అది లోకోత్తర ప్రేమ!

కారాగారంలో జన్మించి, గోకులంలో పెరిగిన శ్రీకృష్ణుడు ఈ విశ్వంలోని సమస్త జీవుల హృదయాల్లో పరమాత్మగా భాసిస్తున్నాడు. అలాగని సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్ముడే భగవద్గీతలో తెలియజేశాడు.

Published : 28 Dec 2023 00:14 IST

కారాగారంలో జన్మించి, గోకులంలో పెరిగిన శ్రీకృష్ణుడు ఈ విశ్వంలోని సమస్త జీవుల హృదయాల్లో పరమాత్మగా భాసిస్తున్నాడు. అలాగని సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్ముడే భగవద్గీతలో తెలియజేశాడు. తన దయార్ద్రహృదయంతో ఆర్తులపై ప్రేమ కురిపించడమే కృష్ణుడి అవతార స్వభావం. సర్వజ్ఞుడు, అనంత సృష్టికారకుడు అయిన గోవిందుడు.. బంధుప్రీతి కన్నా, ప్రేమ బాంధవ్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. తన బావమరిది శిశుపాలుణ్ణి, పాండవులతో సమాన బంధువులైన కౌరవుల్నీ ఆయన క్షమించకపోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. జగద్గురువుగా లోకాన్ని సముద్ధరించిన వాసుదేవుడు- కన్నతండ్రి మాట కూడా లక్ష్యపెట్టక.. తననే విశ్వసించిన భక్త ప్రహ్లాదుణ్ణి అడుగడుగునా కాపాడాడు. నిశ్చల భక్తితో తనను ఆరాధించిన మీరాబాయికి.. విషాన్ని- అమృతంగా మార్చి ఇచ్చాడు.

కంసుడికి కృష్ణుడిపై విరోధ భావన. గోపికలకు నల్లనయ్య మీద అంతులేని ప్రేమ. అయితేనేం.. గోపికలతో పాటు కంసుడు కూడా ఆధ్యాత్మిక లోకానికే వెళ్లాడని పురాణ కథనం. అలాగే కృష్ణుడికి విషం ఇచ్చేందుకు వచ్చింది పూతన. ఆమె వల్ల అపాయం జరుగుతుందేమో అన్న అనుమానంతో.. యశోద కృష్ణుణ్ణి వేయికళ్లతో కనిపెట్టుకొని ఉండేది. యశోద, పూతనల ఉద్దేశాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి. కానీ, వారిద్దరూ కూడా ఒకే విధమైన ఫలితాన్ని పొందారు.

పూతన తనకు చనుబాలను ఇవ్వడం వల్ల.. ఆమెను తల్లిగా భావించాడు కృష్ణుడు. యశోద వెళ్లిన పుణ్యలోకాలకే.. పూతనను కూడా పంపాడు. అందువల్లే అమృత హృదయుడైన శ్రీకృష్ణపరమాత్ముడి ప్రేమను- లోకోత్తర ప్రేమగా వర్ణిస్తారు.

చోడిశెట్టి శ్రీనివాసరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని