బలవంతులే ఆధ్యాత్మిక సాధకులు

స్వామి వివేకానంద తమిళనాట ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తున్న రోజులవి. ఒకరోజు సాయంత్రం వారు బస చేసిన విడిదికి బక్కపలచగా, బలహీనంగా ఉన్న ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు.

Published : 02 Nov 2023 00:42 IST

స్వామి వివేకానంద తమిళనాట ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తున్న రోజులవి. ఒకరోజు సాయంత్రం వారు బస చేసిన విడిదికి బక్కపలచగా, బలహీనంగా ఉన్న ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు. అప్పుడే స్వామీజీ వ్యాయామం చేసి గదిలోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆ యువకుడు ‘స్వామీ! నేను ఆధ్యాత్మిక సాధన చేయాలనుకుంటున్నాను. మీ వద్ద శిష్యుడిగా చేర్చుకుంటారా?’ అనడిగాడు. అతడి వాలకం చూసి ‘ఓ చేతిలో భగవద్గీతను ధరించి ఉండవచ్చు గాక, కానీ మరో చేతిలో ఫుట్‌బాల్‌ ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మిక సాధన చేయగలరు’ అన్నారాయన. ‘నేను ఎంచుకోవాలనుకున్న మార్గానికి ఆటలు, వ్యాయామాలు ఎందుకు స్వామీ?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు యువకుడు. వివేకానంద చిరునవ్వు నవ్వి ‘యుక్త వయసులో చక్కటి దారుఢ్యంతో ఉండాలి. బలహీనంగా ఉండేవాళ్లు సులువుగా వ్యామోహాలకు లొంగిపోతారు. శారీరక సామర్థ్యం మానసిక బలానికి కారణమవుతుంది. అలాంటివారు ప్రలోభాలు లేకుండా ఆత్మనిగ్రహాన్ని పాటించగలరు. ఒక్క మాటలో చెప్పాలంటే బలవంతులే ఆధ్యాత్మిక సాధనకు అర్హులు’ అని ఉద్ఘాటించారు. అందుకే స్వామి వివేకానంద సన్యాసం స్వీకరించిన వారిని విధిగా వ్యాయామం చేయమనేవారు. కబడ్డీ, వాలీబాల్‌ వంటి ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించేవారు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని