అదే అసలైన భక్తి!

ధర్మనిష్ఠ, దానధర్మాలు, అతిథి సత్కారాలకు పెట్టింది పేరుగా జీవించేవాడో భక్తుడు. ఓ రోజు రాత్రి కుటుంబసభ్యులు, పనివారు కూడా నిద్రపోయాక తలుపు చప్పుడైంది.

Updated : 30 Nov 2023 17:05 IST

ర్మనిష్ఠ, దానధర్మాలు, అతిథి సత్కారాలకు పెట్టింది పేరుగా జీవించేవాడో భక్తుడు. ఓ రోజు రాత్రి కుటుంబసభ్యులు, పనివారు కూడా నిద్రపోయాక తలుపు చప్పుడైంది. అతడెళ్లి తలుపు తీస్తే ఓ వృద్ధుడు- ‘అన్నం  తిని వారమైంది’ అన్నాడు దీనంగా. హృదయం ద్రవించి, ‘అయ్యా! భగవంతుడి తరఫున నా ఆతిథ్యం స్వీకరించి, అనుగ్రహించు’ అన్నాడు. వృద్ధుడు భిక్ష ఆరగించి ‘అన్నం పెట్టిన మీకు కృతజ్ఞతలు. కానీ భగవంతుడి ప్రస్తావన ఎందుకు మధ్యలో? ఆయనపై నాకు నమ్మకం లేదు’ అన్నాడు. అది విని భక్తుడు నిశ్చేష్టుడయ్యాడు. పరమాత్మ ఉనికిని ప్రశ్నిస్తాడేంటని బాధపడ్డాడు. వృద్ధుడు అంతటితో ఆగకుండా ‘కనిపించని ఆ దేవుణ్ణి నమ్మడం వృథా!’ అంటూ  ఎద్దేవా చేశాడు. దాంతో భక్తుడు ఆగ్రహించి.. అతడి ముందున్న పళ్లెం లాక్కుని బయటకు గెంటేశాడు. ఆ రాత్రి కలలో దైవం కనిపించి- ‘ఆకలి తీరకుండానే ఆ వృద్ధుణ్ణి గెంటేశావేం నాయనా?’ అన్నాడు బాధగా. ‘నిన్ను విశ్వసించని వ్యక్తిపై కనికరం ఎందుకు? అందుకే ఆ నాస్తికుణ్ణి తరిమేశాను స్వామీ!’ అన్నాడు. అది విన్న పరమాత్మ ‘నాయనా! ఏళ్ల తరబడి అతను నా ఉనికిని సందేహిస్తూ, నిందిస్తున్నా.. భరిస్తూనే ఉన్నాను. అతడి అవసరాలు తీరుస్తూనే ఉన్నాను. నా కోసం నువ్వు ఒక్కరోజు ఆ అభాగ్యుణ్ణి భరించలేవా? నన్ను నమ్మినవాళ్లనే కాదు నమ్మనివాళ్లనూ ఆదరించాలి. వాళ్లే అసలైన భక్తులు’ అన్నాడు. నాస్తికుల్నీ ఆదరించే స్వామి అవ్యాజ ప్రేమ ఆ భక్తుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని