పోషకుడు, పాలకుడు అతడే!

ఇంగ్లండ్‌ పాత్రికేయుడు పాల్‌ బ్రంటన్‌, ఆధ్యాత్మిక అన్వేషి.. రమణాశ్రమంలో కొన్నాళ్లు ఉన్నాడు. ఓ ఉదయం రమణ మహర్షి ఎదుట తన సందేహాలు నివృత్తి చేసుకుంటూ ‘స్వామీ! చుట్టూ పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.

Published : 28 Dec 2023 00:04 IST

డిసెంబరు 30 రమణ మహర్షి జయంతి

ఇంగ్లండ్‌ పాత్రికేయుడు పాల్‌ బ్రంటన్‌, ఆధ్యాత్మిక అన్వేషి.. రమణాశ్రమంలో కొన్నాళ్లు ఉన్నాడు. ఓ ఉదయం రమణ మహర్షి ఎదుట తన సందేహాలు నివృత్తి చేసుకుంటూ ‘స్వామీ! చుట్టూ పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఈ ప్రపంచ భవిష్యత్తు ఏంటోనని అయోమయంగా ఉంది’ అన్నాడు. రమణులు తమ సహజ మందహాసంతో ‘వర్తమానం గురించే సరిగా తెలియదు. ఇక రేపటి గురించి ఎందుకు బాధ? ఈ నిమిషం గురించి జాగ్రత్త వహించండి. భవిష్యత్తు తన జాగ్రత్త తను చూసుకుంటుంది’ అన్నారు. అప్పుడతను ‘ఈ లోకం మైత్రి, పరస్పర సహకారాలతో ముందుకు వెళ్తుందా? లేక కల్లోలం, యుద్ధాలతో అస్తవ్యస్తమవుతుందా?’ అన్నాడు. రమణులు ‘పోషించేవాడు, పాలించేవాడు ఒకడున్నాడు. ఆ భారం ఆయన బాధ్యత. ప్రాణం పోసినవాడికి, దాన్నెలా కాపాడాలో తెలుసు. నువ్వెలాగో ప్రపంచం అలా! అది నీ ప్రతిబింబం. నిన్ను నువ్వు తెలుసుకోకుండానే సర్వాన్నీ అర్థం చేసుకోవాలంటే ఎలా? ఇటువంటి సందేహాలు శక్తిని వ్యర్థం చేస్తాయి. మొదట మీ వెనుక ఉన్న సత్యాన్ని గ్రహించగలిగితే.. లోకం వెనుక ఉన్న అర్థం బోధపడుతుంది’ అంటూ ప్రత్యక్షంగా ఆ పాత్రికేయుడికి, పరోక్షంగా అందరికీ ప్రబోధించారు.

పనులు ఆటంకమా?

‘ఆధ్యాత్మిక జీవితానికి పనులు అడ్డంకి అవుతాయా’ అని ఓ భక్తుడు అడిగితే.. రమణులు ‘దేహమున్నంత కాలం ఏదో ఒక వ్యాపారం సాగుతూనే ఉంటుంది. ‘నేనే కర్తను’ అనే దృక్పథం పోవాలి. అదే అసలైన ఆటంకం, పనులు కాదు’ అన్నారు. అలాగే ఒక సంఘ సంస్కర్త ‘అన్ని ప్రాంతాలకూ వెళ్లి పరిస్థితులను చక్కబెట్టాలని నా ఆశ. అందుకు తగిన శక్తిని మీరు ప్రసాదిస్తారని వచ్చాను’ అన్నాడు. మహర్షి నర్మగర్భంగా నవ్వి ‘ఆ సంస్కరణ ఏదో మీతోనే ప్రారంభించండి, తర్వాత ఇతరుల సంగతి చూడ వచ్చు’ అన్నారు. ఆధ్యాత్మిక జీవితానికి అహంభావం తొలి ఆటంకమని గుర్తుచేసే వారు. ‘మనమెంత అణకువగా ప్రవర్తిస్తే అంత మేలు ఒనగూరుతుంది’ అనేవారు. వ్యక్తి ఆరాధన వద్దనేవారు. తమ దేహాన్ని పూజించడాన్ని ఎన్నడూ ప్రోత్సహించేవారు కాదు. ఎవరైనా పూలమాలలు వేయబోయినా, పూజ చేయబూనినా వారించేవారు.

కరుణార్ద్రహృదయులు..

రమణులు ఏ కష్టాలూ తెలియని వాళ్లను చూసే విధానం వేరు. దీనులను చూసే విధానం వేరు. శరణాగతుని దైన్యం చూసి రమణుల కళ్లు చెమర్చేవి. ఆ ఆర్ద్రత చూసే.. ‘మహర్షి సన్నిధిలో ఉండటమంటే, స్వర్గంలో ఉన్నట్లే నాకు! రమణులు ఎలా కనిపించారో రాయాలంటే నాకున్న భాషాజ్ఞానం చాలదు. సాధారణంగా ఆయన మాట్లాడేవారు కాదు. వారి పెదాల్లోంచి ఒక్క మాట వస్తే విగ్రహం పలికినంత ఆశ్చర్యంగా ఉండేది. అన్నిటినీ మించి వారి మెరిసే కళ్లను గమనించేదాన్ని. చీకట్లో కూడా అవి మెరుస్తూనే ఉండేవి. వారు మన వైపు చూస్తే ఆ చూపు ఓ బాణంలా హృదయంలోకి దూసుకుపోయేది’ అన్నారు మహర్షి సన్నిధిలో తరించిన ప్రముఖ రచయిత చలం కుమార్తె సౌరిస్‌.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని