లక్ష్మీవిలాసం చిత్రాతిచిత్రం

లోకేశ్వరుడికే అర్థం కాదు సిరి విశేష విన్యాసం. ఏ క్షణంలో ఎవరిని భాగ్యవంతులను చేస్తుందో, ఎవరిని భాగ్యహీనులుగా మారుస్తుందో ఎవరికీ అంతుచిక్కదు.

Updated : 09 Nov 2023 09:42 IST

లోకేశ్వరుడికే అర్థం కాదు సిరి విశేష విన్యాసం. ఏ క్షణంలో ఎవరిని భాగ్యవంతులను చేస్తుందో, ఎవరిని భాగ్యహీనులుగా మారుస్తుందో ఎవరికీ అంతుచిక్కదు. ఎవరినెలా వరిస్తుందో, ఎవరినెందుకు వదిలి వెళ్తుందో బోధపడదు. అదే పద్మాలయ లీల, పద్మవాస హేల!

దారిద్య్రాన్ని పోగొట్టి సిరులు కురిపించే దివ్యలక్ష్మి ఆ ధనలక్ష్మి. కూడు, గూడు, వస్త్రం.. సమృద్ధిగా, సౌకర్యంగా ఉంటేనే.. పరోపకారం, పారమార్థికతల గురించి ఆలోచించ గలం. ముందు ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకుంటే.. ఆ ఇంట జీవకళ తాండవిస్తుంది. ఈ సందేశం తోనే దీపావళి పర్వదినాన దీపలక్ష్మితో పాటు ధనలక్ష్మిని ఆరాధించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే మన సనాతన ధర్మం కలిమికి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో, లేమికి కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే దారిద్య్రాన్ని ‘అలక్ష్మి’ అని నిర్వచించింది. ఆ ‘అలక్ష్మి’ని సాగనంపి, ‘ధనలక్ష్మి’ని స్వాగతించే పర్వదినాన్నే దీపావళిగా పేర్కొంది. దుఃఖం, నిరాశ, నిరుత్సాహం, వ్యతిరేక భావనలు, క్రోధాది దుర్గుణాలు, అజ్ఞాన జనిత ఆలోచనలు, విభేదాలు, వైషమ్యాలు ‘అలక్ష్మి’ లక్షణాలు. అవి దారిద్య్రపు చిహ్నాలు. తొలుత జ్ఞానానికి ప్రతీక, సర్వదేవాత్మకం అయిన ‘దీపలక్ష్మి’ని వెలిగించి- ‘అలక్ష్మి’ చిహ్నాలను మనసనే గృహం నుంచి నిష్క్రమింపచేయమని ప్రబోధిస్తుంది దీపావళి. ఆపై సంతోషం, సహనం, ఆశావహ దృక్పథం, సానుకూల భావనలు, శాంతి, సంతృప్తి, సౌమ్యత, మైత్రి, ప్రేమ భావనలకు ఆలవాలమైన ధనలక్ష్మికి ఆహ్వానం పలకమని పిలుపునిస్తుంది. ఇహంలో, పరంలో దుఃఖస్పర్శ లేని సుఖసంతోషాలను ఆకాంక్షించే సదాచారం ఈ పండుగలో ఉందన్నారు ఆధ్యాత్మిక సాధకులు.

ధార్మికులకే ధనలక్ష్మి ఆశీస్సులు

‘ధర్మమార్గంలో ఆర్జించిన ఐశ్వర్యంపైనే ధన్మలక్ష్మి ఆశీస్సులు ఉంటాయి. ఆ సిరిసంపదలే సుఖసంతోషాలనిస్తాయి. శాంతిని ప్రసాదిస్తాయి. అలాగే దానధర్మాలు చేసేవారి ఇళ్లలోనే సిరి సద్వినియోగమవుతుంది, స్థిరంగా ఉంటుంది’ అన్నారు రామకృష్ణ పరమహంస. ‘సిరి’ అంటేనే స్థిరంగా ఉండేది కాదని అర్థం. అందుకే ధనలక్ష్మికి చపల, చల అనే నామాలు ఉన్నాయి. అయితే ఆ నారాయణి మహానేర్పరి. ఆమె చపలచిత్తం వెనుక నిగూఢమైన పారమార్థిక రహస్యం దాగి ఉంది. మన ప్రవృత్తులను పరీక్షించి, మనకు పాఠాలు నేర్పటానికే ఆ విష్ణువల్లభ అలా వ్యవహరిస్తుంది. అందుకే తాళ్లపాక అన్నమాచార్య కూడా ఆ తల్లి వైఖరిని వర్ణిస్తూ- ‘రూకలై మాడలై రువ్వలై తిరిగీని.. దాకొని ఉన్నచోట తానుండ దదివో..’ అన్నారో కీర్తనలో. శ్రీలక్ష్మి ఒకచోట స్థావరం చేసుకొని ఉండదు, రూకలుగా, మాడలుగా, రువ్వలుగా మారుతూ లోకమంతా సంచరిస్తుందని భావం. (రూక-రూపాయిలో నాలుగో భాగం, మాడ- అర వరహా విలువైన బంగారు నాణెం. రువ్వ- పైసాలో సగం) ధనలక్ష్మి స్థిరంగా ఉండదని- ఆనాటి నాణేలతో అలా వర్ణించారు.

దైవీగుణాలున్నచోటే ధనలక్ష్మి

అహింస, శాంతి, సహనం తదితర దైవీగుణాలున్న చోటే సిరి కొలువై ఉంటుందని ధర్మశాస్త్రాలు ఘోషించాయి. ఒక పురాణ కథనాన్ని అనుసరించి- తొలుత లక్ష్మీదేవి రాక్షసులను ఆశ్రయించే ఉండేదట. హఠాత్తుగా ఓ రోజు దేవతల వద్దకు వెళ్లిపోయింది. అలా ఆమె స్వర్గంలోకి రావటం చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ‘అమ్మా! ఇన్నాళ్లూ మా ప్రత్యర్థులైన దైత్యుల దగ్గరే ఉన్నావు. ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చావు?’ అనడిగాడు. అప్పుడామె విషాద వదనంతో ‘వాళ్లు గుణహీనులయ్యారు. అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. అహంకారంతో అడ్డూ అదుపూ లేకుండా నడచుకుంటున్నారు. అందుకే ఇక్కడికి వచ్చేశాను’ అంది. నేటికీ అన్వయమయ్యే లక్ష్మీనివాస కథ ఇది.

దీపావళి దివ్యసందేశం

సరస్వతీ కటాక్షం ఉన్నవారికి లక్ష్మీకటాక్షం ఉండదంటారు. అది భ్రమ. సరస్వతి ఉన్న చోట లక్ష్మి సుస్థిరంగా, సంతోషంగా ఆవాసం చేస్తుంది. ఐశ్వర్యానికి జ్ఞానం మరింత శోభనిస్తుంది. శ్రద్ధ, మేధ, జయం, ధైర్యం, సంపద, తేజస్సు తదితరాలన్నీ ఆ శ్రీలక్ష్మి విభూతులేనని దీపావళి దివ్య సందేశాన్నిస్తుంది. ఆ తల్లి నుంచి ఆ లక్షణాలను సంప్రాప్తించుకున్న జ్ఞానయోగులు, కర్మయోగులు మాత్రమే ధనలక్ష్మిని సద్వినియోగం చేసుకోగలరు. పటాటోపాల కన్నా పరోపకారానికి, స్వార్థప్రయోజనాల కన్నా సత్కర్మాచరణకు సిరిసంపదలను వినియోగించగలరు. దీపకళికను లక్ష్మీరూపంగా భావిస్తారు. దీపరాత్రి లక్ష్మీపూజకు ప్రధానమంటారు. ఆనందం, ఐశ్వర్యం అనే భావనలకు దేవతారూపం ఇస్తే.. అదే లక్ష్మీదేవి అని- అనుభూతి చెందుతారు దేవీ ఉపాసకులు. నరులను దురవస్థకు గురిచేసేది లేమి. ఆ దారిద్య్రస్థితి నరకంతో సమానం. ఇంటి నుంచి ఆ నరకాన్ని పారదోలి ధన్మలక్ష్మిని స్వాగతించే ఆనందకేళి దీపావళి.

బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని