ధ్యానం అహరహితం.. కాలాతీతం..

నిరంతర వర్తమానాన్ని అనుభూతిస్తూ పోవటమే ధ్యానం. ధ్యానంలో క్షణికంగా మెరిసే అహరహిత స్థితి- సక్రమ సాధన, సరళమైన జీవనం ద్వారా నిరంతరమై వెలుగుతుంది. అలా జీవిత ప్రయాణంలో ప్రతి క్షణమూ ధ్యానంగా మారడమే యోగం.

Updated : 02 Nov 2023 05:31 IST

నిరంతర వర్తమానాన్ని అనుభూతిస్తూ పోవటమే ధ్యానం. ధ్యానంలో క్షణికంగా మెరిసే అహరహిత స్థితి- సక్రమ సాధన, సరళమైన జీవనం ద్వారా నిరంతరమై వెలుగుతుంది. అలా జీవిత ప్రయాణంలో ప్రతి క్షణమూ ధ్యానంగా మారడమే యోగం.

అంతరాంతరాల్లోకి వెళ్లి చూస్తే ప్రతి మనిషీ తపించేది- కాలాతీత స్థితి, అహరహిత(నేను అనే భావన లేని) స్థితి కోసమే. ఈ ప్రపంచాన్ని, కాలాన్ని, చివరికి తన అస్తిత్వాన్ని కూడా మర్చిపోయే అలాంటి క్షణాలు కొన్ని సందర్భాల్లో లభిస్తాయంటారు. కలలు లేని గాఢ నిద్రలో మనం ఒకరు ఉన్నామనే స్పృహ కూడా ఉండదు. శృంగారంలో భావప్రాప్తి క్షణాల్లో కొద్దిసేపైనా సరే.. అహం పూర్తిగా నశిస్తుంది. ఏదైనా కళ లేదా సౌందర్య ఆస్వాదనలో పూర్తిగా మునిగినప్పుడు మనసు పనిచేయడం ఆగిపోతుంది, కాలం స్తంభిస్తుంది. ప్రమాదపు అంచున అత్యంత అప్రమత్తతతో ఉండే క్షణాల్లో ఆలోచనలు ఆగిపోతాయి. ‘నేను’ అనే భావన అదృశ్యమౌతుంది. మృత్యువు అంచున విన్యాసాలు చేయాలనిపించడం లేదా అలాంటివి చూడాలనే ఉబలాటం వెనుక కారణం ఇదే. ఇక మరణస్థితిలో అహం, కాలం ఉండే ప్రసక్తి లేదు. ఆసక్తికరమైన విషయమేంటంటే, ధ్యానంలో పొందే శూన్యస్థితి కూడా ఇలాంటిదే. మిగతావి ఎప్పుడో అనుకోకుండా.. ప్రత్యేక సందర్భాల్లో లభించేవి కాబట్టే, మనకు మనంగా చేయగల ధ్యానసాధనకు ఇంత ప్రాధాన్యం వచ్చింది. ఒక కవి అన్నట్లు- ‘ఆధ్యాత్మిక సాధన అంతా మనని మనం మర్చిపోవడానికి. మన ఆలోచనలు ఎక్కడో ఉండి చివరికి ఎక్కడా లేకుండా అయిపోతాయి.. అప్పుడూ నిజమైన ఆనందం!’

ఉనికి ఒక్కటే చాలు..

కాయకష్టం చేసుకునే పేదవాడు సినిమా లాంటి వినోద కాలక్షేపంలో మునిగిపోయి తాత్కాలికంగానైనా తనను తాను మర్చిపోతాడు. ఒకింత తీరిక ఉన్నవాళ్లు ఏ సంగీతం లాంటి కళనో, నైపుణ్యాన్నో ఆస్వాదిస్తూ అందులో లీనమైపోతారు. ఈ కళాస్వాదన, నైపుణ్యం ఎక్కువైన కొద్దీ దాన్ని అనుసరించి, అనుకరించే శక్తి బలపడుతుంది. సాధనతో క్రమక్రమంగా ఆ కళ లేదా నైపుణ్యం సృజనాత్మకతను సంతరించుకుంటుంది. అలా ఆ కళాకారుడు లేదా నిపుణుడు తానే ఒక సరికొత్త విషయాన్ని సృష్టిస్తాడు. అది కొత్త సంగీతమో, కవిత్వమో, వినూత్న ఆలోచనో, విజ్ఞాన సంబంధ ఆవిష్కరణో- ఏదైనా కావచ్చు! అలాంటి వ్యక్తులు తమ సృజనాత్మక సాగరంలో తామే మునిగి.. ప్రపంచాన్ని మర్చిపోతారు. గొప్ప కళాకారుల అనుభవానికి వచ్చే ఆ స్థితిని.. ఆధునిక మనోవైజ్ఞానికులు ‘ఫ్లో స్టేట్‌’ అన్నారు. ధ్యానంలోనూ జరిగేదదే. ధ్యానం చేస్తున్న వ్యక్తిని గమనిస్తే- బయట ప్రపంచంతో మొదలై, దాని తాలూకు ఆలోచనలు, తాను ధ్యానం చేస్తున్నాననే స్పృహ, ఎంచుకున్న ధ్యాన వస్తువు.. ఇలా క్రమంగా అన్నీ లయమైపోయి చివరికి ‘ధ్యాత’ (ధ్యానించే వ్యక్తి) కూడా మాయమయ్యే సమాధి స్థితి వస్తుంది. అలా ధ్యానం ద్వారా పొందే శూన్యస్థితి.. మిగిలినవాటి కంటే ప్రత్యేకమైంది. ఉన్నతమైందని కూడా అనిపిస్తుంది. మిగతా సందర్భాల్లో మన అస్తిత్వాన్ని మర్చిపోవడానికి బాహ్య ప్రపంచం నుంచి ఊతంగా ఏదో ఒక వస్తువో, కళో, నైపుణ్యమో, సృజనాత్మకతో అవసరమౌ తుంది. కానీ ధ్యానం ద్వారా అహం, కాలం కరిగిపోవడానికి ఒక సాధారణ వ్యక్తికి తన ఉనికికి మించి ఇంకేమీ అక్కర్లేదు! అలాగే, ధ్యానంలో మొదట క్షణికంగా మెరిసిన ఆ ఆలోచనా రహిత స్థితి- సక్రమ సాధన, సరళమైన జీవన విధానం ద్వారా నిరంతరమై వెలుగుతుంది. అలా, జీవిత ప్రయాణంలో ప్రతి క్షణమూ ధ్యానంగా మారిన వ్యక్తి యోగి సమానుడైపోతాడు.

వర్తమానాన్ని నుభూతించాలంతే..

మనోరహిత శూన్యానికి ధ్యానం ఒక మార్గం కావచ్చు. కానీ, ఏదో అలౌకిక అనుభవం ఉంది, దాన్ని చేరుకోవాలి- అని ఆశించడం మొదలైతే మళ్లీ మనం ‘కాలం’ వలలో చిక్కుకున్నట్లే. అలాంటి లక్ష్యంతో చేసే ‘ప్రయత్నం’ ఎప్పటికీ ధ్యానం కాబోదు. గతం, భవిష్యత్తులతో నిమిత్తం లేకుండా.. మంచి-చెడుల చీటీలు, తప్పొప్పుల ఎంపికలు లేకుండా.. ఎరుకతో నిరంతర వర్తమానాన్ని అనుభూతిస్తూ పోవటమే ధ్యానం. ఈ సత్యాన్ని గుర్తెరిగి ధ్యాన మార్గంలో పయనించే వారికి తలవని తలంపుగా ఎదురయ్యేది అహరహితమూ, కాలాతీతమూ అయిన శూన్య స్థితి. అదే మన నిజమైన మౌలిక స్థితి.

ఈదర రవికిరణ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని