తులసీపత్ర వ్రతమా... ఒద్దొద్దు!

వస్తు సేకరణ ప్రమాదకరమని చెబుతుండేవారు రమణ మహర్షి. అనేక సందర్భాల్లో ఆచరించి చూపారు కూడా. ఒకసారి ఓ భక్తుడు వెండి కప్పులు, కంచాలు ఇస్తే, ఆయన వెనక్కి పంపించేసి నొచ్చుకోవద్దని చెప్పారు.

Published : 13 Oct 2022 00:26 IST

వస్తు సేకరణ ప్రమాదకరమని చెబుతుండేవారు రమణ మహర్షి. అనేక సందర్భాల్లో ఆచరించి చూపారు కూడా. ఒకసారి ఓ భక్తుడు వెండి కప్పులు, కంచాలు ఇస్తే, ఆయన వెనక్కి పంపించేసి నొచ్చుకోవద్దని చెప్పారు. పక్కనున్న శిష్యుడితో ‘మన కప్పులున్నాయి కదా!’ అంటూ నవ్వి, కొద్ది దూరంలో ఉన్న కొబ్బరి చిప్పల్ని చూసి తల పంకించారు. అవే వారి కప్పులు. ఖరీదైన సామాన్లను ఆశ్రమంలో పోగుచేస్తే వాటిని కాపలా కాయడానికి శిష్యుల సమయం వ్యర్థమవుతుంది అన్నారోసారి. మరో భక్తుడు రమణులకు వెండి పాదుకల పైన బంగారు పువ్వులు తాపడం చేయించి బహుమానంగా ఇవ్వబోతే ‘దేవుడిచ్చిన కాళ్ల కన్నా ఇవేం ఎక్కువ కాలం పని చేయవు కదా’ అన్నారు.

రమణ మహర్షి సహజ సామగ్రితోనే అనేక వస్తువులు రూపొందించేవారు. ఉన్నవి విరిగిపోతే మరమ్మతులు చేసేవారు. ఒకసారి ఆయన ధరించే గోచీకి చిరుగులు పడ్డాయి. దాన్ని చూస్తూ ‘ఇంద్రుడికి వెయ్యి కళ్లన్నట్టుగా నా కౌపీనానికి ఎన్ని కళ్లో!’ అంటూ నవ్వి, తుమ్మ ముల్లును సూదిగా చేసి రంధ్రాలను కుట్టేశారు. ఒక భక్తుడు పంఖా ఇవ్వబోతే తన చేతులనూ, పక్కనే ఉన్న విసనకర్రనూ చూపి.. ‘ఇవి చాలవా?’ అన్నారు. మరోసారి ఒక భక్తురాలు తాను లక్ష తులసీ పత్ర వ్రతం చేయబోతున్నట్టు చెప్పింది. ఆయన ఆందోళనగా ‘వద్దు.. వద్దు! తులసీపత్ర వ్రతం చేసే బదులు లక్షసార్లు నీ చేతిని నువ్వు గిల్లుకో’ అన్నారు. లక్ష తులసి ఆకులను సేకరించేందుకు లక్షసార్లు తులసి మొక్కలను గాయపరచొద్దనేది భావం. ఏ రూపంలోనూ, ఎవరినీ హింసించకూడదన్నది రమణుల హితబోధ.

- శ్రావణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని