాన్ని భీష్ముడి నుంచి తెలుసుకోమన్నాడు.

Updated : 05 Oct 2023 01:38 IST

భీష్మపితామహుడు అంపశయ్య మీద చివరి క్షణాల కోసం నిరీక్షిస్తున్నాడు. కృష్ణపరమాత్ముడు.. పాండు పుత్రులను పిలిచి సర్వమానవ శ్రేయస్సుకు మేలుచేసే స్తోత్రాన్ని భీష్ముడి నుంచి తెలుసుకోమన్నాడు. శ్రీకృష్ణుడు తన గురించి తాను చెప్పడం భావ్యంకాదని ఆయన ద్వారా ఉపదేశం పొందేలా చేశాడు. అలా ధర్మరాజు అడగ్గా.. భీష్ముడు ‘సర్వజగానికీ మూలమైన శ్రీమన్నారాయణుడే కృష్ణపరమాత్మగా వెలిశాడు. ఆ పాదపద్మాలను సేవించడమే ముక్తిదాయకం. విష్ణుసహస్ర నామ స్తోత్రంలో విష్ణు వర్ణన, సహస్రనామాలు, ఫలశృతి- అంటూ మూడు భాగాలున్నాయి. దీన్ని భక్తితో, నమ్మకంతో పఠించినవారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. భయం, రోగాలు, ఆపదల నుంచి బయటపడతారు’ అంటూ వివరించాడు.

విశ్వాసో ఫలదాయకం- అంటే నమ్మివారికి నమ్మినంత ఫలితం. పార్వతీ పరమేశ్వర సంవాదంలో విష్ణుసహస్రనామస్తోత్ర లఘు పారాయణ గురించి పార్వతి అడగ్గా- సర్వజనులూ సులభంగా పలికే ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే’ శ్లోకం చదువుకోమన్నాడు పరమశివుడు. రామ నామాన్ని మూడుసార్లు పలికితే సహస్రనామాలకు సమానమైన ఫలితాన్ని పొందవచ్చునన్నాడు.

విష్ణుసహస్రనామంలో 108 శ్లోకాలున్నాయి. 27 నక్షత్రాలతో 108 పాదాలు ఏర్పడతాయి. తమ నక్షత్రం, పాదాన్ని అనుసరించి ఆ శ్లోకాన్ని పఠిస్తే గ్రహపీడలు తొలగి సర్వ శుభాలూ కలుగుతాయి. ఇది శాంతి సౌఖ్యాలను ఇస్తుందనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి తన వద్దకు ఆర్తితో వచ్చిన భక్తులకు శ్రీవిష్ణుసహస్రనామం పారాయణ చేయమనేవారు. ‘గేయం గీతా నామ సహస్రం’- అన్నది భజగోవిందంలో ఆదిశంకరుల ఉపదేశం. అంటే నిత్యం భగవద్గీత, విష్ణుసహస్రనామ పారాయణ చేయమని హితోపదేశం.

పరాశరం సచ్చిదానందమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని