విజయ మార్గాలు సూచించే గీత

భగవద్గీత నదీ ప్రవాహం. అందరికీ సమ్మతమైన జీవన విధానం. అందుకే ‘గీత మత గ్రంథం కాదు, దివ్య జీవన ప్రబంధం’- అన్నారు వేదాంతులు. ‘గీత చదివినంత మాత్రాన తలరాత మారుతుందా?’- అని వ్యంగ్యంగా మాట్లాడేవారున్నారు.

Updated : 21 Dec 2023 04:22 IST

డిసెంబరు 23 గీతా జయంతి

గవద్గీత నదీ ప్రవాహం. అందరికీ సమ్మతమైన జీవన విధానం. అందుకే ‘గీత మత గ్రంథం కాదు, దివ్య జీవన ప్రబంధం’- అన్నారు వేదాంతులు. ‘గీత చదివినంత మాత్రాన తలరాత మారుతుందా?’- అని వ్యంగ్యంగా మాట్లాడేవారున్నారు. కానీ పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు.. తలపట్టుకుని కూర్చుంటే లాభంలేదు, సాధించేందుకు నడుం బిగించాలని ప్రబోధిస్తుంది గీత. రణరంగంలో దిగులుగా కూలబడ్డ అర్జునుని కర్తవ్యపాలన చేయమంటూ ఉత్తేజపరిచాడు శ్రీకృష్ణుడు. గీతోపదేశం సమస్త లోకానికీ ఒక మేలుకొలుపు. స్వధర్మాన్ని అనుసరించడం పరమార్థ సాధనకు దారిదీపం అని తెలుసుకున్న వెంటనే గాండీవం ధరించి, ధర్మసమరం సాగించాడు అర్జునుడు. ధర్మం గెలిచింది, అధర్మం అంతరించింది. నిత్యజీవితంలో కష్టసుఖాలు సహజ పరిణామాలు. ఆపద రాగానే కలవరపాటుతో కుంగిపోకూడదు. అలాగే సుఖసౌఖ్యాలు అనుభవిస్తూ ఒళ్లు మరిచి పోకూడదు. ఎలాంటి పరిస్థితిలోనైనా నిలకడగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలుకుతుంది. మన జీవితంలోనూ విజయం సాధించే మార్గాలను సూచిస్తుంది గీత. భారతంలో భగవద్గీతతో పాటు మరో ఇరవై నాలుగు గీతోపదేశాలు కనిపిస్తాయి. వనవాసం వల్ల అనుభవిస్తున్న బాధను పోగొట్టడానికి పాండవులకు బంధమే అన్ని దుఃఖాలకూ మూలమని శౌనక మహర్షి తెలియజేశాడు. అదే శౌనక గీత. అడవిలో ద్రౌపది కష్టపడుతోందని బాధపడుతున్న ధర్మరాజుకు, మార్కండేయ మహర్షి సావిత్రి కథతో ఉపదేశం చేశాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోరుతున్న ద్రౌపదికి కాశ్యపగీత హితవు పలికింది. పగ, ప్రతీకారాలు మనల్నే దహిస్తాయని వివరించాడు కాశ్యపుడు. ధర్మవ్యాధుడు కౌశికుడికి స్వధర్మం గురించి బోధించిన పాఠం వ్యాధగీత. వీటిని గీతామాత విశ్వరూప దర్శనం అనొచ్చు. భారతంలో పలుమార్లు పాండవులకు విశ్వరూపం చూపించాడు కృష్ణుడు. వారి జీవితాలు ధన్యమయ్యాయి. అమృతతుల్యమైన ఆ మకరంద ధారలను సదా ఆస్వాదిస్తూ ఆనందించాలని ఏటేటా గీతా జయంతి గుర్తుచేస్తుంది.

ఉప్పు రాఘవేంద్రరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని