మనసు గతి ఇంతే.. మన సుగతి అదంతే..

చదువు, సంపద, సంతానం.. ఇలా అష్ట ఐశ్వర్యాలూ కోరుకుంటాం. నిజానికి అంతకంటే ముఖ్యమైంది ఆరోగ్యం. అంతేగా మరి.. ఒళ్లు సహకరించకున్నా.. జిహ్వకు నచ్చింది తినలేకపోయినా- కోట్లు గడించి ఏం ప్రయోజనం? ఇక మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అది కరువైతే అంతా శూన్యమే!

Updated : 05 Oct 2023 09:27 IST

అక్టోబరు 10 ప్రపంచ మానసిక దినోత్సవం

చదువు, సంపద, సంతానం.. ఇలా అష్ట ఐశ్వర్యాలూ కోరుకుంటాం. నిజానికి అంతకంటే ముఖ్యమైంది ఆరోగ్యం. అంతేగా మరి.. ఒళ్లు సహకరించకున్నా.. జిహ్వకు నచ్చింది తినలేకపోయినా- కోట్లు గడించి ఏం ప్రయోజనం? ఇక మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అది కరువైతే అంతా శూన్యమే!

న శరీరం- అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ అనే 5 కోశాలతో ఉంటుందన్నారు యోగశాస్త్ర పండితులు. మనోమయ కోశం మనసు స్థానం. దీని మీద పట్టు, నియంత్రణ ఉంటే మానసిక ఆరోగ్యం సుస్థిరం. లేదంటే అంతా తేడా. ఈ తేడా రాకుండా మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

మనసు చాలా చంచలమైంది. శునకం పనున్నా లేకున్నా.. పరిగెడుతుందే కానీ నిదానంగా నడవదు. మనసూ అంతే. ఆ నిరంతర పరుగు, తపన.. అన్నీ సుఖ సంతోషాల వెతుకులాటే. ఆ చంచలత్వంలో, వెంపర్లాటలో చిత్రవిచిత్ర ఊహలెన్నో! మనసు రంగురంగుల చిత్రాల్లాంటి కల్పనలు చేస్తుంటే, అవి శాశ్వతం, సజీవం అని భ్రమించి.. విఘాతాలు, వినాశనాలకు పాల్పడటం కద్దు. తర్వాత జీవుడు పశ్చాత్తాప్పడినా.. ప్రయోజనం లేదు. ప్రశంసలకు నోచుకునే మంచి పనుల కన్నా నరకసదృశం, పతనావస్థకు దారితీసే పనులు చేయడమే ఎక్కువ. అదే మనసు ఆడుకునే ఓ వింత ఆట. దాని ప్రేరక శక్తి చాలా ఎక్కువ. దానివల్లే ఎండమావుల్లాంటివి రూపొందుతాయి. సీతాకోకచిలుకలను పిల్లలు పట్టుకోవాలని వెంబడించినట్లు.. ఎండమావుల కోసం పరుగు సాగుతుంటుంది. ఆ కల్పనలు, కోరికలు, ఆకాంక్షల వెంట శరీరం సాగించే తెలివి తక్కువ పని ఇది. సుఖసౌఖ్యాల పట్ల ఆశ అందుకు పురికొల్పుతుంది.

మనసు చేసే మాయల్లో ప్రధానమైంది దేన్నెలా దక్కించుకోవాలో పథకం రచించటం ఒకటి. దాని ప్రకారమే- మనోహరమైన రంగురంగుల ప్రణాళిక తయారవుతుంది. ఇక అప్పటి నుంచి మెదడు దాని వెంటపడుతుంది. శరీరం ఆ దిశలోనే పనిచేస్తుంది. అసలు సంగతేమిటంటే- మనసు చంచలమైంది. పథకం ప్రకారం రూపొందించిన ప్రణాళికల మీద నిలవదు. ఎప్పటికప్పుడు కొత్తవి కల్పిస్తూనే ఉంటుంది. నిన్నటిది పూర్తవకుండానే మరోదాంతో ముందుకొస్తుంది. మొదటిదాన్ని వదిలేసి కొత్తదాన్ని పట్టుకుంటుంది. ఇలా అనేక ప్రణాళికలు అసంపూర్ణాలుగా మిగులుతూ, కొత్తవి తయారవుతూ ఉంటాయి.

పై జన్మకు వెంటాడేది అదే..

నియంత్రణ లేని మనసుతో వచ్చే ప్రమాదమే ఇది. ఇదేమీ అంత చిన్న విషయం కాదు. ఈ ప్రమాదమే కర్మఫలమై మరు జన్మలో వెంటాడి, వేటాడుతుంది. అలా కర్మఫలం ఆ జీవుడు అనుభవించేదాకా కరగదు, తరగదు. వెయ్యి ఆవుల నడుమ ఉన్నా లేగదూడ తన తల్లిని గుర్తుపట్టి.. ఎలా దగ్గరికి చేరుతుందో.. అలా కర్మఫలం జీవుణ్ణి మరుజన్మలో పట్టుకుంటుంది. జీవితంలో కోరికలు గుర్రాలై దౌడు తీస్తున్నప్పుడు కళ్లెంతో అదుపు చెయ్యలేని, చేతకాని రౌతులా జీవుడుంటే జరిగేది ఇదే. అయితే ఈ కర్మఫలాన్ని అగ్గిరవ్వ దూదిపింజను దహించినట్టు మాడ్చి మసిచేసే ఉపాయం ఒకటుంది. ఒక శక్తిని సంపాదించుకుంటే.. దీన్నుంచి తప్పించుకోవచ్చు. ధ్యానం, తపస్సు, బీజాక్షర మంత్రజపాలతో ఆ శక్తి వస్తుందని నిరూపించే పురాణ కథల్లో.. సత్యవ్రతుడు, జడభరతుల కథలు ప్రధానమైనవి.

ఒకే ఒక్క బీజాక్షరం

దేవీ భాగవతంలో ఉతధ్యుడి కథ ఉంది. అతడో పండిత పుత్రుడు. కానీ.. గ్రహింపుశక్తి లేని అమాయక జీవి. అతడికి ఏం చెప్పినా అర్థంకాదు. నోట మాట కూడా లేదు. చుట్టుపక్కల వారితో పాటు తలిదండ్రులు కూడా ఆ అమాయకత్వానికి విసిగి చీదరించుకోసాగారు. దైవలీలగా ఆ ఛీత్కారాలు, అవమానాలు అంతటి అమాయకుణ్ణీ ఆలోచనలో పడేశాయి. ఇక తాను ఎవరికీ భారం కాకూడదు అనుకున్నాడు. ఇల్లు విడిచి గంగా తీరానికెళ్లాడు. ఓ ప్రశాంత ప్రదేశంలో ఉంటూ, దొరికింది తింటూ కాలం గడపసాగాడు. ఓ రోజు వేటగాడు- అడవిపందిని వేటాడుతుంటే.. అది పరుగెత్తుకొచ్చి ఉతధ్యుడున్న ఆశ్రమంలోని పొదలో దాక్కుంది. ఆ హడావుడికి అప్రయత్నంగా అతడి నోటి నుంచి ‘ఐ’ అనే అక్షరం వచ్చింది. అది సారస్వత బీజాక్షరం. ఆర్తితో త్రికరణ శుద్ధిగా పదేపదే ఆ అక్షరాన్ని పలకడంతో జగజ్జనని కరుణించింది. సద్బుద్ధితో పాటు వాల్మీకి మహర్షి అంతటి తెలివితేటలు కూడా క్షణాల్లో ప్రాప్తించాయి. ఇంతలో వేటగాడు అక్కడికొచ్చాడు. తాను వేటాడుతున్న మృగం గురించి అడిగాడు. ఉతధ్యుడు సందిగ్ధంలో పడ్డాడు. వాస్తవం చెబితే ఒక జీవిని హింసించిన పాపం వస్తుంది. రాలేదంటే- అసత్య దోషం అంటుకుంటుంది. ఆ సందిగ్ధంలోనే ఓ ఆలోచన తట్టింది. ‘నన్నడిగితే ఏం చెప్పనయ్యా? చూసిన కంటికి నోరు లేదు, అది చెప్పదు. చెప్పే నోటికి కన్ను లేదు, అది చూడలేదు. అందువల్ల విశాల అడవిలో నీక్కావలసిన ఆహారం దొరుకుతుంది.. అటు వెళ్లు’ అన్నాడు. ఆ మాటలు వేటగాడికీ నచ్చి, అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు. దాంతో ఊపిరి పీల్చుకున్న ఉతధ్యుడు బీజాక్షర మంత్రాన్ని మరింత సాధన చేశాడు. అపార జ్ఞానం వచ్చింది. ఎప్పుడూ సత్యమే పలుకుతూ ఉండటంతో ఉతధ్యుడికి సత్యవ్రతుడనే పేరొచ్చింది. అలాగే భాగవతం అయిదో స్కంధంలో జడభరతుడి కథ ఉంది. ఎంతో తెలివైన భరతుడనే రాజు- మనసు మాయకు లొంగి సంసార బంధాల్లో చిక్కి జడభరతుడయ్యాడు. ఒకసారి జడత్వం ఆవరించిన భరతుడితో సంభాషించిన రహూగణ రాజు.. జడభరతుడి తెలివిని గ్రహించాడు.

మానసిక ఆరోగ్యం లేకున్నా.. దాని మీద నియంత్రణ లేకున్నా.. ప్రమాదాలు వాటిల్లుతాయి. అశాంతి, ఆందోళన ఆవరిస్తాయి. మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉండటానికి, మనసును అదుపులో పెట్టుకోవటానికి ధ్యానం, తపస్సుతో పాటు సిద్ధాసనం, ఆంజనేయాసనం, ఉత్థానాసనం లాంటి యోగాసనాలు కూడా ఉపకరిస్తాయి.  

డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని