సామాజిక శాంతి.. పారమార్థిక కాంతి

శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం  ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే.. అన్నారు. దీపం శుభం చేకూరుస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. సంపదలను అందిస్తుంది. శత్రువును అంతమొందిస్తుంది.

Published : 09 Nov 2023 00:42 IST

శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం  ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే.. అన్నారు. దీపం శుభం చేకూరుస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. సంపదలను అందిస్తుంది. శత్రువును అంతమొందిస్తుంది. అంత మహిమాన్వితమైన దివ్వెల పండుగ దీపావళి.

న సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయి పండుగలు. ఒక్కో పండుగ వెనుక అనంతమైన అంతరార్థాలున్నాయి. అవి మన జీవితాన్ని ప్రతిబింబింప చేస్తాయి. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ చందాన ధర్మాన్ని స్థాపించటం కోసం పరమాత్మ అవతరించి నప్పుడల్లా ప్రాణికోటికి అదొక పండుగే. అలాంటి పర్వదినాల్లో ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు వచ్చే దీపావళి ఒకటి. ‘దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే!’ అన్నారు. దీపం వెలుగుకు చిహ్నం, జ్ఞానానికి ప్రతీక అజ్ఞానమనే రాక్షస సంహారం. అనంతరం జ్ఞానం అనే దీపం ప్రకాశిస్తుంది. అందుకు గుర్తుగా దీపావళి వేడుక చేసుకుంటాం.

వసుధైక కుటుంబానికి సంకేతం

పరమాత్మ ఉనికిగా భావించి, లోకాలను భయభ్రాంతులను చేసే నిలువెత్తు అహంకార నరకాసురుణ్ణి సంహరించిన శుభవేళ దీపాలను వెలిగించి అందరూ తమ హృదయాల్లో పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. దీపావళి రోజున ప్రధానంగా దీపాలు వెలిగించడం, ఉల్కాదానం, అష్టలక్ష్ములుగా ఉన్న అమ్మవారిని ధనస్వరూపుడైన కుబేరుని సహితంగా ధనలక్ష్మిగా ఆరాధించడం- అనే మూడు అంశాలను పాటించాలి. పంచాయతన సంప్రదాయంలో దీపాన్ని సుబ్రహ్మణ్య స్వరూపంగా భావిస్తారు. అమావాస్య, పౌర్ణమి వంటివి పూర్ణతిథులుగా ప్రసిద్ధం. అవి శక్తి ఆరాధనకు ప్రధానమైనవి. అందువల్ల ఈ అమావాస్య పగటివేళ పితృకార్యాలు నిర్వహించి, ప్రదోష వేళ కుబేరలక్ష్ములను ఆరాధిస్తారు. ఈరోజు యమారాధనకు కూడా ప్రాధాన్యత ఉంది. ఒక్క దీపం అనంత చీకట్లను తరమగలదు. చీకటివేళ అంతులేని వెలుగులీనే దీపాలతో, బాణసంచాలతో అందరూ ఏకమై, చీకటిని పారదోలటం అనేది వసుధైక కుటుంబానికి సంకేతంగా నిలుస్తుంది.

ఆశ్వయుజంలో ఆదిశక్తికి కైంకర్యం

దీపావళి స్త్రీ శక్తి ఎంతటిదో తెలియజేస్తుంది. సత్యభామ వంటి సుకుమారి అంతటి ఘోరమైన నరకాసురుని సంహరించటం అనేది స్త్రీ అబల కాదు, సబల అనే అంశాన్ని లోకానికి తెలియజేస్తుంది. అలాగే పుత్రుడైనా కూడా లోక కంటకుడైతే (ముల్లు) అతణ్ణి తల్లిదండ్రులు శిక్షించాలనే ధర్మ సూక్ష్మాన్ని నేర్పుతుంది. మన సంప్రదాయంలో ఇలాంటి ధర్మ ప్రబోధక పండుగలు అనేకం కనిపిస్తాయి. ఆశ్వయుజంలో ఆదిశక్తికి కైంకర్యం బాగా చేస్తారు.

కోటి దీపాల వెలుగులు ఒక పెద్ద కాంతి పుంజమై అనంత కాలరాత్రులను చీల్చుకుంటూ పరమాత్మను దర్శింపచేస్తాయి. వర గర్వంతో విర్రవీగితే చివరికి దుర్మరణం తథ్యమని చాటి చెబుతుందీ పండుగ. దేవుడి అవ్యాజ కారుణ్యానికి నిదర్శనమే దీపావళి. భగవంతుణ్ణి నమ్ముకుంటే తానే మన చేయి పట్టుకుని గమ్యాన్ని చేరుస్తాడు. నరకాసురుడి బారి నుంచి ప్రజలను కాపాడింది సత్యభామ. ఆమె వెనుక ఉండి కథ నడిపించింది పరమాత్మ. అంతా తామే చేస్తున్నాం- అనుకునేవారికి భగవంతుడు చెప్పే పాఠం నరకాసుర వధ. ఈ సందర్భంగా బాణసంచా పేల్చటం సంతోషానికి చిహ్నమే కాదు.. ఈ కాలంలో వచ్చే క్రిమికీటకాలను సంహరించడంలోనూ దోహదం చేస్తుంది. ఈ వేడుక సామాజిక శాంతి, పారమార్థిక కాంతి.

పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంతో చేసుకునే వేడుక దీపావళి. ఇది దుఃఖాన్ని పోగొట్టి జ్ఞానానందాన్ని ప్రసాదిస్తుంది. మన చుట్టూ చీకటిని తలపించే భయానక సమస్యలు కమ్ముకున్నా.. భగవంతుని ఎదుట భక్తి, ప్రేమ అనే దీపాలు వెలిగిస్తే, అవి పటాపంచలౌతాయి. అప్పుడు అంతరంగంలో జ్యోతిలా ప్రకాశిస్తాడు భగవానుడు. ఈ సంగతి గుర్తుంచుకుంటే- ప్రతిరోజూ దీపావళిలా వెలుగులు చిందుతాయి.    

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప, శతావధాని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని