పరమాత్ముడికి నచ్చిన ప్రార్థన

జీవన సాఫల్యానికి భక్తి అవసరం. ప్రార్థనలూ ప్రవచనాలతో దేవుడి పట్ల విశ్వాసం ప్రకటించడమే భక్తి. ఉదయం స్నానానంతరం దైవ స్తోత్రాలు పఠిస్తాం.

Published : 04 May 2023 00:11 IST

జీవన సాఫల్యానికి భక్తి అవసరం. ప్రార్థనలూ ప్రవచనాలతో దేవుడి పట్ల విశ్వాసం ప్రకటించడమే భక్తి. ఉదయం స్నానానంతరం దైవ స్తోత్రాలు పఠిస్తాం. పుస్తకం చూసి కొందరు పఠిస్తే, కంఠస్థం చేసినవారు కళ్లు మూసుకుని స్మరిస్తారు. ప్రార్థన ఎలా ఉందన్నది కాదు, ఎంత శ్రద్ధ అన్నదే ముఖ్యం.

ఒకసారి లోకజ్ఞానం లేని వ్యక్తి సంతకు వెళ్లాల్సివచ్చింది. ప్రార్థనకు సమయం లేదు. తర్వాత ప్రార్థన చేయొచ్చులెమ్మని భక్తిపుస్తకం తీసుకుని బయల్దేరాడు.
సంతలో రద్దీ వల్ల పుస్తకం పోయిందని గుడికి వెళ్లాకే గమనించాడు. దుఃఖం కలిగింది. ‘క్షమించు స్వామీ! ప్రార్థనాగ్రంథం లేనందున శ్లోకాలు చదవలేను. అయితేనేం. అక్షరాలన్నీ వచ్చు కదా! ఏ భక్తిగీతాలైనా వాటితోనే రాస్తారుగా! కనుక అక్షరాలన్నిటినీ చదివేస్తాను. దాన్నే ప్రార్థనగా స్వీకరించు స్వామీ.. అ..ఆ..ఇ..ఈ.. ఉ..ఊ..’ అంటూ భక్తిగా పదేపదే పఠించాడు.

సరిగ్గా అప్పుడే దేవతల సభ జరుగుతోంది. జగన్నాథుడు అందరి వంకా చూస్తూ ‘ఆహా అద్భుత ప్రార్థన విన్నాను. ఎంత హృదయపూర్వకంగా ఉందో’ అంటూ పరవశించిపోయాడు. పరమాత్ముడు హృదయభాషనే ఇష్టపడతాడు మరి. భక్తిభావనే ఆ భాషకు వ్యాకరణం.

బెహరా ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని