చావుభయం

కొడుకు చెడు ప్రవర్తన తట్టుకోలేక తల్లడిల్లిపోయేదో తల్లి. ఎంత హితబోధ చేసినా అతడి బుద్ధి మారలేదు. ఒకసారి గౌతమబుద్ధుడి దగ్గరికి తీసుకు వెళ్లమని ఇరుగుపొరుగు సలహా ఇచ్చారు

Updated : 14 Dec 2022 11:11 IST

కొడుకు చెడు ప్రవర్తన తట్టుకోలేక తల్లడిల్లిపోయేదో తల్లి. ఎంత హితబోధ చేసినా అతడి బుద్ధి మారలేదు. ఒకసారి గౌతమబుద్ధుడి దగ్గరికి తీసుకు వెళ్లమని ఇరుగుపొరుగు సలహా ఇచ్చారు. రానన్న కొడుకును బతిమాలి తీసుకెళ్లింది. అంతా విన్న బుద్ధుడు అతడి ముఖంలోకి తేరిపార చూసి ‘లాభంలేదు. ఇతడి ఆయువు ఒక్కరోజే మిగిలింది’ అన్నాడు. ఘొల్లున ఏడ్చింది తల్లి. మృత్యుభయంతో యువకుడు వణికిపోయాడు. విషయం ఊరంతా తెలిసిపోయింది. స్నేహితులు కన్నీరు కార్చారు. తల్లీ కొడుకులు మృత్యుభయంతో తెల్లవార్లూ అలా కూర్చుండిపోయారు.

ఉదయం గౌతమబుద్ధుడు వచ్చి ‘రాత్రి నిద్రపట్టిందా’ అనడిగాడు. లేదన్నాడు యువకుడు. ‘నిన్న ఎవర్నయినా మోసగించబోయావా?’ అనడిగితే లేదని శాంతంగా బదులిచ్చాడు. మరేం చేశావని అడిగితే మరుజన్మలోనైనా జీవితం విలువ తెలిసేలా అనుగ్రహించమని రాత్రంతా దైవాన్ని ప్రార్థించానన్నాడు.

‘నాయనా! ఎవరు, ఎప్పుడు ఎలా చనిపోయేదీ ఎవరికీ తెలియదు. నీ విషయమూ అంతే. జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని తపించావు చూడు.. ఇకపై అలాగే జీవనం సాగించు. అమ్మకి చేదోడుగా ఉండు. నువ్వు చావును చూశావు. ఇప్పుడు మరోజన్మ ఎత్తావు’ అన్నాడు శాంతంగా. అతడి కన్నీటితో బుద్ధుడి పాదాలు తడిశాయి.

శ్రీపద అగ్నిహోత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని