ఏదైనా భగవత్‌ ప్రసాదమే!

శ్రీమహావిష్ణువు వామన అవతారం ఎత్తి దానవేంద్రుడైన బలి చక్రవర్తిని మూడడుగులు దానం అడిగాడు. ఒక అడుగుతో భూమండలాన్ని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు పెట్టేందుకు చోటు లేక.. బలి చక్రవర్తినే ఆ స్థానమేదో చూపమన్నాడు. అప్పుడు ఆ దానశీలి తన శిరస్సుపైనే మూడో అడుగును మోపమన్నాడు.

Published : 11 Jan 2024 00:10 IST

శ్రీమహావిష్ణువు వామన అవతారం ఎత్తి దానవేంద్రుడైన బలి చక్రవర్తిని మూడడుగులు దానం అడిగాడు. ఒక అడుగుతో భూమండలాన్ని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు పెట్టేందుకు చోటు లేక.. బలి చక్రవర్తినే ఆ స్థానమేదో చూపమన్నాడు. అప్పుడు ఆ దానశీలి తన శిరస్సుపైనే మూడో అడుగును మోపమన్నాడు. మరుక్షణమే జగన్నాటక సూత్రధారి తన పాదాన్ని ఆ రాక్షసరాజు తలపై పెట్టాడు. అధఃపాతాళానికి అదిమేసేందుకు సిద్ధమయ్యాడు. అయినా తన పతనాన్ని కూడా ఆ అసురపతి ధీశాలిగా అంగీకరించాడు. అలా వామనమూర్తి- బలిని శిక్షించే ప్రదేశానికి, ఆ చక్రవర్తి పితామహుడైన ప్రహ్లాదుడు, ఆయన ధర్మపత్ని వింధ్యావళి, చతుర్ముఖ బ్రహ్మ తదితరులు విచ్చేశారు. తన మనవడి అహంకారాన్ని అణచేందుకు జగన్నాథుడు చేసిన లీలకు ప్రహ్లాదుడు హర్షాన్ని వ్యక్తం చేశాడు. కానీ అర్ధాంగి అయిన వింధ్యావళి మాత్రం విషణ్ణ వదనంతో ‘స్వామీ! నా భర్త తాను ఇచ్చిన మాటకు కట్టుబడి, ఎలాంటి సంశయం లేకుండా నువ్వు అడిగినదంతా ధారాదత్తం చేశాడు కదా! మరి అలాంటి నా ప్రాణనాథుణ్ణి ఎలా బంధించావు? ఇది నీకు ధర్మమా?’ అని కన్నీటితో ప్రశ్నించింది. ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా ‘ఓ దేవదేవా! బలి చక్రవర్తి గొప్పదాత. నీకు తన సంపదలన్నింటినీ తృణప్రాయంగా సమర్పించాడు. ఇతడు శిక్షింప తగినవాడు కాదు, దయ చూపదగినవాడు. నువ్వు లోకాధిపతివని తెలిసినా, రాజ్యమంతా ఇచ్చాడు. ఇటువంటి వాణ్ణి ఇలా శిక్షించటం న్యాయమా?’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు పరమదయాళువైన ఆ పరంధాముడు ప్రసన్నవదనంతో మందస్మితుడై ‘ఎవరిపై నేను కరుణ చూపాలని అనుకుంటానో.. మొదట వారి సకల సంపదలనూ హరిస్తాను. వారిలో వైరాగ్యం అంకురించేలా చేస్తాను. సంసార సంబంధమైన మైకంలో ఎవరు లోకాన్నీ, నన్నూ ధిక్కరిస్తారో.. వారు ఎల్లకాలం ఎన్నో రూపాలుగా పుడుతూ దుర్గతిని పొందుతారు. ధనం, వయసు, రూపం, విద్య, బలం, ఐశ్వర్యం, కర్మ, జన్మ మొదలైన వాటి వల్ల వచ్చే గర్వాన్ని విడిచిపెట్టి ఎలాంటి మాలిన్యం లేకుండా ఉండేవారిని రక్షిస్తాను. నన్ను నమ్ముకున్నవాళ్లు ఎన్నడూ లోభం, అభిమానం, సంసారం, వైభవం అనే వాటి వల్ల చెడిపోరు’ అని విస్పష్టం చేశాడు. వామనమూర్తి రూపంలో పరమాత్మ చెప్పిన ఈ మాటలు సమస్త మానవాళికీ ఊరట వచనాలు. జీవితంలో మనం కష్టాల్ని అనుభవిస్తుంటే, దేవుడి కళ్లు మనల్ని చూస్తున్నాయనీ, తన ప్రతిబింబాన్ని మనలో చూసుకునే దాకా ఆయన ధ్యాసంతా మన మీదే ఉంటుందనీ మరచిపోకూడదు. అందుకే నిజమైన భక్తులు ఎలాంటి కష్టనష్టాలు కలిగినా- అవి భగవంతుడు ప్రసాదించిన వరాలుగానే భావిస్తారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని