ఆనందనిలయం నుంచి అలమేలు మంగకు సారె

ఆమె పద్మోద్భవ, పద్మముఖి. ఆ దేవి పద్మాక్షి, పద్మప్రియ. ఆ తల్లి పద్మహస్త, పద్మసుందరి. అంతటి మహిమాన్విత, మహామాత పద్మావతిగా శ్రీవేంకటేశ్వరుని వక్షస్థలంపై కొలువుతీరింది. కోటిప్రభలతో...

Updated : 25 Nov 2021 06:15 IST

నవంబరు 29 నుంచి డిసెంబరు 8 వరకు తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ఆమె పద్మోద్భవ, పద్మముఖి. ఆ దేవి పద్మాక్షి, పద్మప్రియ. ఆ తల్లి పద్మహస్త, పద్మసుందరి. అంతటి మహిమాన్విత, మహామాత పద్మావతిగా శ్రీవేంకటేశ్వరుని వక్షస్థలంపై కొలువుతీరింది. కోటిప్రభలతో భక్తుల పాలిట కొంగుబంగారమై కరుణరసాన్ని కురిపిస్తోంది. అలమేలు మంగగా, ఆపదమొక్కులవాడికి సమంగా ఆరాధనలు అందుకుంటోంది.

తిరుమలలో తండ్రి శ్రీనివాసుడు అధినేత అయితే, తిరుచానూరులో తల్లి పద్మావతి అధినేత్రి. అయ్య వారిది సూర్యప్రభ అయితే, అమ్మవారిది చంద్రప్రభ! అలమేలు అర్ధభాగమై లేనినాడు మంగపతి వైభవమూ అసంపూర్ణమేనని భక్తుల విశ్వాసం. స్వామివారి తిరుమల క్షేత్రం ఎంత ప్రాచీనమో, శ్రీలక్ష్మికి నెలవైన తిరుచానూరూ అంతే ప్రాచీనం. ఒకే దివ్యశక్తి రెండు రూపాలుగా ఇరుక్షేత్రాల్లో ప్రకటితమవుతోంది.
ఈ క్షేత్రానికి అలమేలుమంగపట్నమని కూడా పేరు. పూర్వం ఇక్కడ శుకమహర్షి ఆశ్రమం ఉన్నందున శ్రీశుకుని ఊరుగా పిలిచేవారట. అదే ‘తిరుశుకనూరు’గా ‘తిరుచ్చుకనూరు’గా కాలక్రమంలో ‘తిరుచానూరు’గా మారిందంటారు. ఊరి నడిబొడ్డునున్న పద్మ సరోవరమనే కోనేటిలోనే సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి బంగారుపద్మంలో అవతరించిందని పురాణ కథనం. ఆ దేవే పద్మావతి, అలమేలుమంగ పేర్లతో పూజలు అందుకుంటోంది.

తిరుచానూరులోనే తిరుమల బ్రహ్మోత్సవాలు...

సరైన రవాణా సౌకర్యాలు లేని కాలంలో తిరుమల బ్రహ్మోత్సవాలను తిరుచానూరులోనే నిర్వహించేవారట. తిరుమలలో ధ్వజారోహణం మాత్రం నిర్వహించి, తక్కిన వాహనసేవలన్నీ తిరుచానూరులోనే జరిపేవారట.
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో పంచమి రోజు అమ్మవారు అవతరించిన రోజు. ఆ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నుంచి పద్మావతీదేవికి పసుపు కుంకుమలు, చందనం, చీరసారె, ప్రసాదాలు పంపటం ఆనవాయితీ. ఆ రోజు తిరుమల నుంచి అర్చకులు, భక్తులు కాలినడకన, ఏనుగులపై సారెను సంప్రదాయబద్ధంగా తిరుచానూరుకు మంగళ వాయిద్యాలతో తీసుకొస్తారు. వాటితో పద్మసరోవర తీరాన పద్మావతి అమ్మవారికి, సుదర్శన భగవానునికి ఎంతో వైభవంగా తిరుమంజనం నిర్వహిస్తారు.

- ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని