మతమంటే విముక్తి

ఒకసారి మత ప్రస్తావన వచ్చింది. అప్పుడు అవతార్‌ మెహర్‌బాబా ‘మతం అనే పదాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు. మతమంటే మనలోని షట్‌ శత్రువులను జయించి బాహ్య జగత్తు నుంచి మనో జగత్తులోకి నడిపించేది.

Updated : 01 Jun 2023 06:27 IST

కసారి మత ప్రస్తావన వచ్చింది. అప్పుడు అవతార్‌ మెహర్‌బాబా ‘మతం అనే పదాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు. మతమంటే మనలోని షట్‌ శత్రువులను జయించి బాహ్య జగత్తు నుంచి మనో జగత్తులోకి నడిపించేది. ఏ మతమైనా మనిషిని అసుర లక్షణాల నుంచి విముక్తులను చేస్తుంది. ఇది మనసులోని మాయా మర్మాలను బయటకుతీసే సాధనం. మత సారాన్ని సరిగా అర్థం చేసుకుంటే సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నట్టే. మనని మనం గెలవాలంటే మతమొక్కటే మంచి అభ్యాసం. మతగ్రంథాల్లోని వాక్యాలను పదిమందికీ చెప్పినంతలో సరిపోదు. వాటిని అనుభూతి చెంది ఆచరణలో పెట్టాలి. లేదంటే ఎన్ని చదివినా, ఎంత చెప్పినా వ్యర్థమే. భిన్న మతాలపట్ల మనకు ఏకీకృత భావన ఉంటే ఆ వ్యక్తి యోగి కిందే లెక్క. మత ఐక్యతా రాగమే నిజమైన యోగం. అలాంటి విశ్వ యోగి సమాజాన్ని ఉద్ధరించగలడు. మతంలోని నిజమైన విలువలు గ్రహిస్తే దానితో అనుసంధానమౌతారు. ఆచరణకు నోచని మతం, ఆకులోని ఆహారాన్ని రుచి చూడకుండా వర్ణనలను వినడం లాంటిదే. అప్పుడు నిజమైన రసానుభూతి కలగదు. మత గ్రంథాల జ్ఞానాన్ని మాటలకే పరిమితం చేయక సమాజ అభ్యున్నతికి వినియోగించే ఆచరణకు దిగాలి. మతాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగితే ఆత్మజ్ఞానం, మనోస్థైర్యం రెండూ లభిస్తాయి. మతం రెండంచుల ఖడ్గం. దాన్ని శ్రేయస్సుకే తప్ప సమాజ వ్యతిరేక అస్త్రంగా వాడకూడదు. అన్ని మతాల్లోని మూలశ్వాస ఒకటే. అదే మనిషి అంతరంగాన్ని శుద్ధి చేయడం. అలా మతసారాన్ని ఎల్ల వేళలా అనుభూతించిన మహానుభావుల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు, బాలమార్కండేయ, భక్త కన్నప్ప తదితరులు ఆదర్శంగా నిలుస్తారు. మతసత్యాలను గ్రహిస్తే మాటలు తగ్గించి సమాజ ఉద్ధరణకు ప్రయత్నిస్తారు. దక్షిణామూర్తి మౌనబధతోనే శిష్యులను ఉద్ధరించాడు’ అంటూ వివరించారు.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని